Share News

పేదల సొంతింటి కల సాకారమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:41 AM

పేదలందరికీ సొంతింటి కల సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ వికలాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

పేదల సొంతింటి కల సాకారమే ప్రభుత్వ లక్ష్యం
ఇందిరమ్మ గృహ ప్రవేశంలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

ఫ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

పెగడపల్లి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): పేదలందరికీ సొంతింటి కల సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ వికలాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. పెగడపల్లి మండలంలోని నంచర్ల గ్రామానికి చెందిన సాయిల్ల సూరమ్మ-మునిలకు చెందిన ఇందిరమ్మ పథకంలో నిర్మించుకున్న నూతన గృహాన్ని గురువారం మంత్రి లక్ష్మణ్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంబించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్‌ కుమార్‌ మాట్లాడుతూ సామాన్య, మద్యతరగతి ప్రజలకు ప్రభు త్వం తోడుగా ఉంటుందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీ మేరకు ఇళ్లు లేని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇళ్లు మంజూరు చేస్తుందన్నారు. ఒక్కో ఇంటికి రూ.ఐదు లక్షలు నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోనే జమ చేస్తున్నట్లు తెలిపారు. ధర్మపురి నియోజకవర్గంలో 3500 ఇండ్లు మంజూరు చేశామని మంత్రి ఈసందర్భంగా పేర్కొన్నారు. మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. కొన్ని సాంకేతిక సమస్యలతో అక్కడ క్కడా కొందరికి బిల్లులు రావడం లేదని ఫిర్యాదులున్నాయని, సాంకేతిక సమస్యలు పరిష్కరించి బిల్లులు చెల్లించే భాద్యత తనదేనన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి నిర్మాణ స్థితికి అనుగు ణంగా డబ్బులు జమ చేస్తున్నట్లు మంత్రి అడ్లూరి తెలిపారు. ఏప్రిల్‌ నెలలో మరింత మందికి ఇళ్లు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అంతకుముందు నంచర్ల గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని మంత్రి లక్ష్మణ్‌ కుమార్‌ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో మండప నిర్మాణంతో పాటు వంటశాల నిర్మాణానికి నెల రోజుల్లో నిధులు మంజూరు చేసి పనులు ప్రారంబిస్తానన్నారు. పురాతన ఆలయమైన నంచర్ల రామాలయానికి భక్తులు రావగానికి గాను పెగడపల్లి యాపల్‌ చెరువు మత్తడి దిగువ నుండి ఉన్న బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి సైతం నిధులు మంజూరు చేయనున్నట్లు మంత్రి లక్ష్మణ్‌ కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్‌ చైర్మన్‌ బుర్ర రాములు గౌడ్‌, సర్పంచ్‌ కుంటాల వనజ శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌ గోళి మహేందర్‌ రెడ్డి, ఉప సర్పంచ్‌ శ్యాంసుందర్‌ రెడ్డి, నాయకులు ఒరుగల శ్రీనివాస్‌, రవినాయక్‌, భాస్కర్‌, తిరుపతి, కిషన్‌, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2026 | 12:41 AM