నోటీసుల కలవరం
ABN , Publish Date - Aug 21 , 2026 | 01:09 AM
ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేసి ఇటీవల ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశారు.
జగిత్యాల, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేసి ఇటీవల ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశారు. అయితే జాబితాలో పేర్లు లేని వారు ఏం చేయాలనే దానిపై స్పష్టత ఉన్నప్పటికీ... పేర్లు ఉన్నా నోటీసులు వస్తాయేమోననే బెంగ మాత్రం కొందరు ఓటర్లలో నెలకొంది. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి అసెంబ్లీ నియోజక వర్గాల్లో కలిపి మొత్తం ఓటర్లు 6,46,294 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 3,12,284 మంది ఉండగా, స్త్రీలు 3,33,780 మంది, ఇతరులు 30 మందితో ముసాయిదా జాబితా ప్రకటించగా అందులో అనామలిస్ ఓటర్లు 1,75,488 మంది, మ్యాపింగ్ కాని ఓటర్లు 40,683 మంది ఉన్నట్లు తేలింది. జాబితాలో ఉన్న వారిలో ఎందరికి నోటీసులు వస్తాయో తేలాల్సి ఉండగా, వారు సరియైున పత్రాలు చూపిస్తేనే తుది జాబితాలో చోటు దక్కనుంది. ముసాయిదా ఓటర్ల జాబితాలో 6,46,294 మంది ఉన్నారు. జిల్లాలో పలువురు ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి రాలేదు. ఇందులో మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారే కాకుండా ఫారం తీసుకోని వారు, తీసుకున్నా ఇవ్వని వారు ఉన్నారు. అయితే ముసాయిదా జాబితాతో పోలిస్తే తుది జాబితాలో ఓటర్ల సంఖ్యలో హెచ్చుతగ్గులు నమోదయ్యే అవకాశముందని చెబుతున్నారు.
ఫసందిగ్ధంలో 1.75 లక్షల ఓట్లు..
ముసాయిదా జాబితాలో 1,75,488 మంది అనామలిస్ ఓటర్లున్నారు. పలువురు ఓటర్లకు సంబంధించి పేర్ల అక్షర దోషాలు, చిరునామా, ఫొటోలు తప్పుగా ఉండి మ్యాపింగ్ వివరాల్లో వ్యత్యాసం రావడంతో అనామలిస్ జాబితాలో పెట్టారు. ఇక 40,683 మంది వివరాలు 2002 ఓటరు జాబితాలో పోల్చినప్పుడు వివరాలు లేక మ్యాపింగ్ కాలేదు. అయితే ఎన్యూరేషన్ ఫారాల డిజిటలైజేషన్ కన్నా ముందే జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవ చూపడంతో అనామలిస్ జాబితాలో సంఖ్య తగ్గింది.
ఫబీఎల్‌లోల ద్వారా నోటీసులు..
జాబితాలోని ఓటర్లలో అనామలిస్, మ్యాపింగ్ కాని వారికి బీఎల్‌వోలు ఇంటింటికి పర్యటించి నోటీసులు ఇవ్వనున్నారు. ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసులను ఈనెల 26వ తేదీ నుంచి బీఎల్‌వోలు ఓటర్లకు పంపిణీ చేయడానికి సిద్ధమవుతున్నారు. కొందరికి సెల్‌ఫోన్ ద్వారా మెసేజ్‌లు పంపనున్నారు. నోటీసులు అందుకున్న వారు ఈఆర్‌వో, ఏఆర్‌వో వద్దకు వెళ్లి ఎన్నికల కమిషన్ ప్రకటించిన 11 గుర్తింపుకార్డుల్లో ఏదైన ఒకటి సమర్పించారు. వాటిని పరిశీలించి అంతా సవ్యంగా ఉందని భావిస్తే ఓటు కొనసాగిస్తారు. ఇక అనర్హులు ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం కూడా కల్పించారు.
ఫఎవరెవరు..?
ముసాయిదా జాబితాలో పేర్లు ఉన్నాయా..లేవా అని జిల్లా వాసులు నేరుగా కొందరు, ఆన్‌లైన్‌లో ఇంకొందరు చూసుకుంటున్నారు. అనామలిస్, మ్యాపింగ్ కాని ఓటర్లు కూడా ముసాయిదా జాబితాలో ఉండడంతో చివరి వరకు కొనసాగుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముసాయిదా విడుదలైతే ఓటు హక్కు ఉన్నట్లేనని ఇన్నాళ్లు భావించగా, ఇందులో ఎవరెవరికి నోటీసులు వస్తాయోనన్న సందేహాలు ఎదురవుతున్నాయి. బీఎల్‌వోలు వచ్చి నోటీసులు ఇచ్చే వరకు స్పష్టత వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో పలువురు ఓటర్లు నోటీసుల వ్యవహారంపై ఎదురుచూస్తున్నారు.
ఫనో మ్యాపింగ్, అనామలిస్ అంటే...
నో మ్యాపింగ్, అనామలిస్ అంటే ఏమిటో తెలియక చాలా మంది ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారు. ఎన్యూమరేషన్ ఫారంలో అడిగిన 2002 ఓటర్ల జాబితా (గత ‘సర్’) లోని స్వీయ లేదా రక్త సంబంధీకుల వివరాలు భర్తీ చేయని వారిని నో మ్యాపింగ్ కేటగిరీలో చేర్చారు. ఈ వివరాలను భర్తీ చేసినప్పటికీ, అవి వాస్తవ విరుద్ధంగా, అసంపూర్తిగా ఉంటే వాటిని అనామలిస్‌గా అధికారులు అంటున్నారు. తల్లిదండ్రులు-సంతానం మధ్య వయస్సు తేడా 50 ఏళ్ల కన్నా ఎక్కువ ఉండడం, పాత సర్ జాబితాలో తల్లిదండ్రుల పేర్లకు, ఇప్పుడు పేర్కొన్న పేర్లకు మధ్య తేడాలుండడం, గతంలో భర్త పేరు పేర్కొన్న వారు ఇప్పుడు తండ్రి పేరు పేర్కొనడం, గత సర్‌తో పోలిస్తే వయసులో వ్యత్యాసం...ఇలా వివిధ కారణాలతో వాస్తవాలకు విరుద్ధంగా కనిపిస్తున్న వాటిని ఈ కేటగిరిలో చేర్చారు. ఇలాంటి వారందరికీ బీఎల్‌వోల ద్వారా నోటీసులు అందుతాయని అధికారులు అంటున్నారు. జిల్లాలో నో మ్యాపింగ్ కేటగిరిలో పలువురు ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.
అందించాల్సిన పత్రాలు..
ఫనో మ్యాపింగ్ జాబితాలోని వారి వయసు ఆధారంగా ఎవరు ఏ పత్రాలు అందజేయాలో అధికారులు పేర్కొన్నారు. 1-7-1987 కంటే ముందు పుట్టిన వారు ఎన్నికల సంఘం పేర్కొన్న 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకటి తమది ఇవ్వాలి.
ఫ 1-7-1987 నుంచి 2-12-2004 మధ్య పుట్టిన వారు గుర్తింపు పత్రంతో పాటు తల్లిదండ్రుల్లో ఎవరిదో ఒకరిది అందజేయాలి.
ఫ 2-12-2004 తర్వాత పుట్టిన వారు తమతో పాటు తల్లిదండ్రులిద్దరి పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది.