Share News

నెరవేరనున్న పేదల కల

ABN , Publish Date - Jun 11 , 2026 | 01:07 AM

ఇళ్లు లేని నిరు పేదల కలను నిజం చేసే దిశగా రాష్ట్ర సర్కారు మరో అడుగు ముందుకు వేసింది. ఎన్నికల హామీలో భాగంగా రూ.5లక్షలతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని గత యేడాది ప్రారంభించింది. మొదటి విడతలో ఇళ్లు మంజూరు కాని వారి కోసం రెండో

నెరవేరనున్న పేదల కల

జగిత్యాల, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఇళ్లు లేని నిరు పేదల కలను నిజం చేసే దిశగా రాష్ట్ర సర్కారు మరో అడుగు ముందుకు వేసింది. ఎన్నికల హామీలో భాగంగా రూ.5లక్షలతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని గత యేడాది ప్రారంభించింది. మొదటి విడతలో ఇళ్లు మంజూరు కాని వారి కోసం రెండో విడతలో ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈనెల 2న రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల్లో పలువురు లబ్ధిదారులను గుర్తించి లాంఛనంగా రెండో విడత పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అదేరోజు కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కొఠారి గ్రామంలో తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి రెండో విడత ఇళ్ల ప్రారంభోత్సవానికి పైలాన్‌ను ఆవిష్కరించారు. దీంతో మొదటి విడతలో ఇళ్లు రాకుండా ఆశగా ఎదురుచూస్తున్న దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురించాయి. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 3 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మొదటి విడతలో 10,860 మందికి ఇళ్లు మంజూరు అయ్యాయి. వీటిల్లో కొన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తయి ప్రారంభం కాగా మరికొన్ని వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి.

ఫఅసంపూర్తిగా ఆగిపోయిన వాటికి రూ.2 లక్షలు..

అధికారులు ఇందిరమ్మ ఇళ్ల యాప్‌ ద్వారా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసే సమయంలో 2006-2013 మద్య కాలంలో పాత ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద, 2023లో గృహలక్ష్మీ పథకంలో లబ్ధిదారులు ప్రారంభించిన ఇళ్ల నిర్మాణాలు అర్ధాంతరంగా ఆగిపోయాయని గుర్తించారు. వాటిని పునాది దశ నుంచి కొత్తగా నిర్మించడానికి వీలు లేదు కనుక తాత్కాలిక పైకప్పు స్థానంలో ఆర్‌సీసీ స్లాబ్‌ను వేయడం ద్వారా నివాసయోగ్యమైనవిగా మార్చవచ్చని అభిప్రాయ పడ్డారు. వీటికి రూ. 2 లక్షల చొప్పున సాయం అందించనున్నారు. ‘రూఫ్‌ పునః ప్రారంభం’ అను కొత్త పథకం పేరుతో నియోజకవర్గానికి 500 చొప్పున మంజూరు చేయడానికి కసరత్తు చేస్తున్నారు.

ఫఇంకా ప్రారంభం కాని 1,840 ఇళ్లు..

జిల్లాకు మొదటి విడత కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున మొత్తం 10,860 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. రూ. 5 లక్షలతో ఇళ్ల నిర్మాణం ఎలా అన్న మీమాంసలో పడి చాలా మంది లబ్ధిదారులు ముందుకు రాలేదు. తదనంతరం నెమ్మదిగా ఇళ్ల నిర్మాణాలు ఊపందుకోగా ఇప్పటి వరకు 1,369 ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకొని పలువురు గృహ ప్రవేశాలు సైతం జరుపుకున్నారు. సాధ్యమైనంత తొందరలో ఇళ్ల గృహ ప్రవేశాలు జరగాలన్న లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇంకా 1,840 ఇళ్లు కనీసం పునాది రాయి పడని పరిస్థితి నెలకొంది.

ఫప్రతి నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు..

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి గైడ్‌ లైన్స్‌ను విడుదల చేసింది. ఈ నిబంధనల మేరకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. నిధుల కొరత తదితర కారణాలతో విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నారు. రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇళ్లను కేటాయించనున్నారు. దీని ప్రకారం జిల్లాలో కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి 6 వేల ఇళ్లు మంజూరు అయ్యాయి. వీటితో పాటు చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని మల్యాల, కొడిమ్యాల, వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్‌, మేడిపల్లి, భీమారం మండలాలకు సైతం రెండో విడతలో ఇళ్లు మంజూరు కానున్నాయి.

--------------------------------------------------------------------

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల వివరాలు..

--------------------------------------------------------------------

మొదటి విడతలో మంజూరైనవి..10,860

పూర్తయిన ఇళ్లు...1,389

మార్కవుట్‌ చేసినవి...9,020

ప్రారంభం కానివి...1,840

బేస్‌మెంట్‌ లెవల్‌ ఉన్నవి...1,4255

గోడల లెవల్‌లో ఉన్నవి...892

రూఫ్‌ లెవల్‌ ఉన్నవి..4,085

రెండో విడతలో మంజూరైనవి.. 6,000

Updated Date - Jun 11 , 2026 | 01:07 AM