అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Jan 02 , 2026 | 12:32 AM
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
బుగ్గారం డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బుగ్గారం మండలంలోని సిరికొండ గ్రామంలో నూతనంగా ఎన్నికైన ఇండిపెండెంట్ సర్పంచ్ పంచిత ధర్మరాజు, గ్రామస్థులు, యువతతో కలిసి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజల నమ్మకంతో గెలిచిన సర్పంచ్ ధర్మరాజు కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. సిరికొండ గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొని గ్రామాభివృద్ధికి భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన సర్పంచ్ ధర్మరాజు మాట్లాడుతూ,ప్రజల ఆశయాలకు అనుగుణంగా గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు సాగుతానని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాస్, నాయకులు కుంట మహేస్, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.