Share News

భవితవ్యం తేలేది నేడే

ABN , Publish Date - Feb 13 , 2026 | 12:47 AM

మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనున్నది.

భవితవ్యం తేలేది నేడే

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనున్నది. శుక్రవారం ఓట్ల లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. గెలుపుపై మూడు ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గడిచిన 24 గంటలుగా కూడికలు, తీసివేతలు, అభ్యర్థులతో సమావేశాలతో తలమునకలైన ఆయా పార్టీల నేతలు ఎవరికివారు తమకెన్ని స్థానాలు వస్తాయో ప్రకటిస్తూ గెలుపు తమదేనని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో కరీంనగర్‌, రామగుండం కార్పొరేషన్లతోపాటు 13 మున్సిపాలిటీలలో మెజార్టీ స్థానాలు తమవేనని అధికార కాంగ్రెస్‌ పార్టీ గంటాపధంగా చెబుతున్నది. కరీంనగర్‌ కార్పొరేషన్‌ హంగ్‌ దిశగా పయనిస్తుండగా, రెండు మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌, 11 మున్సిపాలిటీతోపాటు రామగుండం కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ జెండాలు ఎగురబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఫ కరీంనగర్‌పై బీజేపీ ధీమా

ఉత్తర తెలంగాణ రాజకీయాలకు కీలకకేంద్రమైన కరీంనగర్‌లోని కార్పొరేషన్‌లో సంపూర్ణ మెజార్టీ సాధించిన పార్టీగా.. లేనిపక్షంలో సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అధికారం చేపట్టబోతున్నామని బీజేపీ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నది. 30కిపైగా స్థానాలు సాధిస్తున్నామని, మ్యాజిక్‌ ఫిగర్‌ చేరుకోవడానికి 34 స్థానాలు అవసరం. తమకు మినహా వేరెవరికి మెజార్టీ రాదని, ఎంపీ, రెండు ఎమ్మెల్సీల ఓట్లు కూడా తమ పార్టీకి ఉండడంతో కార్పొరేషన్‌ మేయర్‌, డిప్యూట్‌ మేయర్‌ పదవులను దక్కించుకుంటామని ఆ పార్టీ స్థానిక ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు ఎవరికివారు 20 స్థానాల వరకు తమకు తప్పకుండా వస్తాయని, ఎంఐఎం, ఇండిపెండెంట్ల మద్దతుతో కార్పొరేషన్‌ను దక్కించుకుంటామని చెబుతున్నారు.

ఫ ఇతరులే కీలకం

ఎంఐఎం, ఫార్వర్డ్‌బ్లాక్‌, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు కార్పొరేషన్‌లో అధికారం చేపట్టే విషయంలో కీలకం కానున్నారు. ఎంఐఎం నుంచి ఐదు లేక ఆరుగురు అభ్యర్థులు, ఫార్వర్డ్‌బ్లాక్‌ నుంచి కనీసం ఇద్దరు అభ్యర్థులు విజయం సాధించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఐదు నుంచి ఏడు డివిజన్లలో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించే అవకాశముందని పోలింగ్‌ సరళిని బట్టి అంచనా వేస్తున్నారు. వీరంతా ఇప్పుడు కరీంనగర్‌ కార్పొరేషన్‌లో ఎవరివైపు మొగ్గితే వారు అధికారం చేపట్టే అవకాశమున్నది. మ్యాజిక్‌ ఫిగర్‌ దాటుతామని విశ్వాసాన్ని ప్రకటిస్తున్నా ముందు జాగ్రత్త చర్యగా బీజేపీ ఇండిపెండెంట్‌ అభ్యర్థులతో టచ్‌లోకి వెళ్లారని, వారందరిని బీజేపీకి అండగా నిలవాలని కోరుతున్నారని తెలిసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో ఉంటే రాజకీయంగా వారి భవిష్యత్‌ కూడా తోడ్పడుతుందని బీజేపీ నేతలు వారికి నచ్చజెప్పుతున్నట్లు తెలిసింది.

ఫ ఎంఐఎం మద్దతు ఎవరికో..?

