అర్హుల లెక్క తేలుతోంది..
ABN , Publish Date - Jun 26 , 2026 | 01:04 AM
బడుగు, బలహీన వర్గాలకు జాతీయ, సాంఘిక భద్రతా పథకం ద్వారా అందిస్తున్న చేయూత పింఛన్‌దారుల్లో మరణించిన వారికి సంబంధించిన పింఛన్ సొమ్ము కుటుంబ సభ్యులు పొందుతున్న సందర్భాలు ఉన్నాయి.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
బడుగు, బలహీన వర్గాలకు జాతీయ, సాంఘిక భద్రతా పథకం ద్వారా అందిస్తున్న చేయూత పింఛన్‌దారుల్లో మరణించిన వారికి సంబంధించిన పింఛన్ సొమ్ము కుటుంబ సభ్యులు పొందుతున్న సందర్భాలు ఉన్నాయి. మరోవైపు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు వివిధ వృత్తుల్లో ఉన్నవారు పొందుతున్న చేయూత పింఛన్లలో అనర్హులను గుర్తించే దిశగా ప్రభుత్వం తాజాగా సజీవ నిర్ధారణ సర్వే (లైవ్ అథెంటిఫికేషన్) నిర్వహిస్తోంది. ఈనెల 15తోనే గడువు ముగిసినా ప్రభుత్వం ఈనెల చివరి తేదీ 30వరకు సర్వే కొనసాగించే విధంగా ఆదేశాలు ఇచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రస్థాయిలో లైవ్ అథెంటిఫికేషన్ ద్వారా నిర్ధారణ సర్వేలో ముందు వరుసలో నిలిచింది. జిల్లాలో ఇప్పటికే 98.59 శాతం సర్వేను పూర్తి చేశారు. సర్వేలో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో ఉంది. సర్వేలో మరణించిన వారు, స్థానికంగా ఆచూకీ లభించని పింఛన్ లబ్ధిదారులను గుర్తించారు. మృతిచెందిన వారి పింఛన్ లబ్ధిదారుల సొమ్మును జూలై మాసంలో నిలిపివేయనున్నారు.
జిల్లాలో మృతిచెందిన లబ్ధిదారులు 2551 మంది
జిల్లాలో చేయూత పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హులను లెక్క తేల్చి అసలైన లబ్ధిదారులను గుర్తించే ప్రక్షాళన చివరి దశకు చేరుకుంది. జిల్లాలో 260 గ్రామాలు, సిరిసిల,్ల వేములవాడ మున్సిపాలిటీలో గ్రామీణ ప్రాంతాలు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో పకడ్బందీగా చేయూత పింఛన్ల పునఃపరిశీలన ప్రక్రియ మరో నాలుగు రోజుల్లో ముగుస్తోంది. ప్రతి పింఛన్‌దారుల గుర్తింపు కోసం లైవ్‌నెస్ అథెంటిఫికేషన్ యాప్ విధానం తీసుకొచ్చింది. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో పోస్ట్ ఆఫీస్‌ల ద్వారా అందించే పింఛన్లు ఫేస్ రికగ్నేషన్ సాఫ్ట్వేర్(ఎఫ్‌ఆర్‌ఎస్), బయోమెట్రిక్ ద్వారా పింఛన్ ఇస్తున్నారు. బ్యాంకుల్లో పింఛన్ తీసుకునే వారికి ప్రతినెల సాంకేతిక తనిఖీలు లేకుండానే ఖాతాలో జమవుతున్నాయి. ఇందులో ఎక్కువగా మరణించిన వారి, జిల్లా నుంచి వెళ్లిపోయిన వారి ఖాతాల్లోనూ డబ్బులు జమవుతున్నాయి. వాటిని ఇతరులు తీసుకుంటున్న సందర్భాలు వెలుగుచూశాయి. ఈ క్రమంలోనే సాంకేతిక ఆధారంగా పింఛన్ డబ్బులు అందించే విధంగా చర్యలు మొదలు కావడంతో అనర్హుల పింఛన్లు తొలగిపోనున్నాయి. జిల్లాలో చేయూత పథకంలో 1,08,986 వివిధ రకాల పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. ప్రభుత్వం జరుపుతున్న సజీవ నిర్ధారణ సర్వేలో 99,597 మంది పింఛన్ లబ్ధిదారుల అర్హులుగా ఉన్నారు. సర్వేలో 2,551 మంది పింఛన్ లబ్ధిదారులు మృతిచెందినట్లు గుర్తించారు. వివిధ కారణాలతో పరిశీలనలో 7,850 పింఛన్లు ఉన్నాయి. బయోమెట్రిక్, ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా కాని వారు 2,336 మంది ఉన్నారు, నిర్ధారణ కానివి 948 మంది, ఆధార్ ధ్రువీకరణ సరిగా లేనివి 101 మందివి ఉన్నాయి. చేయూత పింఛన్ల సర్వేలో వివిధ కారణాలతో కాని లబ్ధిదారులు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కేవలం మరణించిన వారి పింఛన్లు మాత్రమే జాబితాల నుంచి తొలగించి మిగతా వాటిని పరిశీలించిన అనంతరమే తొలగిస్తారు.
జిల్లాలో పింఛన్ సజీవ నిర్ధారణ సర్వే వివరాలివీ..
మండలం లబ్ధిదారులు అర్హులు మృతులు
ఇల్లంతకుంట 7,997 7,431 191
రుద్రంగి 2,848 2,533 101
వేములవాడ రూరల్ 2,785 2,592 32
కోనరావుపేట 9,123 8,420 214
గంభీరావుపేట 11,221 10,089 182
బోయిన్‌పల్లి 6,706 6,043 215
సిరిసిల్ల మున్సిపాలిటీ 20,512 19,064 482
ముస్తాబాద్ 10,425 9,426 202
ఎల్లారెడ్డిపేట 11,065 10,162 276
వీర్నపల్లి 2,088 1,891 76
వేములవాడ 1,775 1,501 76
తంగళ్ళపల్లి 8,903 8,166 159
చందుర్తి 6,888 6,277 153
వేములవాడ మున్సిపాలిటీ 6,650 6,002 192
మొత్తం 1,08,986 99,597 2,551