చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యంగా..
ABN , Publish Date - Apr 18 , 2026 | 02:13 AM
చిన్నారులు, గర్భిణులు, బాలింతల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారంపై అవగాహన కార్యక్రమాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండుసార్లు పోషకాహారంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
- పోషకాహారంపై అవగాహన.. రోజుకో కార్యక్రమం..
- జిల్లాలో ఉత్సాహంగా పోషణ్ పక్వాడ
- 23వ తేది వరకు విస్తృతంగా కార్యక్రమాలు
- జిల్లాలో 586 అంగన్‌వాడీ కేంద్రాలు..
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
చిన్నారులు, గర్భిణులు, బాలింతల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారంపై అవగాహన కార్యక్రమాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండుసార్లు పోషకాహారంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా 8వ పోషణ్ పక్వాడ కార్యక్రమం జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషకాహార విలువలు, పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక థీమ్‌తో నిర్వహించే పోషణ్ పక్వాడ కార్యక్రమాలు జిల్లాలో ఈనెల 23 వరకు కొనసాగనున్నాయి. ఈసారి ‘శిశువు జీవితంలో తొలి ఆరు సంవత్సరాల్లో మెదడు వికాసాన్ని ప్రోత్సహించడం’ నినాదంతో పోషణ్ పక్వాడ కొనసాగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 586 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. సిరిసిల్ల ప్రాజెక్టు పరిధిలో 362 కేంద్రాలు, వేములవాడ ప్రాజెక్టు పరిధిలో 224 కేంద్రాలు ఉన్నాయి. కేంద్రాల పరిధిలో 43 వేల మంది లభోక్తులు ఉన్నారు. ఇందులో ఆరు నెలల లోపు చిన్నారులు 3091 మంది, ఏడు నెలల నుంచి మూడేళ్ల చిన్నారులు 16980 మంది, మూడు నుంచి ఆరు సంవత్సరాల వరకు చిన్నారులు 17338 మంది ఉన్నారు. గర్భిణులు 3793 మంది, బాలింతలు 2430 మంది ఉన్నారు. పోషణ్ పక్వాడ ద్వారా తల్లి, శిశు పోషణ, మెదడు అభివృద్ధికి ప్రారంభ ప్రేరణ పుట్టిన నాటి నుంచి మూడు సంవత్సరాల వరకు ఉంటుంది. మూడు నుంచి ఆరు సంవత్సరాల వరకు బాల్యం ఆరంభ దశగా ఆటల ఆధారిత విద్య, స్ర్కీన్ టైం తగ్గించడంలో తల్లిదండ్రులు, సమాజం పాత్ర, బలమైన అంగన్‌వాడీల కోసం సమాజ మద్దతును పెంపొందించడం, కుటుంబాలు, సమాజాల్లో అవగాహన పెంపు, మెదడు అభివృద్ధి, శారీరక వృద్ధికి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడం వంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
పిల్లల పోషణపై..
జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పిల్లల పోషణపై ప్రధాన చర్చ జరిగేలా టాక్‌షోలు, చర్చలు, సభలను నిర్వహిస్తున్నారు. ఈనెల 23వ తేదీ వరకు రోజుకో కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇప్పటివరకు పోషణ్ పక్వాడ ప్రారంభంలో అంగన్‌వాడీ సిబ్బందికి మొబైల్ ఫోన్లు అందించారు. తర్వాత పోషణ్ పక్వాడాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ కథలు, అమ్మమ్మ, నానమ్మ మాటల్లో పోషణ కథలు చెప్పించడం, గర్భిణులు, పిల్లల కోసం ప్రత్యేక పోషణ ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం, వెయ్యి రోజుల్లో పోషకాహార ప్రాముఖ్యతను వివరించడానికి గర్భిణి, బాలింతలతో సమావేశాలు నిర్వహించడం, స్థానిక ఆహార పదార్థాలు, చిరుధాన్యాలు ఉపయోగించి వివిధ రకాల ఆహార వంటలను తయారు చేయడంపై ప్రదర్శనలు, తల్లులు, సంరక్షకులకు వంటల పోటీలు, జింక్, ప్యాకేజ్డ్ ఆహారాలతో కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలతో ర్యాలీలు నిర్వహించడం వంటివి చేపట్టారు. పిల్లల అభివృద్ధి గుర్తించడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ప్రారంభ ప్రేరణ, బాల్యం ప్రారంభ దశ సంరక్షణ, విద్యపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తల్లి, శిశు పరస్పర సంభాషణలు, ఆటల ఆధారిత సంభాషణ ప్రదర్శనలు, కథలు చెప్పడం భాష అభివృద్ధిపై కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం తల్లిదండ్రులు, అంగన్‌వాడీ సిబ్బంది కలిసి ఆటలతో అభ్యాస కార్యక్రమాల ప్రాముఖ్యతపై చర్చ, శిశు అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యంపై సమావేశం, బొమ్మల తయారీపై వర్క్‌షాప్, జానపద కళల ప్రదర్శన, నిర్వహిస్తారు. 20వ తేదీన అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీస్కూల్ సంసిద్ధత, గ్రాడ్యుయేషన్‌డే నిర్వహిస్తారు. 21న పోర్టల్‌పై అవగాహన, అంగన్‌వాడీల కోసం బొమ్మలు, నేర్చుకునే సామగ్రి, స్టేషనరీ కిట్ల విరాళ డ్రైవ్ నిర్వహిస్తారు. 22 పాఠశాలలు, అంగన్‌వాడీలు, మున్సిపల్, పంచాయతీలలో, మొబైల్ వాడకంతో కలిగే ప్రమాదాలు, కౌన్సెలింగ్, సమావేశాలు, సురక్షిత స్ర్కీన్ పరిమితులు, ఆరోగ్యకరమైన డిజిటల్ అలవాట్లపై వీడియో సందేశాలు ప్రసారం చేస్తారు. 23న నో స్ర్కీన్ హవర్, ఫ్యామిలీ టైం ప్రచారం, బహిరంగ ఆటలు, శారీరక కార్యక్రమాలు, క్రీడలు యోగా ప్రోత్సాహం, పోషణ మేళా కార్యక్రమాలతో పక్వాడ కార్యక్రమాన్ని ముగిస్తారు.
విజయవంతంగా కోషన్ పక్వాడ కార్యక్రమాలు..
- లక్ష్మీరాజం, జిల్లా సంక్షేమ అధికారి
జిల్లాలో విజయవంతంగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషణ్ పక్వాడ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నాం. బాలింతలు, గర్భిణులు, చిన్నారులు తీసుకునే పౌష్టికాహారం, పిల్లల్లో మెదడు అభివృద్ధిపై అవగాహన కల్పిస్తున్నాం. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహార లోపం ఉన్న చిన్నారులను గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నాం. పోషణ్ పక్వాడ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి.