కొలిక్కి వచ్చిన కాంగ్రెస్ జాబితా
ABN , Publish Date - Jan 30 , 2026 | 01:11 AM
అధికార కాంగ్రెస్ పార్టీ అందరికంటే ముందుగానే తన అభ్యర్థుల జాబితాను ఖరారు చేసి ప్రకటించేందుకు సన్నద్ధమవుతున్నది.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
అధికార కాంగ్రెస్ పార్టీ అందరికంటే ముందుగానే తన అభ్యర్థుల జాబితాను ఖరారు చేసి ప్రకటించేందుకు సన్నద్ధమవుతున్నది. ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు నేతృత్వంలో స్ర్కీనింగ్ కమిటీ గురువారం సమావేశమయ్యింది. స్థానిక నేతలు నిర్వహించిన సర్వేలు, ఇంటెలిజెన్స్, సునీల్ కనుగోలు నిర్వహించిన అధికారిక సర్వేలను పరిశీలించి కరీంనగర్ కార్పొరేషన్‌లో పోటీకి నిలిపే అభ్యర్థులను గుర్తించి సుమారు 40 డివిజన్ల అభ్యర్థుల విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈ జాబితాను టీపీసీసీ అధ్యక్షుడు పరిశీలించి ఆమోద ముద్ర వేసిన తర్వాత ప్రకటించే అవకాశమున్నది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కతో కలిసి సమ్మక్క జాతరకు వెళ్లి రాత్రి 8 గంటల వరకు తిరిగి రాలేదు. ఆయన వచ్చిన తర్వాత స్ర్కీనింగ్ కమిటీ తాము తయారు చేసిన జాబితాను అప్పగిస్తుందని, ఆయన దానిని పరిశీలించి శుక్రవారం తొలి జాబితాను ప్రకటిస్తారని చెబుతున్నారు. మిగతా అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ నిర్ణయం తీసుకున్న తర్వాత అందరి పేర్లను ఒకేసారి ప్రకటించే అవకాశం ఉందని మరి కొందరు అంటునానరు. పార్టీల అభ్యర్థులు అధికారిక బీ-ఫారంను ఫిబ్రవరి 3న ఉపసంహరణ గడువు ముగిసేలోపు అందజేసే అవకాశముంది. ఈలోపు టీపీసీసీ అధ్యక్షుడు స్ర్కీనింగ్ కమిటీ తయారు చేసిన జాబితాను మంత్రులతో కలిసి మరోసారి చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది.
ఫ స్ర్కీనింగ్ కమిటీలో భిన్నాభిప్రాయాలు..
- సర్వే రిపోర్టులతో షాక్ ఇచ్చిన ‘తుమ్మల’
కరీంనగర్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ అభ్యర్థులను గుర్తించడానికి మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ సమన్వయకర్తగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్, అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి సభ్యులుగా రూపొందించిన స్ర్కీనింగ్ కమిటీ గురువారం హైదరాబాద్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఇంట్లో సమావేశమైంది. ఈ సమావేశంలో స్ర్కీనింగ్ కమిటీ సభ్యులు ఎవరికివారు తమతమ జాబితాలను ఇతర సభ్యుల ముందుంచుతూ తమ సర్వేలో వీరికి గెలుపు అవకాశాలున్నాయి.. వీరినే పోటీలో నిలపాలంటూ పట్టుబట్టినట్లు తెలిసింది. సభ్యులందరూ ఎవరికివారు వారికి నచ్చిన అభ్యర్థుల కోసం పట్టుబట్టడంతో సమన్వయకర్త తలపట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని సమాచారం. మంత్రి తుమ్మల సమావేశానికి రాగానే స్ర్కీనింగ్ కమిటీ సభ్యులందరూ తమతమ సర్వే రిపోర్టులను ఆయన ముందుంచారు. వారినే అభ్యర్థులుగా ఎంపిక చేస్తే బాగుంటుందని కోరారు. అందరి ప్రతిపాదనలు విన్న తుమ్మల ఇంటెలిజెన్స్ ద్వారా సేకరించిన సమాచారాన్ని, పార్టీ పరిశీలకుడు సునీల్ కనుగోలు రెండుసార్లు నిర్వహించిన సర్వేల రిపోర్టులను కమిటీ ముందుంచారు. వీటిని పరిశీలించి ఏకాభిప్రాయం ఉన్న అభ్యర్థులను గుర్తించండని కమిటీ సభ్యులకు సూచించగా చివరికి వారంతా 66 డివిజన్లలో 40 మంది అభ్యర్థుల విషయంలో ఒక అభిప్రాయానికి వచ్చి జాబితాను తయారు చేశారని సమాచారం. ఈ సమయంలోనూ కొందరు సభ్యులు అలిగారని, అయితే చేసేదేమీలేక అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారని తెలిసింది. ఏకాభిప్రాయంతో తయారు చేసిన జాబితాను టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు, సీఎంవోకు, జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కార్యాలయాల్లో అందజేశారని తెలిసింది. టీపీసీసీ అధ్యక్షుడు సమ్మక్క జాతర నుంచి రాగానే మంత్రులతో చర్చించి జాబితాను వెల్లడిస్తారని సమాచారం. శుక్రవారమే జాబితా విడుదలయ్యే అవకాశాలున్నాయి.