తొలి ముద్దకు కసరత్తు
ABN , Publish Date - Nov 24 , 2026 | 01:00 AM
అంగనవాడీ కేంద్రాల్లో చిన్నారు లకు ఉదయం అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొలిముద్ద పథకం దశల వారీగా జిల్లాల్లో విస్తరిస్తోంది. జగిత్యాల జిల్లాలోనూ పథకం అమల్లోకి వస్తే అంగనవాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు తొలిముద్ద అదనపు పోషకాహారంగా మారి మేలు చేకూర నుంది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో విస్తరించిన తొలిముద్ద పథకం అన్ని జిల్లాల్లో సైతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అమలు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
- రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా పథకం అమలు
- అంగనవాడీల్లో చిన్నారులకు అల్పాహారం
- కేంద్రాల్లో హాజరు పెంపు లక్ష్యం
- జిల్లాలో 1,065 అంగన వాడీ కేంద్రాలు
జగిత్యాల, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): అంగనవాడీ కేంద్రాల్లో చిన్నారు లకు ఉదయం అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొలిముద్ద పథకం దశల వారీగా జిల్లాల్లో విస్తరిస్తోంది. జగిత్యాల జిల్లాలోనూ పథకం అమల్లోకి వస్తే అంగనవాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు తొలిముద్ద అదనపు పోషకాహారంగా మారి మేలు చేకూర నుంది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో విస్తరించిన తొలిముద్ద పథకం అన్ని జిల్లాల్లో సైతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అమలు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే తొలిముద్ద పథకాన్ని జిల్లాలో అమలు చేయడానికి అవసరమైన ముందస్తు కసరత్తు అధికారులు చేస్తున్నారు.
ఫజిల్లాలో 50 వేల మంది చిన్నారులు
జిల్లాలోని జగిత్యాల, మెట్పల్లి, మల్యాల, ధర్మపురి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 1,065 అంగనవాడీ కేంద్రాలున్నాయి. ఇందులో జగిత్యాల ఐసీడీఎస్ ప్రాజక్టు పరిధిలో 307 కేంద్రాలు, ధర్మపురిలో 219, మల్యాలలో 227, మెట్పల్లిలో 312 కేంద్రాలున్నాయి. అంగనవాడీ కేంద్రాల్లో ఏడు నెలల నుంచి మూడేళ్ల వయస్సు గల చిన్నారులు 34,897 మంది, 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వయస్సు గల చిన్నారులు 15,907 మంది, మొత్తం చిన్నారులు సుమారు 50 వేల మంది ఉన్నారు.
ఫపిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి..
అంగనవాడీ చిన్నారులకు ఉదయం 9గంటల నుంచి 9.30 గంటల మధ్య అల్పాహారం అందించడం పథకంలో ప్రధాన అంశం. ఉప్మా, కిచిడీ వంటి రెడీ టు కుక్ ఆహార పదార్థాలతో పాటు అవసరమైన పోషకాలు అందేలా మెనూను రూపొందించారు. ఉదయం అల్పాహారం తీసుకో కుండానే అంగనవాడీలకు వచ్చే చిన్నారులకు ఇది ప్రయోజనం చేకూర్చనుంది. ఆకలి కారణంగా ఏకాగ్రత, అభ్యసన సామర్థ్యం తగ్గకుండా చేయడంతో పాటు పిల్లల ఆరోగ్యం, ఎదుగుదలకు తోడ్పడటం, అంగనవాడీల్లో హాజరు పెంచడం పథకం లక్ష్యాలుగా ఉన్నాయి. గతంలో హైదరాబాద్లో ప్రయోగాత్మకంగా అమలు చేసినప్పుడు హాజరు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. అయితే అల్పాహారం నాణ్యత, పరిమాణం, సమయపాలన, పరిశుభ్రతపై నిరంతర పర్యవేక్షణ అవసరమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఫజిల్లాలో త్వరలో అమల్లోకి..
జిల్లాలోనూ పథకం అమల్లోకి వస్తే అంగనవాడీ కేంద్రాల వారీగా పిల్లల సంఖ్యను కచ్చితంగా నమోదు చేయడం, రోజువారీగా అందించిన అల్పాహారాన్ని పర్యవేక్షించడం, నాణ్యతను తనిఖీ చేయడం కీలకం కానుంది. ఇప్పటికే అంగనవాడీల్లో మధ్యాహ్న భోజనం, గుడ్డు, ఇతర పోషకాహార కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో తొలిముద్ద వాటికి అదనపు పోషకాహారంగా సక్రమంగా అమలైతే చిన్నారులకు మేలు చేకూరనుంది. అయితే వంట, నిల్వ, నీరు, వంట సామగ్రి, సిబ్బందిపై అదనపు భారం వంటి క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించడంతోనే పథకం ఫలితం పూర్తిగా దక్కుతుంది. ప్రభుత్వం కూడా పథకం విజయానికి క్షేత్రస్థాయి అమలే కీలకమని స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే పథకం అమలు చేయడానికి అధికారులు అవసరమైన కసరత్తులు చేస్తున్నారు.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే..
-ఆడెపు భాస్కర్, జిల్లా సంక్షేమ అధికారి
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తొలిముద్ద పథకం అమలు అవుతోంది. జిల్లాల్లో దశల వారీగా పథకం విస్తరణ జరుగుతోందని తెలుస్తోంది. జగిత్యాల జిల్లాలో తొలిముద్ద పథకం అమలుపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము.