Share News

వైభవంగా పార్వతీపరమేశ్వరుల కల్యాణం

ABN , Publish Date - Mar 07 , 2026 | 12:41 AM

వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి సన్నిధిలో పార్వతీపరమేశ్వరుల కల్యాణం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. శివనామస్మరణ, వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఈ వేడుక భక్తులకు నేత్రపర్వంగా నిలిచింది.

వైభవంగా పార్వతీపరమేశ్వరుల కల్యాణం

- భారీగా తరలివచ్చిన భక్తజనం

- పట్టు వసా్త్రలు సమర్పించిన ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

వేములవాడ టౌన్‌, మార్చి 6(ఆంద్రజ్యోతి): వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి సన్నిధిలో పార్వతీపరమేశ్వరుల కల్యాణం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. శివనామస్మరణ, వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఈ వేడుక భక్తులకు నేత్రపర్వంగా నిలిచింది. రాజన్న ఆలయ పార్కింగ్‌ ప్రాంగణంలోని శివార్చన వేదికపై ఏర్పాటు చేసిన కల్యాణ వేదికలో శివపార్వతులు పట్టువస్ర్తాలు, బంగారు ఆభరణాలతో అలంకరించబడి భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ధ్వజారోహణం నిర్వహించి వృషభేశ్వరుడికి కల్యాణం జరిపించిన అనంతరం శూలానికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 11:40 గంటలకు అభిజిత్‌ లగ్న సుముహూర్తంలో ఆలయ ప్రధాన అర్చకులు నమిలికొండ ఉమేశశర్మ, ఈశ్వరగారి సురేష్‌, ఉప ప్రధానాచార్యులు చంద్రగిరి శరత్‌, నమిలికొండ రాజేశ్వర శర్మ గోపన్నగారి గణేష్‌తోపాటు ఆస్థాన వేద పండితులు కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయం తరపున ఈవో రమాదేవి, మున్సిపాలిటీ తరపున చైర్‌పర్సన్‌ పుల్కంరాజు, వైస్‌ చైర్మెన్‌ నరాల శేఖర్‌, కౌన్సిలర్లు ఆది దంపతులకు పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఈశ్వరగారి సురేష్‌-నాగలక్ష్మి దంపతులు కన్యాదాతలుగా వ్యవహరించారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి శివపార్వతుల కల్యాణాన్ని కనులారా వీక్షించారు. కల్యాణం జరుగుతున్నంతసేపు శివపార్వతులు తలంబ్రాలు పోసుకుంటూ భక్తులకు ఆనందాన్ని పంచగా , జీలకర్ర బెల్లం ఉంచుకుని దేవుడికి సమర్పితులయ్యారు. కల్యాణ వేడుకల్లో ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ ముఖ్యఅతిఽథిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శివకల్యాణం సందర్భంగా దేవాలయం తరపున పార్కింగ్‌ ప్రాంగణంలోని చలువ పందిరి కింద భక్తులకు ఉచిత అన్నదానం ఏర్పాటు చేశారు.

పోలీసుల పటిష్ట బందోబస్తు

శివకల్యాణం పురస్కరించుకుని వేములవాడ పట్టణ సీఐ బి వీరప్రసాద్‌ ఆధ్వర్యంలో పోలీసులు కల్యాణ వేదిక చుట్టుపక్కల, దేవాలయ పరిసర ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్‌ ఆర్‌ఎస్‌ఐ సముద్రాల రాజు తన బృందంతో ట్రాఫిక్‌ను నియంత్రించారు.

Updated Date - Mar 07 , 2026 | 12:41 AM