తెగిపోతున్న ‘పోగు’ బంధం..
ABN , Publish Date - Aug 07 , 2026 | 01:00 AM
చేనేత మగ్గం సడుగులు విరగడంతో వృద్ధులకే పరిమితమయ్యింది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
చేనేత మగ్గం సడుగులు విరగడంతో వృద్ధులకే పరిమితమయ్యింది. యువకులు మరమగ్గాల వైపు అడుగులు వేశారు. దీంతో ఒకనాడు రంగురంగుల చీరలు, దోవతులు, పంచెలతో కళకళాడిన చేనేత మగ్గాల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. కంటి చూపు ఆనకపోయినా వృద్ధాప్యంలో ఇంకా చేనేత మగ్గానే నమ్ముకున్న కార్మికులు ఉండడంతో కొంత మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మగ్గాల చప్పుడు వినిపిస్తోంది. చేనేత, మరమగ్గాల్లో చావు చప్పుడే వినిపించగా, గత ప్రభుత్వం బతుకమ్మ చీరలతో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరా మహిళా శక్తి చీరలు వంటి ఆర్డర్లతో చేతినిండా పనితో మరమగ్గాల కార్మికుల్లో సిరినవ్వులు విరబూస్తున్నాయి. కానీ చేనేత మగ్గాన్ని నమ్ముకున్న వృద్ధ కార్మికులు సరైన కూలీ లభించక ఇతర పనులు చేయలేక చేనేత మగ్గంతోనే కాలం వెల్లదీస్తున్నారు. తన శ్రమకు సృజనాత్మకతను జోడించి అపురూపమైన కళా నైపుణ్యంతో చేనేత మగ్గంపై రంగురంగుల పట్టుచీరలు, నేసి మగువలను మెప్పించడం, ఖద్దరు వస్త్రాలతో మగవాళ్లను దీటుగా నిలబెట్టిన సిరిసిల్ల చేనేత కార్మికులు కూనారిల్లుతున్నారు. తాము బతకడంతో పాటు మరో పది మందికి ఉపాధి కల్పించిన చేనేత కార్మికులు కాలక్రమేణా సంభవిస్తున్న మార్పులతో కుల వృత్తిని వదిలి ఇతర వృత్తుల్లోకి, చిరువ్యాపారాల్లోకి వెళుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక గల్ఫ్ దేశాలకు వలస వెళుతున్న వారున్నారు. సిరిసిల్లలో మెట్‌పల్లి ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టాన్‌తో పాటు కొన్ని సహకార సంఘాలు కార్మికులకు కొంత చేయూతను, ఉపాధిని కల్పిస్తున్నాయి. చేనేత కార్మికుడికి పదిహేను రోజుల పాటు కష్టపడితే రూ 1500 నుంచి రూ.2వేల వరకే కూలి లభిస్తోంది. చేనేత మగ్గాలకు కండెలు చుట్టే వృద్ధ మహిళలు పొద్దంతా నూలు లడిలు చుడితే 50 రూపాయలు మాత్రమే గిట్టుబాటు అవుతుంది. జిల్లాలో చేనేత మగ్గం వృద్ధులకే పరిమితం కాగా, యువకులు మరమగ్గాల వైపు మళ్లారు. కొంతమంది చేనేత కళను బతికించడానికి ప్రయత్నం చేస్తున్న వారు ఉన్నారు. చీరలోని గొప్పతనాన్ని చాటుతూ అగ్గిపెట్టెలో సైతం అమిరే చీర, కుట్టులేని దుస్తులు, మగ్గంపై మనుషుల చిత్రాలను నేసి ప్రపంచాన్ని అబ్బుర పరిచిన సిరిసిల్ల చేనేత పరిశ్రమ ఉనికిని మాత్రం యువకులు బతికించే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని నల్ల విజయ్, యెల్ది హరిప్రసాద్, చేనేత, మరమగ్గాలపై వినూత్నంగా వస్త్రాలను తయారు చేస్తున్నారు. హరిప్రసాద్, నల్ల విజయ్‌లు చేనేత రంగంలో చేసిన కృషికి అనేక అవార్డులను కూడా అందుకున్నారు.
