ఘనంగా లక్ష్మీ నృసింహుడి ఉత్తర దిగ్యాత్ర
ABN , Publish Date - Mar 07 , 2026 | 12:49 AM
ధర్మపురి క్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం లక్ష్మీ నృసింహస్వామి ఉత్తర దిగ్యాత్ర ఘనంగా నిర్వహించారు.
ధర్మపురి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ధర్మపురి క్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం లక్ష్మీ నృసింహస్వామి ఉత్తర దిగ్యాత్ర ఘనంగా నిర్వహించారు. ఆలయ వేదపండితులు బొజ్జ రమేష్‌శర్మ నేతృత్వంలో వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య లక్ష్మీ నృసింహస్వామి (యోగ, ఉగ్ర) వారల ఉత్సవ మూర్తులను పుర వీధుల గుండా ఉత్తర దిగ్యాత్ర కోసం ఉసిరిక వాగు వద్దకు తీసుక వెళ్లారు. అనంతరం అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద స్వామి వారల సేవలను ఉంచి పూజలు చేశారు. స్వామివారల కళ్యాణం, తెప్పె, డోలోత్సవాలు, దక్షిణ దిగ్యాత్ర అనంతరం ఉత్తర దిశ వైపు యాత్ర నిర్వహించే కార్యక్రమమే ఉత్తర దిగ్యాత్ర చెబుతుంటారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారలను దర్శనం చేసుకున్నారు. ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డి పర్యవేక్షణలో ఎస్‌ఐ మహేష్, పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ జక్కు రవీందర్, ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, సభ్యులు పాల్గొన్నారు.
ఫభక్తుల ప్రత్యేక పూజలు
లక్ష్మీ నృసింహస్వామి, అనుబంధ ఆలయాల్లో శుక్రవారం భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఆలయాల్లో వివిధ రకాల పూజల టిక్కెట్లు కొనుగోలు చేసి భక్తి శ్రద్ధలతో పూజలు జరిపారు. టీటీడీ ధర్మశాల ఆవరణలో రైస్‌మిల్ యజమానులు, ఆర్యవైశ్య, వర్తక, వ్యాపారులు దాతల సహకారంతో 2500 మంది భక్తులకు అన్నదానం చేశారు.
ఫబ్రహ్మోత్సవాల్లో ఆదాయం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రూ.2,13,634 ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ తెలిపారు. ఇందులో వివిధ రకాల పూజల టిక్కెట్లు విక్రయించగా రూ.71,698, ప్రసాదాలు విక్రయించగా రూ.1,04,700 లభించాయి. అలాగే అన్నదానం కోసం భక్తులు సమర్పించిన విరాళాలు రూ.37,236 ఉన్నట్లు ఆయన వివరించారు.
ఫబ్రహ్మోత్సవాల్లో నేడు
బ్రహ్మోత్సవాల్లో శనివారం సాయంత్రం 4 గంటలకు వేంకటేశ్వర స్వామి వారల దక్షిణ, ఉత్తర దిగ్యాత్రలు, రాత్రి 8 గంటలకు దోపోత్సవం (దోపుకథ) ఉంటుంది. శేషప్ప కళావేదికపై శేషప్ప భక్త మండలి ఆధ్వర్యంలో శేషప్ప విరచిత శతపత్రయ పద్య పఠనం, ఎస్ నరేందర్ బృందంచే భక్తి సంగీత విభావరి, రాత్రి వేళలో ( దోపోత్సవం ) దోపుకథ ఉంటుందని ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ తెలిపారు.