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఎంఐఎం మద్దతు తమకే ఉంటుందని ఆశిస్తున్నాయి, ఆ పార్టీ ముఖ్య నాయకులతో ఇరుపార్టీల నేతలు ఇప్పటికే మంతనాలు ప్రారంభించారని సమాచారం. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లో ఏ పార్టీకి అవకాశాలు మెరుగ్గా ఉంటే ఆ పార్టీకి ఎంఐఎం మద్దతు లభించే అవకాశమున్నట్లు తెలిసింది. గెలిచే అవకాశం ఉన్న ఇండిపెండెంట్లు, ఫార్వర్డ్‌బ్లాక్‌ అభ్యర్థులకు ఇరు పార్టీల నేతలు ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించారని సమాచారం. ఒక ఇండిపెండెంట్‌ అభ్యర్థి కూడా వీరందరితో కలిపి కూటమి ఏర్పాటు చేసి కలిసి కట్టుగా అందరం ఎవరికో ఒకరికి మద్దతిద్దాం, మన డిమాండ్లు ఆయా పార్టీల ముందుంచి వాటికి అంగీకారం తెలిపిన వారికే సపోర్టుగా ఓటు వేద్దామని ప్రతిపాదించినట్లు సమాచారం. ఒకవైపు వీరందరి మద్దతుకోరుతూనే శుక్రవారం కౌంటింగ్‌ పూర్తయిన తర్వాత గెలిచిన అభ్యర్థులను క్యాంపులకు తరలించేందుకు అన్ని పార్టీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే వాహనాలను, రిసార్ట్‌లను, హోటళ్లను బుక్‌ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఆయా పార్టీల ముఖ్యనేతలు అభ్యర్థులతో సమావేశాలు నిర్వహించి క్యాంపులకు తరలాల్సిన అవసరాన్ని వివరించారని, శుక్రవారం రాత్రి అందరూ క్యాంపులకు వెళ్లేందుకు సిద్ధమయ్యారని తెలిసింది.

ఫ కీలకం కానున్న ఎక్స్‌ ఆఫీషియో సభ్యులు

కరీంనగర్‌ కార్పొరేషన్‌లో ఎవరికి స్పష్టమైన మెజార్టీ రాదు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎక్స్‌ ఆఫీషియో సభ్యత్వం చర్చకు వస్తున్నది. బీజేపీ నేతలు తమకు ఒక ఎంపీతోపాటు ఇద్దరు ఎమ్మెల్సీల ఓట్లు కూడా ఉన్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌, టీచర్స్‌ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ సి అంజిరెడ్డి ఓట్లు కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌ ఎన్నికలో కీలకమయ్యే అవకాశమున్నది. ఆయా మున్సిపాలిటీల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓట్లు కూడా ఈ ఎన్నికల్లో మెజార్టీ రాని పక్షంలో కీలకమవుతాయి. ఈనెల 14వరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తాము ఏ మున్సిపాలిటీ పరిధిలో ఎక్స్‌ ఆఫీషియో సభ్యుడిగా ఉండాలని కోరుకుంటున్నామో తెలుపుతూ జిల్లా ఎన్నికల అధికారికి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అలా సభ్యత్వాలు పొందిన వారు మాత్రమే మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని పొందుతారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, మానకొండూర్‌ శాసనసభ్యుడు డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ ఇప్పటికే ఎక్స్‌ ఆఫిషియో సభ్యులుగా కార్పొరేషన్‌లో నమోదయ్యారు.

ఫ 16న మేయర్‌, చైర్మన్‌, డిప్యూటీ మేయర్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక

కరీంనగర్‌ కార్పొరేషన్‌లో మేయర్‌, డిప్యూటీ మేయర్‌తోపాటు చొప్పదండి, హుజూరాబాద్‌, జమ్మికుంట మున్సిపాలిటీలతోపాటు ఉమ్మడి జిల్లాపరిధిలోని రామగుండం, మున్సిపాలిటీల్లోనూ మేయర్‌, చైర్మన్‌ ఎన్నిక ఈనెల 16న జరుగనున్నది. శుక్రవారం ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఆయా మున్సిపాలిటీల్లో సమావేశమై మేయర్‌, డిప్యూటీ మేయర్‌, చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకుంటారు.

Updated Date - Feb 13 , 2026 | 12:47 AM