ప్రజల దృష్టిని మరల్చడానికే సీఎం సభ
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:39 AM
ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక ప్రజల దృష్టిని మరల్చడానికే సిరిసిల్లలో సీఎం బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు.
ఇల్లంతకుంట, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక ప్రజల దృష్టిని మరల్చడానికే సిరిసిల్లలో సీఎం బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. 22ఏను తీసుకవచ్చి లక్షలాది ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చి వారితో కొంతమంది ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని విమర్శించారు. నేతన్నల ఆత్మ హత్యలు ఉన్న సిరిసిల్ల ప్రాంతాన్ని మాజీ మంత్రి కేటీఆర్ అభివృద్ధిలోకి తీసువచ్చాడని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి దిగజారుడు మాటలు మాట్లాడటానికి మాత్రమే సిరిసిల్లకు వస్తున్నాడని అన్నారు. సీఎం సభకోసం పెట్టే ఖర్చును నేతన్నల అభ్యున్నతికి కేటాయిస్తే బాగుంటుందని అన్నా రు. మానకొండూర్ ఎమ్మెల్యే సత్యనారాయణ ఈ ప్రాంతంలో ఏమాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కాళేశ్వరం కూలి పోయిందని అన్న ప్రభుత్వం ఇప్పుడు నీళ్లు ఎలా వస్తున్నాయో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. మాజీ సర్పంచ్‌ల బిల్లులు 100 రోజుల్లో చెల్లిస్తానని చెప్పి వెయ్యి రోజులు గడిచిపోయినా చెల్లించలేదని విమర్శించారు. మధ్య మానేరు కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకో వాలని రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జడ్పీ మాజీ వైస్‌చైర్మన్ సిద్దంవేణు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, సెస్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, సర్పంచ్ బద్దం శేఖర్‌రెడ్డి, నాయకులు రాజిరెడ్డి, గొడుగు తిరుపతి, రాగటి రమేష్, రడం ప్రవీణ్, బొల్లం వెంకటేశం, పత్రి అంజయ్య, లక్ష్మారెడ్డి, కుడుముల నాగరాజు, కూనబోయిన రఘు, ప్రశాంత్‌రెడ్డి, పట్నం శ్రీనివాస్, నరేష్, కొట్టె వెంకన్న, మామిడి తిరుపతి, పండుగ భాస్కర్, నాగుల సాయి, మల్లయ్య తదిత రులు పాల్గొన్నారు.