Share News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

ABN , Publish Date - Nov 07 , 2026 | 12:37 AM

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ డివిజన్‌ బాట.. మేయర్‌ మాట అనే నినాదంతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

కరీంనగర్‌ టౌన్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ డివిజన్‌ బాట.. మేయర్‌ మాట అనే నినాదంతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శుక్రవారం కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్‌ మార్గనిర్దేశంతో ఈ కార్యక్రమాన్ని నగరంలోని 9వ డివిజన్‌లో లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఆ డివిజన్‌ పరిధిలోని కోతిరాంపూర్‌, అల్కపురి ప్రాంతాల్లో కార్పొరేటర్‌ పడిశెట్టి వసంతలక్ష్మిభూమయ్య, మున్సిపల్‌ అధికారులు, సిబ్బందితో కలిసి పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో పాదయాత్రగా పర్యటిస్తూ ప్రజలను కలిసి బాగోగులను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రతి పదిరోజులకు ఒక డివిజన్‌లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి స్థానిక ప్రజలతో మమేకమై వారి సమస్యలను, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై చర్చిస్తామని తెలిపారు. పూర్వపు రాంపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని ఈ ప్రాంతంలో అనేక సమస్యలున్నాయని, ముఖ్యంగా డంపింగ్‌యార్డు ప్రజలను దాదాపు 4,5 దశాబ్దాలుగా పట్టిపీడిస్తోందని అన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్‌ సూచన మేరకు ఇచ్చిన మాటకు కట్టుబడి డంపుయార్డు శాశ్వత సమస్యకు కృషిచేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ వేణుమాధవ్‌, డీఈ దేవేందర్‌రెడ్డి, ఏఈ భీంవర్ధన్‌రెడ్డి, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌ స్వామి, సానిటరీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌, డివిజన్‌ ప్రజలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2026 | 12:37 AM