Share News

మట్టి మనుషుల మహా‘రణం’

ABN , Publish Date - Sep 17 , 2026 | 01:12 AM

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు జరిపిన ప్రతిఘటన పోరాటంలో రక్త తర్పణం చేసిన వీరుల త్యాగాలను సిరిసిల్ల గడ్డ మరువదు.

మట్టి మనుషుల మహా‘రణం’

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు జరిపిన ప్రతిఘటన పోరాటంలో రక్త తర్పణం చేసిన వీరుల త్యాగాలను సిరిసిల్ల గడ్డ మరువదు. సాయుధ పోరులో నైజాంకు వ్యతిరేకంగా అనేక వ్యూహలు, అయుధ శిక్షణ క్యాంపులు జిల్లాలోనే సాగాయి. మట్టి మనుషుల మహారణంలో సిరిసిల్ల ధిక్కార స్వరాన్ని వినిపించింది. రజాకార్ల దౌర్జన్యం, వెట్టి చాకిరిని రూపుమాపడం కోసం సాగిన గెరిల్లా పోరాటాలు పోలీసుల చర్యలు సిరిసిల్లపై చెరగని ముద్ర వేశాయి. మహోజ్వల పోరాటంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గాలిపల్లి గ్రామంతో పాటు అనేక గ్రామాల్లో రక్త తర్పణం చేశారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో సెప్టెంబరు 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రజాపాలన దినోత్సవంగా వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. జాతీయ పతాకాన్ని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్‌ ఆవిష్కరించనున్నారు. తెలంగాణ విమోచన, ప్రజాపాలన దినోత్సవం నేపధ్యంలో జిల్లాలో నిజాం సర్కారుకు వ్యతిరేకంగా సాగిన పోరాట జ్ఞాపకాలను ప్రజలు నెమరువేసుకుంటున్నారు.

దేశమంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్నా నిజాం పాలనలో హైదరాబాద్‌ సంస్థానవాసులు మాత్రం ఆ మధుర క్షణాలను అనుభవించడానికి 1948 సెప్టెంబరు 17 వరకు పోరాడాల్సి వచ్చింది. నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా సాగిన పోరాటాన్ని ప్రజలు మననం చేసుకుంటున్నారు. మహత్తర తెలంగాణ విమోచన పోరులో సిరిసిల్ల ప్రాంత గెరిల్లా యోధులు రక్త తర్పణం చేశారు. జిల్లాలోని ఇల్లంతకుంట మండలం గాలిపల్లికి చెందిన కమ్యూనిస్టు నాయకుడు బద్దం ఎల్లారెడ్డితోపాటు సిరిసిల్లకు చెందిన అమృతలాల్‌శుక్లా, మామిడిపల్లి హన్మంతరావు, సీహెచ్‌ రాజలింగం, నిమ్మపల్లి ఓదెలురెడ్డి, నాగారం కిష్టయ్య, మంచాల రాజేశం, రాగులపల్లి నర్సయ్య, సింగిరెడ్డి భూపతిరెడ్డి.. ఇలా అనేక మంది తెలంగాణ పోరాటంలో పాలుపంచుకున్నారు.

పోరాటాల పురిటి గడ్డ... గాలిపెల్లి

భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం నిరంకుశపాలనపై తిరుగుబావుటా ఎగురవేసిన చిరస్మరణీయ ఘట్టంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గాలిపల్లె అనుబంధం విడదీయరానిది. ఆ పల్లె పోరాటయోధుల ఖిల్లా. తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం సర్కార్‌కు ఎదురొడ్డి తుపాకులు చేతబూని నిలిచింది. తెలంగాణ పోరాటానికి గాలిపెల్లి గ్రామం ముందు పీఠాన నిలిచి నాయకత్వం వహించింది. సిరిసిల్ల పాత తాలూకాలోని గాలిపల్లి ఆశయ సాధన కోసం నేల రాలిన యోధుల జ్ఞాపకాల్లో చరిత్రలో నిలిచిపోయింది. 1930లో స్వాతంత్య్ర పోరులో మహాత్మాగాంధీ పిలుపునందుకొని ఉప్పు సత్యాగ్రహంలో జైలుకు వెళ్లిన తెలంగాణ యోధులు బద్దం ఎల్లారెడ్డి అదే స్ఫూర్తితో పోరాటంలో ముందుకు సాగిపోయారు. ఎంతో మంది గెరిల్లాలను అందించిన గాలిపల్లిలో తెలంగాణ యోధుడు బద్దం ఎల్లారెడ్డి, గెరిల్లా దళనాయకుడు అమృత్‌లాల్‌ శుక్లాతో పాటు ఉద్యమకారులు, దళ నాయకులు గాలిపల్లిలో తలదాచుకుంటున్నారని కలెక్టర్‌తో కలిసి పోలీసు బలగాలు గ్రామాన్ని చుట్టు ముట్టాయి. దీనికి గాలిపల్లి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసు శిబిరంపై దాడి చేస్తామని, అల్గునూరు మానేరు బ్రిడ్జిని కూల్చివేస్తామని నిప్పులు చెరిగారు. బద్దం నర్సింహారెడ్డి, ముస్కానిపేట సూర్యారావు ఇదంతా చూసి ఆయుధాలను దాచిపెట్టాలని నిర్ణయించారు. కలెక్టర్‌తో సహా నిజాం ప్రభుత్వ ఉద్యోగులు, మిలట్రీ పోలీసులు దాదాపు 300 మంది 1947 సెప్టెంబర్‌ 14న గాలిపెల్లిలో ప్రజల గుంపును చూసి పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి వరకు అక్కడే ఉన్న అమృత్‌లాల్‌ శుక్లా పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకున్నాడు. ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రజలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో 14 మంది మృతిచెందారు. ఇలా తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్యభూమికను పోషించిన గాలిపల్లిలో ఆపోరాట స్ఫూర్తిని ప్రజలు ఇప్పటికి తమ జ్ఞాపకాల్లో నిలుపుకున్నారు.

ఉద్యమానికి ఊపిరినిచ్చిన ఆంధ్రమహాసభ

తెలంగాణ సాయుధ పోరాటానికి సిరిసిల్లలో జరిగిన ఆంధ్రమహాసభ ఊపిరినిచ్చింది. 1930లో సురవరం ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన మెదక్‌జిల్లా జోగిపేటలో మొదటి మహాసభ జరిగితే నాలుగవ మహాసభ 1935లో మాడిపాటి హన్మంతరావు అధ్యక్షతన సిరిసిల్లలో భీమకవి నగరంగా జరిగింది. 1944లో నల్గొండ జిల్లా భువనగిరిలో జరిగిన ఆంధ్రమహాసభ తరువాత కాంగ్రెస్‌ వాదులు, కమ్యూనిస్టులకు మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈపరిణామాల్లో గాలిపల్లికి చెందిన బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి తదితర ముఖ్యులు కమ్యూనిస్టు ఉద్యమం వైపు వెళ్లారు. దీంతో రైతాంగ పోరాటాలు మరింత ఊపునందుకున్నాయి. ఈ ఉద్యమంలో 1947లో ఇల్లంతకుంట మండలం గాలిపల్లిలో పోలీసులు జరిపిన కాల్పులకు 14మంది నేలరాలారు. దీంతో గ్రామస్తులు పోలీస్‌ క్యాంప్‌పై దాడి చేసి ఎస్‌ఐతోపాటు ఆరుగురిని చంపారు. ఇదే సమయంలో గర్జనపల్లి, కోనరావుపేట, శివంగాలపల్లి పోలీసు క్యాంప్‌లపై కూడా దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో 1950 జూన్‌ 10న గెరిల్లాలు సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌పై దాడి జరిపి ఆరు తుపాకులు, రెండు 12బోర్‌ తుపాకులను ఎత్తుకెళ్ళారు. గెరిల్లా దళం పోలీస్‌స్టేషన్‌పై కాల్పులు జరిపి ఆయుధాలను ఎత్తుకెళ్ళారన్న వార్త జిల్లా అంత ఆనందోత్సాహాలను నింపింది. స్వాతంత్రోద్యమం, నిజాం పోరాటంలో కూడా తుపాకులు పట్టి మహిళలు ఉద్యమ బాటను పట్టారు. దానికి ఆంధ్ర మహిళా సభ స్ఫూర్తినిచ్చింది. 1935లో సిరిసిల్లలో ఆంధ్రమహిళా సభను మాడపాటి మాణిక్యమ్మ అధ్యక్షతన జరిగింది.

గెరిల్లాల శిక్షణ కేంద్రం మానాల..

నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరు నుంచి మొన్నటి వరకు మావోయిస్టుల దళాలకు ఆశ్రయం ఇచ్చి ఉద్యమ స్ఫూర్తిని మానాల చాటుకుంటుంది. ఎంతో మంది వీరులను తీర్చిదిద్దిన ప్రాంతం మానాల. ఆ ప్రాంతంలో తెలంగాణ పోరాటయోధులకు శిక్షణ జోన్‌గా ఉండేది. సిరిసిల్లకు చెందిన అమృత్‌లాల్‌శుక్లా, బద్దం ఎల్లారెడ్డిల నాయకత్వంలో కరీంనగర్‌, సిరిసిల్ల, కామారెడ్డి, ఆర్మూర్‌, రుద్రంగి తాలూకలకు చెందిన కార్యకర్తలకు ఆ అరణ్యం గాయిది గుట్ట శిక్షణా కేంద్రంగా ఉండేది. కమ్యూనిస్టు గెరిల్లాకు ఆ గ్రామ భూస్వామి రాజిరెడ్డి భోజనాలు సరఫరా చేసేవారు. ఎంతో నమ్మకంగా మానాల స్థావరం ఉండేది. మానాలలో గెరిల్లాలు శిక్షణ పొందుతుండగా... వంద మంది నిజాం సర్కారు పోలీసులు నిర్బంధించి రుద్రంగి క్యాంపునకు గెరిల్లాలను తరలించారు. ఆ తరువాత నీలం కిష్టయ్య, ముదాం ఎల్లయ్య, సిలివేరు ఎల్లయ్య, లకావత్‌ కిషన్‌లను మానాల అడవుల్లోకి తీసుకువెళ్లి వారి చేతనే కట్టెలు కొట్టించి, చితి పేర్చి తుపాకులతో కాల్చి దహనం చేశారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని సాగిస్తూ కమ్యూనిస్టు గెరిల్లాలు బార్డర్‌ క్యాంపులను నెలకొల్పారు. నిమ్మపల్లి, మానాల అడవుల్లో నిజాం సర్కారు పోలీసుల కన్నుగప్పి శిక్షణలు పొందేవారు. సరిహద్దు ప్రాంతాల్లోని చాందా, నాగ్‌పూర్‌, సిరివంచ ప్రాంతాల్లోని కార్యకర్తలకు ప్రసాద్‌ అనే కమ్యూనిస్టు నాయకుడు శిక్షణ ఇచ్చారు. ప్రసాద్‌ నేతృత్వంలోనే అణభేరి ప్రభాకర్‌రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డి, కట్టెపల్లి మురళీధర్‌రావు, కాలువ నారాయణరెడ్డి, నంభయ్య, వెంకట్‌రెడ్డి, పాపయ్య, మల్లారెడ్డి, చొక్కారెడ్డిలాంటి వారెందరో బార్డర్‌ క్యాంపులో శిక్షణ పొందిన వారే. ఇలా గెరిల్లా యోధులకు ఆనాడు అండగా నిలిస్తే... ఆ పోరాట స్ఫూర్తి నక్సల్‌ ఉద్యమంలో కూడా మానాలనే కేంద్రంగా మారింది. ఎన్నో రక్తపు సంఘటనలు చవి చూసింది.

Updated Date - Sep 17 , 2026 | 01:12 AM