Share News

రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం

ABN , Publish Date - May 07 , 2026 | 01:12 AM

రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు.

రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం

పెద్దపల్లి, మే 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. ఆయన బుధవారం పెద్దపల్లిలో నిర్వహించిన మెగా జాబ్‌ మేళాను, మంథనిలో టాస్క్‌ కేంద్రాన్ని ఆరంభించారు. రూ. 7.30 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న గార్మెంటరీ యూనిట్‌ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. మంథని వ్యవసాయ మార్కెట్‌ యార్డును సందర్శించి తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణతోనే మూడు ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుందని అన్నారు. యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించి ఉపాధి అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో టాస్క్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటి ద్వారా డేటా సైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మల్టీ మీడియా, ఆడియో విజువల్‌ రంగాల్లో శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల కాలంలో గ్రూపు-1 పరీక్షలు ఇప్పుడు, అప్పుడు అంటూ నిరుద్యోగులను మభ్య పెట్టిందన్నారు. ఉద్యోగాలు భర్తీ చేసింది లేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు ప్రైవేట్‌ సంస్థల్లోనూ ఉద్యోగాలు సృష్టిస్తున్నామని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించి నిరుద్యోగులను 12 ఏళ్లుగా మోసం చేస్తున్నదని మండిపడ్డారు. సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో ప్రైవేట్‌ రంగంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుక వస్తున్నామని అన్నారు. ఇటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు యువతకు విద్య, నైపుణ్య శిక్షణ అందిస్తూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని శ్రీధర్‌ బాబు అన్నారు. అకాల వర్షాలు, వడగళ్ల వర్షాల వల్ల తడిసిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దన్నారు. జూన్‌ 2వ తేదీ నాటికి అరన్హులైన వారికి గృహజ్యోతి, రూ. 500కే వంట గ్యాస్‌ వర్తింపజేయడంతో రేషన్‌ కార్డులు జారీ చేస్తామని మంత్రి శ్రీధర్‌ బాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌, జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2026 | 01:12 AM