Share News

వైభవంగా పార్వతీపరమేశ్వరుల రథోత్సవం

ABN , Publish Date - Mar 09 , 2026 | 12:41 AM

వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న శివకల్యాణ మహోత్సవాలు వైభవంగా జరిగాయి.

వైభవంగా పార్వతీపరమేశ్వరుల రథోత్సవం

వేములవాడ టౌన్‌, మార్చి 8(ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న శివకల్యాణ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం రాజరాజేశ్వరస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం పరివార దేవతలకు ఏకాంతంగా మండప ఆరాధన, అవాహిత హోమం, ఔపాసనం, బలహరణం పూజలు నిర్వహించారు. ఈ శివకల్యాణోత్సవాల సందర్భంగా ఆదివారం సాయత్రం 3.30 గంటలకు రథోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఆలయం ఎదురుగా ప్రత్యేకంగా పూలతో అలంకరించిన పందిరిలో పార్వతీరాజరాజేశ్వరులు, అనంతపద్మనాభ స్వామివారల ఉత్సవమూర్తులను వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య రథాలపై ప్రతిష్టించారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ఈవో రమాదేవిలు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రథోత్సవం మేళతాళాల మధ్య డప్పు చప్పుళ్లతో ప్రారంభమైంది. ఉత్సవంలో రథాలపై పార్వతీరాజరాజేశ్వరులను, అనంతపద్మనాభస్వామివారలను రాజరాజేశ్వరస్వామి దేవాలయం నుంచి వేణుగోపాల స్వామి ఆలయం వరకు వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. రథాలపై ఉన్న ఉత్సవమూర్తులకు వేణుగోపాల స్వామి దేవాలయం వద్ద అర్చకులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. తిరిగి వేణుగోపాల స్వామి దేవాలయం నుంచి మళ్లీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం వరకు రథోత్సవం నిర్వహించారు. అనంతరం శృంగార వసంతోత్సవం అర్చకులు నిర్వహించారు. రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా స్వామివారికి ఆలయ అర్చకులు, వేదపండితులు, జంగమ అర్చకులు వీరభద్ర, శరభ.. శరభ.. శివ.. శివ అంటూ అంటూ ఏకాంత పూజలు నిర్వహించారు. ఈ రథోత్సవంలో భాగంగా ఊరేగింపులో శివపార్వతులు, హిజ్రాలు, పురప్రముఖులు రథాలను లాగుతూ చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆలయంలో అయిదురోజుల పాటు నిర్వహించే శివకల్యాణోత్సవాలు సోమవారం ముగుస్తాయి. ఈ రథోత్సవంలో ప్రధాన అర్చకులు ఉమేష్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు, వైస్‌చైర్మన్‌ నరాల శేఖర్‌, డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ వీరప్రసాద్‌, కౌన్సిలర్‌లు అన్నారం శ్రీనివాస్‌, కొండ రాజశేఖర్‌, తోట రాజు, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, కాంగ్రెస్‌ నాయకులు కట్కూరి శ్రీనివాస్‌, రామతీర్థపు హరీష్‌, బింగి మహేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2026 | 12:41 AM