శత శాతం ఉత్తీర్ణతే లక్ష్యం
ABN , Publish Date - Nov 11 , 2026 | 01:20 AM
పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది.
పెద్దపల్లి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో విద్యార్థులను పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధం చేసేందుకు ఉపాధ్యాయులు దృష్టి సారించారు. సాధారణ బోధనకు అదనంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ముఖ్యంగా పరీక్షల్లో వెనుకబడే అవకాశం ఉన్న విద్యార్థులను గుర్తించి, ఆయా సబ్జెక్టుల్లో మెరుగైన అవగాహన కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా బోధన సాగిస్తున్నారు.
ఫ అదనంగా రెండు గంటలు..
పాఠశాలల రోజువారీ బోధనతోపాటు అదనంగా ఉదయం గంట, సాయంత్రం గంట చొప్పున ప్రత్యేక తరగతులు నిర్వహిస్తు న్నారు. పది రోజులుగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. రోజూ ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4.15 నుంచి 5.15 గంటల వరకు విద్యార్థులకు ప్రత్యేక బోధన అందిస్తున్నారు. పాఠ్యాంశాల పునశ్చరణ, కీలక ప్రశ్నల సాధన, గత పరీక్షల ప్రశ్నపత్రాల విశ్లేషణ, సబ్జెక్టుల వారీగా సందేహాల నివృత్తిపై దృష్టి సారిస్తున్నారు. పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించేందుకు అవసరమైన మెలకువలను ఉపాధ్యాయులు వివరిస్తున్నారు.
ఫ 3700 మంది విద్యార్థులు
జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల నుంచి సుమారు 3700 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. జిల్లాలో 103 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 10 కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, 10 తెలంగాణ మోడల్ స్కూళ్లు, ఒక రెసిడెన్షియల్ హైస్కూల్ ఉన్నాయి. మొత్తం 121 విద్యాసంస్థల్లో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ ఉత్తమ ఫలితాల దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు.
ఫ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
ప్రతీ విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేస్తూ సబ్జెక్టుల వారీగా బోధన అందిస్తున్నారు. ఏయే అంశాల్లో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో గుర్తించి వాటిపై మరింత శిక్షణ ఇస్తున్నారు. కేవలం ఉత్తీర్ణత సాధించడమే కాకుండా మంచి గ్రేడ్లు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. విద్యార్థుల్లో పరీక్షలపై భయాన్ని తొలగించి ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ప్రోత్సహిస్తున్నారు. రానున్న రోజుల్లోనూ ఈ ప్రత్యేక తరగతులను నిరంతరాయంగా కొనసాగించి వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యాన్ని చేరుకోవాలని విద్యాశాఖ భావిస్తోంది.
ఫ ఉత్తమ ఫలితాల సాధనకు కృషి
శారద జిల్లా విద్యాశాఖ అధికారి
జిల్లాలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు తగిన కార్యాచరణ రూపొందించాం. వెనుకబడిన విద్యార్థుల గుర్తింపు, వారికి ప్రత్యేక శిక్షణకు ఏర్పాటు చేశాం. పదో తరగతి పరీక్షల్లో జిల్లాను మెరుగైన ఫలితాల దిశగా నిలపాలన్న లక్ష్యంతో కార్యాచరణ అమలు చేస్తున్నాం. రోజూ ఉదయం, సాయంత్రం అదనపు తరగతులు నిర్వహిస్తున్నాం. ఉపాధ్యాయుల సమష్టి కృషితో ఈసారి ఉత్తమ ఫలితాలు సాధిస్తామనే నమ్మకం ఉంది.