ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయం..
ABN , Publish Date - Apr 20 , 2026 | 12:16 AM
ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తున్నామని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు.
కరీంనగర్ టౌన్/కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తున్నామని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. నగరంలోని రెండో డివిజన్ తీగలగుట్టపల్లిలో రూ.15 లక్షలతో ఏర్పాటు చేయనున్న ఓపెన్ జిమ్ పనులను మేయర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ స్థానిక మహిళలు, ప్రజల కోరిక మేరకు ఏర్పాటు చేయనున్న ఓపెన్ జిమ్ పనులను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఇక్కడ అన్ని రకాల వ్యాయామ పరికరాలను ఏర్పాటు చేస్తామని, వాటిని ప్రజలు వినియోగించుకోవాలని మేయర్ సూచించారు.
ఫ నేడు చెరువుల పునరుద్ధరణ పనులు ప్రారంభం
నగరపాలక సంస్థ పరిధిలోని కొత్తపల్లి, రేకుర్తి, తీగలగుట్టపల్లి చెరువులను అమృత్-2 పథకంలో సుందరీకరణ, పునరుద్ధరణ పనులను కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్ సోమవారం ప్రారంభిస్తారని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. తీగలగుట్టపల్లిలోని మాలకుంట చెరువు పనులను ఉదయం 9 గంటలకు, కొత్తపల్లి ఊరచెరువు పనులను 9.30 గంటలకు మంత్రి ప్రారంభిస్తారని చెప్పారు.