Share News

మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Jan 20 , 2026 | 12:32 AM

కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వం లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు.

మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం
మహిళా సంఘాలకు చెక్కును అందజేస్తున్న మంత్రి అడ్లూరి

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

జగిత్యాల, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వం లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. సోమవారం పట్టణంలోని సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌తో కలిసి మెప్మా పరిధిలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం మంజూరు చేసిన వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు. ముందుగా ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, కలెక్టర్‌ సత్య ప్రసాద్‌లతో కలిసి జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలోని 939 స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ.2,98,40,444 విలువ గల జంబో చెక్‌ అందించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం మొదటి సంతకం మహాలక్ష్మి పథకం అమలు చేసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను మహిళాభివృద్ధికి ఇస్తుందన్నారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్ధేశ్యంతో అన్నిరకాల పథకాలను మహిళల పేరు మీదనే అమలు చేస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, మహాలక్ష్మి పథకం, సోలార్‌ పవర్‌ ప్లాంట్‌లు, పెట్రోల్‌ బంక్‌, మహిళలకు వడ్డీ లేని ఋణాలు, అద్దెకు బస్సులు అందిస్తుందన్నారు. మహిళలకు నైపుణ్య శిక్షణ, సమావేశ నిర్వహణ కోసం ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణం త్వరలో పూర్తికాబోతున్నదని తెలిపారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడానికి, పేదరికాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందిస్తోందన్నారు. ఈ పథకం ప్రధానంగా స్వయం సహాయక సంఘాల ద్వారా అమలులో ఉందన్నారు. ఈ పథకం ముఖ్య లక్ష్యం మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, చిన్న వ్యాపారాలు మరియు కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడం అని తెలిపారు. వడ్డీ లేని రుణాల వల్ల మహిళలు అప్పుల భారమే లేకుండా తమ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించగలుగుతున్నారన్నారు. రుణాలను కిరాణా దుకాణాలు, పాడి పరిశ్రమ, పశుపోషణ, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, హస్తకళలు, కుటీర పరిశ్రమలు వంటి పనుల కోసం వినియోగిస్తారన్నారు. దీనివల్ల మహిళల ఆదాయం పెరిగి కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ వల్ల మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొంది, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ సత్యప్రసాద్‌, అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్‌, జగిత్యాల మున్సిపల్‌ కమిషనర్‌ స్పందన, మెప్మా పరిపాలన అధికారి దుర్గపు శ్రీనివాస్‌గౌడ్‌, మెప్మా అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Jan 20 , 2026 | 12:32 AM