ప్రజల అవసరాలు తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Apr 17 , 2026 | 03:05 AM
ప్రజల అవసరాలను గుర్తించి వాటిని నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టిందని కలెక్టర్ గరిమా అగ్రవాల్ పేర్కొన్నారు.
ఇల్లంతకుంట, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి) : ప్రజల అవసరాలను గుర్తించి వాటిని నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టిందని కలెక్టర్ గరిమా అగ్రవాల్ పేర్కొన్నారు. మండలకేంద్రంలోని కళ్యాణమండపంలో గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండలస్థాయిసమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాల ద్వారా భవిష్యత్ ప్రణాళికను రచించడానికి సమావేశాలు దోహదం చేస్తున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాల ద్వారా కుటుంభాలు వీధిన పడుతున్నాయని, ప్రతి వాహనదారుడు వెళ్లింది మొదలు ఇంటికి వచ్చే వరకు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. వైద్యశిబిరాల ద్వారా రోగనిర్ధారన పరీక్షలు నిర్వహించామని, టీబీ ముక్త్ భారత్‌లో భాగంగా 42గ్రామాలలో పరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు. గ్రామాలలో రోడ్ సేఫ్టీ కమిటీ పక్కాగా అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం త్వరలో ప్రారంభం అవుతుందన్నారు. రైతులకు ఉపయోగంగా ఉండే ఆయిల్‌పామ్ సాగును రైతులు చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు అక్వాగార్డ్ యంత్రాలను, దివ్యాంగుడికి వీల్‌చైర్‌ను పంపిణీ చేశారు. సమావేశ ప్రాంగణంలో వ్యవసాయ, ఉద్యావనశాఖ ఆధ్వర్యంలో ఆయిల్‌పామ్, పురుగు మందుల పిచికారీ డ్రోన్, పోషకాలతో కూడిన పదార్థాలతో పాటు వివిధ రకాల స్టాళ్ళు ఏర్పాటుచేయగా ఆకట్టుకున్నాయి. తొలుత తెలంగాణ గీతంతో సమావేశం ప్రారంభం కాగా, సీఎం రేవంత్‌రెడ్డి సందేశం వినిపించారు. సమావేశానికి హజరైన వారితో అరైవ్ అలైన్ కింద ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో వినోద్‌కుమార్, మండల ప్రత్యేకాధికారి రామకృష్ణ, తహసీల్దార్ సురేష్, ఎంపీడీవో శశికళ, సర్పంచ్ మామిడి రాజులతో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.