చిన్నబోతున్న చేనేత మగ్గం
చేనేత మగ్గం వృద్ధులకే పరిమితమయ్యింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయం, తరువాత చేనేత రంగంపైనే అనేక దశాబ్దాలుగా ఉపాధి పొందారు. చేనేత మగ్గాలపై జరీ చీరల అంచులు తళుక్కున మెరిసేవి. మరమగ్గాల వైపు కార్మికులు మారడంలో వేలల్లో ఉన్న చేనేత మగ్గాలు వందల సంఖ్యకు చేరాయి. వాటి స్థానంలో సిరిసిల్లలో 30352 వేల మరమగ్గాలపై వస్త్ర ఉత్పత్తి జరుగుతోంది. దీంతో చేనేత మగ్గాలతో పోగు బంధం తెగిపోతోంది. జిల్లాలో చేనేత మగ్గాలు లయ తప్పాయి. చేనేత సహకార సొసైటీలు మూలనపడ్డాయి, ప్రస్తుతం జిల్లాలో ఆరు సొసైటీలు మాత్రమే పనిచేస్తున్నాయి. చేనేత మగ్గాల స్థానంలో మరమగ్గాలు చేరాయి. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 1667 యూనిట్లలో 35 వేల మరమగ్గాలపై వస్త్ర ఉత్పత్తి జరుగుతోంది. 1984లో సిరిసిల్ల జిల్లాలో చేనేత మగ్గాలు ఆరు వేల వరకు ఉండగా, ఇప్పడు జియోట్యాగింగ్ చేసిన ప్రకారం 169 మగ్గాలు ఉన్నాయి. ఈ మగ్గాలపై 321 మంది కార్మికులు మాత్రమే ఉన్నారు. ఉపాధి పొందుతున్న కార్మికులు 214మంది ఉన్నారు. చేనేత కళను బతికించడానికి కార్మికులకు ఉపాధి కల్పించే దిశగా గత ప్రభుత్వం 2017లో చేనేత లక్ష్మి పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ శాఖల ఉద్యోగులు 2662 మంది పథకంలో చేరారు. చేనేత లక్ష్మి పథకంలో చేరిన ఉద్యోగులు దుస్తులను కొనుగోలు చేశారు. టెస్కో ద్వారా ఇటీవల మళ్లీ ప్రారంభించారు. వేములవాడ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం చేనేత క్లస్టర్‌గా గుర్తించింది. క్లస్టర్ కింద రూ.1.19 కోట్ల నిధులను మంజూరు చేసింది. దీనిలో భాగంగా రూ.50 లక్షలతో మౌలిక వసతుల కేంద్రం ఆఽదునిక డిజైనతో కార్మికులకు శిక్షణ కార్యక్రమాలను చేపట్టింది. రూ.19.10 లక్షలు విడుదల చేయగా 300మంది లబ్ధిదారులు కొత్త డిజైన్ల అభివృద్ధి, చేనేత శిక్షణను పొందారు. జిల్లాలో ప్రతి సంవత్సరం రూ.2 కోట్ల చేనేత వస్త్రాలు ఉత్పత్తి జరుగుతున్నాయి. జిల్లాలో 169 చేనేత మగ్గాలు ఉండగా అందులో కొన్ని వినియోగంలో లేవు. చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ చేశారు. జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ,చందుర్తి, బోయినపలి, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, గంభీరావుపేట, కోనరావుపేటలో మగ్గాలు ఉన్నాయి. చేనేత సహకార సంఘాలకు ఎట్టకేలకు ప్రభుత్వం చేనేత సొసైటీలకు ఎన్నికల గడువు ముగిసిన ఏళ్లకు చేనేత పోరు ఏకగ్రీవంగానే ముగిసింది. పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. 9 మందితో కూడిన పాలకవర్గాలను చేతులెత్తే విధానంతో ఎన్నుకున్నారు. ఈసారి పాలకవర్గాల్లో ఇద్దరు మహిళలకు అవకాశం కల్పించారు. చేనేత సొసైటీల్లో నేతన్నలకు ఉపాధి అందించే చర్యలపై కొత్త పాలకవర్గాలపై అశలు పెట్టుకున్నారు.
నేతన్నకు అభయ హస్తం
ప్రభుత్వం చేనేత, మరమగ్గాల కార్మికులకు మూడు పథకాలు అందించడానికి ఒకే గొడుగు కిందికి తీసుకు వచ్చింది. అభయ హస్తం పేరుతో నేతనన పొదుపు నిధి, బీమా భద్రత(నేతన్నబీమా), చేనేత భరోసా(వేతన మద్దతు) పథకాలను చేరువ చేసింది. నేతన్నకు అభయ హస్తం పేరుతో పథకాలను ముందుకు తీసుకరావడం, చేనేత భరోసా మార్గదర్శకాలు ప్రకటించడం కార్మికుల్లో హర్షం వ్యక్తమైంది. ప్రాథమికంగా మూడు పథకాలకు సంబంధించి ప్రభుత్వం రూ.168 కోట్లు విడుదల చేశారు. నేతన్నకు అభయహస్తంలో భాగంగా మూడు పథకాలు ఒకే గొడుగు కిందికి చేర్చడంతో పాటు చేనేత కార్మికులు పొదుపు నిధికి అవకాశం కల్పించింది. జిల్లాలో చేనేత భరోసా పధకానికి 212 మంది కార్మికులను గుర్తించారు. జిల్లాలో చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ పథకంలో రూ.45లక్షలు మంజూరు చేశారు. కార్మికులకు పావలావడ్డీ పథకంలో 212 మంది కార్మికులకు రూ.15.62 లక్షలు సహకార సంఘాలకు అందించారు. నేతన్న భద్రతలో రూ 20 లక్షలు అందించారు.
నేడు జాతీయ చేనేత దినోత్సవ సభకు ఏర్పాట్లు..
- సంతోష్ కుమార్, జిల్లా చేనేత, జౌళి శాఖ ఏడీ
జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా సిరిసిల్లలో చేనేత దినోత్సవ సభ, చేనేత వాక్ కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని జిల్లా చేనేత జౌళి శాఖ ఏడి సంతోష్ కుమార్ తెలిపారు. చేనేత సహకార సంఘాల సభ్యులు, చేనేత, మరమగ్గాల కార్మికులు, వస్ర్తోత్పత్తిదారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలందరికీ ఆహ్వానం పలుకుతున్నామన్నారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం చేనేత వాక్ నిర్వహిస్తామన్నారు. అనంతరం 10.30గంటలకు సిరిసిల్ల మార్కెట్ కమిటీ గోదాం వద్ద జాతీయ చేనేత దినోత్సవ సభ జరుగుతుందని, ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో పాటు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, చేనేత సొసైటీల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. చేనేత దినోత్సవ కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు.