Share News

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

ABN , Publish Date - Apr 29 , 2026 | 11:58 PM

రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం సంకల్పం తీసుకుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు.

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

కరీంనగర్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం సంకల్పం తీసుకుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఎర్రవల్లి స్వర్ణ మొదటిసారిగా కరీంనగర్‌ జిల్లాకు విచ్చేసిన సందర్భంగా డీసీసీ కార్యాలయంలో మహిళా సాధికారతే లక్ష్యంగా కరీంనగర్‌ జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నరెడ్డి అధ్యక్షతన బుధవారం ఏర్పాటు చేసిన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మహిళా కాంగ్రెస్‌ సమీక్షా సమావేశానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో మహిళలు అని రంగాల్లో ముందు ఉండాలని, మహిళలను కోటీశ్వరులను చేయాలని ఆలోచనతో పెట్రోల్‌ బంక్‌, ఆర్టీసీ బస్సు యజమానులను చేశారని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు యజమానురాలుగా వారి ఖాతాలో ప్రభుత్వం 5 లక్షల రూపాయలు జమచేసి మహిళలకు ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం ప్రారంభించినా మహిళా సోదరీమణుల పేరుతో ఉండాలని గొప్ప ఆలోచన చేసిందన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గంలో ఏడు మండలాలలో ఒక్కొక్క మండలంలో వెయ్యి మంది మహిళలతో ప్రత్యేకంగా ఎన్నికల ప్రచారం సమావేశాలు నిర్వహించి తనను ఈ రోజు ఈ స్థానంలో కూర్చుండబెట్టారని గుర్తు చేశారు. మహిళలు రాజకీయాలలో రాణించాలని, ఉన్నతమైన పదవులు అలంకరించాలని, దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి చట్టసభల ద్వారా వారికి అవకాశం కల్పించాలని కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు దేశవ్యాప్తంగాఎన్నో ఆలోచనలు చేస్తున్నారన్నారు. ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ప్రపంచవ్యాప్తంగా గొప్ప మహిళా నేతగా నేటికీ కీర్తించబడుతున్నారనని పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ఆడపిల్లలు గొప్పగా చదువుకోవాలని ఆలోచనతో టైబ్రల్‌ వెల్ఫేర్‌, బీసీ వెల్ఫేర్‌, మైనారిటీ వెల్ఫేర్‌ ప్రతి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో యంగ్‌ ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలను సీఎం స్థాపించారన్నారు. మహిళలందరీ ఆశీర్వాదంతో నేడు రాష్ట్రంలో ప్రభుత్వం కొనసాగుతుందని, పార్టీ కోసం శ్రమించిన మహిళలకు చట్టసభల్లో అవకాశం తప్పక వస్తుందన్నారు. కష్టకాలంలో పార్టీ కోసం శ్రమించిన మహిళ కార్యకర్తల జాబితాను సిద్ధం చేయండి, తాను, మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌లు కలిసి.. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు అందజేసి వారందరికీ నామినేటెడ్‌ పదవుల్లో అవకాశం ఇవ్వాలని కోరుతాను అని మంత్రి హామీ ఇచ్చారు.

ఫ టీపీసీసీ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ... రాష్ట్రంలో నిరంకుశ పాలనను అంతమొందించి ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిందని, గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నామని అన్నారు. ఈ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, కొత్త రేషన్‌ కార్డులు, పేద ప్రజలందరికీ సన్నబయ్యం అందించాలని ముఖ్యమంత్రి ఆలోచన నేడు ఎంతో మంది కడుపు నింపుతుందన్నారు. గత ముఖ్యమంత్రికి ఈ ఆలోచన రాలేదని, పేదవారి కష్టం తెలుసు కనుక రేవంత్‌రెడ్డి ఇలాంటి ఆలోచనలు చేశారన్నారు. మత రాజకీయాల పేరుతో మనుషులను విడగొట్టి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న బీజేపీని ఎక్కడికక్కడ ఎండగట్టి, ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలని అప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 73, 74 రాజ్యాగం సంస్కరణల ద్వారా మహిళలకు పంచాయతీలలో అవకాశం కల్పింరని, మహిళలు ఏ విషయంలో తక్కువ కారని, కుటుంబ పోషణ, పిల్లల భవిష్యత్తు, భవిష్యత్తు ఆర్థిక అవసరాల కోసం పైసా పైసా కూడబెట్టడం, సామాజిక సేవ, రాజకీయం ఏ విషయంలోను తీసిపోరని, మహిళలు హోమ్‌ మినిస్టర్లుగా పేర్కొన్నారు. బీజేపీ పార్టీ మహిళా రిజర్వేషన్ల బిల్లుకు, డి లిమిటేషన్‌తో ముడి పెట్టారని, మహిళలు పురుషులతో సమానంగా రాబోయే రోజుల్లో కచ్చితంగా రిజర్వేషన్లు సాధిస్తామన్నారు. ప్రతి మహిళ కార్యకర్త క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. సోషల్‌ మీడియాలో కాంగ్రెస్‌ పార్టీ బలహీనంగా ఉందని, గాంధీని చంపిన గాడ్సే గొప్పవాడు అంటే ఎవరు స్పందించడం లేదని, సోషల్‌ మీడియాలో కాంగ్రెస్‌ పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు పోస్ట్‌లు చేసిన దానిని ఖండించవలసిన బాధ్యత ప్రతి మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తపై ఉందన్నారు.

ఫచొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు డాక్టర్‌ మెడిపల్లి సత్యం, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డిలు మాట్లాడుతూ... మహిళలే మొదటి ప్రాధాన్యతగా కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కల్పించామని అన్నారు. ఈ దేశానికి మొట్టమొదటి ప్రధాన మంత్రిగా ఇందిరాగాంధీకి అవకాశం కల్పించింది కాంగ్రెస్‌ పార్టీ అని, ఈ దేశంలో మహిళకు రాష్ట్రపతిగా మహిళకు అవకాశం కల్పించింది కాంగ్రెస్‌ పార్టీ అనే విషయాన్ని చరిత్రలో ఎవరు మరువకూడదన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించింది కాంగ్రెస్‌ పార్టీ అని, చట్టసభల్లో మహిళలకు 33 రిజర్వేషన్లు కల్పించాలని నాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో సోమినియా గాంధీ పార్లమెంటులో బిల్లు పాస్‌ చేయించారని తెలిపారు. నేడు ఎన్‌డీఏ ప్రభుత్వంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు మహిళల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. మహిళా బిల్లు పెట్టాలని తాము మద్దతు ఇస్తామని రాహుల్‌ గాంధీ ఎన్నిసార్లు కోరిన ఏదో విధంగా ఆ బిల్లు వీగిపోయేటట్లుగా, ఏదో ఒక లింకు పెడుతూ మహిళా బిల్లుకు అడ్డుపడుతున్నారని, ఇలాంటి కుట్ర చేస్తున్న బీజేపీని మహిళలు ఎవరు క్షమించరాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు లక్ష కోట్ల రూపాయల రుణాలు ఇస్తూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తుందని, దేశంలో మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ స్థాపించిన ఘనత కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి దక్కిందన్నారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మహిళలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందజేస్తారని, మరొకసారి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలంటే తప్పకుండా మహిళల ఆశీర్వాదం కావాలని అన్నారు. ఈ సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన జిల్లా మహిళా కాంగ్రెస్‌ కమిటీ సభ్యులు, మహిళా మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు, మార్కెట్‌ కమిటీ మహిళా చైర్‌ పర్సన్లు, మహిళా సర్పంచులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మహిళా కాంగ్రెస్‌ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2026 | 11:59 PM