Share News

వైభవంగా లక్ష్మీనృసింహస్వామి దక్షిణ దిగ్యాత్ర

ABN , Publish Date - Mar 06 , 2026 | 12:39 AM

ధర్మపురి క్షేత్రంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీ నృసింహస్వామి దక్షిణ దిగ్యాత్ర కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు.

వైభవంగా  లక్ష్మీనృసింహస్వామి దక్షిణ దిగ్యాత్ర
ధర్మపురిలో పూజలు నిర్వహిస్తున్న అర్చకులు, పోలీసులు

- పోలీస్‌స్టేషన్‌లో పూజలందుకున్న నారసింహుడు

- పాల్గొన్న జగిత్యాల డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు

ధర్మపురి, మార్చి 5 ( ఆంధ్రజ్యోతి ): ధర్మపురి క్షేత్రంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీ నృసింహస్వామి దక్షిణ దిగ్యాత్ర కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా కల్యాణం, తెప్పెత్సవం, డోలోత్సవాల అనంతరం స్వామి వారలు దక్షిణ దిగ్యాత్రకు బయలుదేరారు. లక్ష్మీనృసింహస్వామి (యోగ, ఉగ్ర) వారల ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి బయటకు తీసుకువచ్చారు. అనంతరం సేవలపై ఉంచి మంగళవాయిద్యాలు వెంట రాగా, రిటైర్డ్‌ ఏఎస్‌ఐ కమటం మల్లయ్య, వివిధ రకాల వేషాధారణ, చిన్నారుల నృత్యాలు, బొప్పనపెల్లి ఐలయ్య ఒగ్గు డోలు ప్రదర్శనతో సాయంత్రం వేళలో దక్షిణ దిశలో గల పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. దారి పొడవునా పోలీస్‌ సిబ్బంది ఆనందోత్సహాల మధ్య నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన గేటు ఎదుట పోలీస్‌ కుటుంబ సభ్యులు, పలువురు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి స్వామి వారల సేవలను పోలీస్‌స్టేషన్‌లోకి ఆహ్వానించారు. జగిత్యాల, డీఎస్పీ రఘుచందర్‌, ధర్మపురి సీఐ రాంనర్సింహరెడ్డి, ఎస్‌ఐలు మహేష్‌, ఉదయ్‌కుమార్‌, సతీష్‌, కృష్ణసాగర్‌రెడ్డి, రవీందర్‌కుమార్‌, పోలీస్‌ సిబ్బంది స్వామి వారల సేవలను భుజాలపై మోసి లోనికి ప్రవేశించారు. స్వామివారల సేవలను పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో అందంగా పూలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఉంచారు. ఆలయ వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్‌, ధర్మపురి సీఐ రాంనర్సింహరెడ్డి, ఎస్‌ఐ మహేష్‌ దంపతులు, పోలీస్‌ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా పూజల్లో పాల్గొని స్వామి వారలను దర్శనం చేసుకున్నారు. పోలీస్‌ అధికారులు తమ ఆయుధాలను స్వామి వారి సేవల పక్కన ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు, అర్చకులను పోలీస్‌ శాఖ పక్షాన శాలువాలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన జక్కు రవీందర్‌, ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్‌, ఏఎస్‌ఐ భీమ్‌రావు, హెచసీలు పులి రవికుమార్‌, రామస్వామి, నీలినాయక్‌, వెంకటయ్య, ఆలయ సూపరింటెండెంట్‌ ద్యావళ్ల కిరణ్‌కుమార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ అలువాల శ్రీనివాస్‌, ధర్మకర్తల మండలి సభ్యులు, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2026 | 12:39 AM