Share News

వస్త్ర పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సంక్షేమమే లక్ష్యం

ABN , Publish Date - Jun 28 , 2026 | 12:33 AM

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ తెలిపారు.

వస్త్ర పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సంక్షేమమే లక్ష్యం

సిరిసిల్ల, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ తెలిపారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ యార్డులో టెస్కొ, చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల వస్త్ర సేకరణ, నేతన్న పొదుపు పథకాన్ని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, దేవాదాయ, పర్యావరణ, అటవీ శాస్త్ర, సాంకేతిక శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి శైలజా రామయ్యర్‌, కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం పలు ప్రతిష్టాత్మక పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రూ 300 కోట్ల బాకాయిలు చెల్లించామని అన్నారు. గత ఏడాది కోటి చీరలు ఉత్పత్తి చేయించామని, ఈ ఏడాది మొదటి విడత కింద 3 కోట్లకుపైగా మీటర్ల ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్‌ ఇచ్చామని, ఇందులో ఇప్పటివరకు 91లక్షల మీటర్ల చీరల బట్ట ఉత్పత్తి చేశారని వెల్లడించారు. గత ఏడాది కోటి చీరలు పంపిణీ చేశామని గుర్తు చేశారు.

త్వరలో మహిళలకు రెండో ఆకు పచ్చరంగులు చీరలు

- ప్రిన్సిపల్‌ కార్యదర్శి శైలజా రామయ్యార్‌

కోటి మంది మహిళలకు కోటి చీరలు అందించాలని ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని దేవాదాయ శాఖ, పర్యావరణ, అటవీ శాస్త్ర, సాంకేతిక శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి శైలజా రామయ్యర్‌ తెలిపారు. త్వరలో రెండో చీర ఆకు పచ్చ రంగు చీరలు మహిళలకు ఇవ్వనున్నామని వివరించారు. సిరిసిల్ల చీరకు మంచి గుర్తింపు వస్తుందని తెలిపారు. నేతన్న పొదుపు పథకం(త్రిఫ్ట్‌) కార్మికుల కోరిక మేరకు రెండేళ్ల కాల పరిమితితో ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. దీనిలో కార్మికులను వేతనాల నుంచి 8శాతం ప్రభుత్వం నుంచి 8శాతం జమ చేస్తుందని తెలిపారు. ఈ పథకం ద్వారా మరమగ్గాల, అనుబంధ రంగాలకు చెందిన 5534 మంది కార్మికులకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు.

కార్మికులకు ఉపాధి..

- కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌

సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు సిరిసిల్లలో గత ఏడాది ఇందిరా మహిళా శక్తి చీరలతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఉపాధి దొరికిందని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తెలిపారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ బాధ్యులు నాణ్యమైన చీరలు ఉత్పత్తి చేస్తున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళ, మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ స్వరూప, కాంగ్రెస్‌ నియోజక వర్గ ఇంచార్జి కేకే మహేందర్‌రెడ్డి, ఆర్డీఓ శ్రీధర్‌ బాబు, తహసీల్దార్‌ మహేష్‌, చేనేత జౌళి శాఖ ఎడి సంతోష్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 28 , 2026 | 12:33 AM