ఎండుతున్న పొలాలు
ABN , Publish Date - Mar 07 , 2026 | 12:12 AM
యాసంగిలో సాగు చేసిన వరి పొలాలు సాగునీరందక ఎండిపోతున్నాయి. గంగాధర మండల వ్యాప్తంగా 25 వేల ఏకరాల్లో వరి సాగైంది.
గంగాధర, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): యాసంగిలో సాగు చేసిన వరి పొలాలు సాగునీరందక ఎండిపోతున్నాయి. గంగాధర మండల వ్యాప్తంగా 25 వేల ఏకరాల్లో వరి సాగైంది. మండలంలో ప్రధానంగా బావులు, బోర్లపై ఆధారపడి రైతులు పంటలు సాగుచేస్తుంటారు. నారాయణపూర్ ప్రాజెక్టు ఎడమ కాలువతోపాటు ఉపకాలువకు నీరు విడుదల చేయడంతో మండలంలోని పలుగ్రామాల్లోని వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుంది. కుడి కాలువ అసంపూర్తిగా ఉండడంతో మెట్టప్రాంతమైన ప్రధాన రహదారికి అవతలివైపు గ్రామాల్లో పొలాలకు నీరందడం లేదు. గోపాల్‌రావుపల్లి, మల్లాపూర్, కాసారం గ్రామాల్లో పొలాలు బీటలువారాయి. ఎండలు రోజురోజుకు ముదరడంతో సుమారు వంద ఎకరాల్లో వరి పంట ప్రశ్నార్థాకంగా మారింది.
ఫ డి4 కాలువే ఆధారం
మండలంలోని మల్లాపూర్, గోపాల్‌రావుపల్లి గ్రామాల రైతులు బోర్లు, బావుల కిందే వరి సాగు చేస్తుంటారు. కొడిమ్యాల మండలం మైసమ్మ చెరువు నుంచి వేములవాడ, గంగాధర మండలంలోని మల్లాపూర్, గోపాల్‌రావుపల్లి గ్రామాలకు సాగునీరందించడానికి 20 ఏళ్ల క్రితం డి4 కాలువను నిర్మించారు. ఎగువ గ్రామాల రైతులు ఈ కాలువకు రాళ్లను అడ్డుగా పెట్టి నీటిని వారి పొలాలకు మళ్లించుకుంటున్నారు. దీంతో ఈ మూడు గ్రామాల్లో కాలువ నీరు అందడం లేదు. దీనిపై పలుమార్లు అధికారులకు విన్నవించినా స్పందించడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నారాయణపూర్ రిజర్వాయర్‌కు నెల రోజులుగా ఎల్లంపల్లి నీటిని విడుదల చేసి ఇస్లాంపూర్ పంప్‌హౌస్ నుంచి కొడిమ్యాలకు నీటిని విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్‌లో నీరు సమృద్ధిగా ఉన్నా తమ పొలాలకు నీరు అందడం లేదని గోపాల్‌రావుపల్లి, మల్లాపూర్, కాసారం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి కాలువ నీరు సక్రమంగా వచ్చేలా చూసి చెరువులు, కుంటలను నింపితే భూగర్భ జలాలు పెరిగి పంటలు ఎండిపోకుండా ఉంటాయని రైతులు అంటున్నారు. కుడి కాలువ నిర్మాణం పూర్తి చేస్తే తమ సాగునీటి అవసరాలు తీరుతాయని, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.