పుర‘పోరు’కు మోగిన నగారా..
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:54 AM
మున్సిపల్ ఎన్నికల జాతర మొదలైంది. మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడి కావడంతో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో రాజకీయ కోలాహలంగా నెలకొంది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
మున్సిపల్ ఎన్నికల జాతర మొదలైంది. మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడి కావడంతో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో రాజకీయ కోలాహలంగా నెలకొంది. నామినేషన్ల స్వీకరణ, పోలింగ్ గడువుకు మధ్య వారం రోజులే ఉండడంతో అభ్యర్థుల్లో హడావుడి చోటుచేసుకుంది. ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణమైనా వస్తుందని ముందస్తుగానే ప్రధాన పార్టీల అభ్యర్థులు, పోటీకి సిద్ధమైన ఆశావహులు నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారు. రిజర్వేషన్లు ఖరారు అయిన నాటి నుంచే కొందరు ప్రచారానికి కూడా స్వీకారం చుట్టారు. ఎన్నికల నగారా మోగడంతో ప్రధాన పార్టీల అధిష్టానం అభ్యర్థులతో నామినేషన్లు వేసే ప్రక్రియపై దృష్టి పెట్టారు. మరోవైపు సిరిసిల్లలో 39 వార్డులు, వేములవాడ మున్సిపాలిటీ 28 వార్డులో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు.
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలోని 67 వార్డులకు బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఇందుకోసం సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులకు 13 కౌంటర్లు, వేములవాడలో 28 వార్డులులకు 10 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈనెల 28,29,30 తేదీల్లో నామినేషన్లు వేయడానికి గడువు ఉంది. నామినేషన్ల స్వీకరణకు మూడు రోజులే గడువు ఉండడంతో అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. నామినేషన్ల దాఖలు ఏర్పాట్లలో పడ్డారు. 31 తేదీన నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 1న అభ్యంతరాల స్వీకరణ, ఫిబ్రవరి 3వ తేదీ వరకు నామినేషన్ ఉపసంహరణ, 11వ తేదీన ఉదయం7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. రీపోలింగ్ అవసరమైతే 12వ తేదీన నిర్వహిస్తారు. 13వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడిస్తారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడి కావడంతోనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. పోటీచేసే అభ్యర్థులతో పాటు ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. మంత్రులు అధికార పర్యటనలు ఎన్నికల ప్రచారంగా ఉపయోగించుకోకూడదు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రభుత్వ వాహనాలు ఉపయోగించవద్దు. పోటీ చేసే అభ్యర్థులు ప్రచార సమయంలో ఎన్నికల ఖర్చులు కూడా నిబంధనల మేరకే చేయాల్సి ఉంటుంది. పోలీసులు సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నగదు, మద్యం రవాణాపై కూడా దృష్టి పెడతారు. సరైన పత్రాలు లేకుండా నగదు తీసుకొని వెళితే సామాన్యులకు సైతం ఇబ్బందులు తప్పవు.
బీసీలకు 24, అన్ రిజర్వ్ కేటగిరికి 34 వార్డులు
సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలో 67వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు అయిన విషయం తెలిసిందే. 24 వార్డులు బీసీలకు రిజర్వు కాగా, 34 వార్డులు ఆన్ రిజర్వ్ కేటగిరికి కేటాయించారు. ఎస్టీలకు రెండు, ఎస్సీలకు ఏడు వార్డులు రిజర్వ్ చేశారు. రాష్ట్ర యూనిట్‌గా సిరిసిల్ల చైర్‌పర్సన్ స్థానం జనరల్ మహిళకు కేటాయించారు. వేములవాడ చైర్‌పర్సన్ స్థానం బీసీ జనరల్‌గా రిజర్వుడు చేశారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులు ఉండగా ఎస్టీ జనరల్ 1, ఎస్సీలకు 3, బీసీలకు 15, జనరల్ 20 రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం కోటా నిర్ణయించగా దాని ప్రకారం 12వ వార్డు ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయింది. మూడు ఎస్సీ రిజర్వ్ కోటాలో 1వ వార్డు, 22వ వార్డు ఎస్సీ జనరల్‌కు, 8వ వారు ్డమహిళకు, బీసీలకు 15వార్డులు రిజర్వ్ కాగా బీసీ మహిళలకు 3, 4, 5, 10, 31, 38,39 వార్డులు, బీసీ జనరల్ వార్డుల్లో 2, 7, 11, 13,14, 16, 17, 20, వార్డులు రిజర్వ్ అయ్యాయి. జనరల్ వార్డుల్లో జనరల్ మహిళ రిజర్వ్‌లో 6, 9, 15,18, 23, 27, 28, 29, 30,36.37. వార్డులు, జనరల్ వార్డుల్లో 19, 21, 24,25,26, 32,33,34, 35, కేటాయించారు. వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా ఎస్టీ జనరల్‌గా 12వ వార్డు, ఎస్సీ రిజర్వేషన్‌లో ఎస్సీ మహిళకు 3, 13, వార్డులు, ఎస్సీ జనరల్‌గా 17, 20 వార్డులు, బీసీల రిజర్వేషన్‌లో బీసీ మహిళలకు 1, 11, 23, 27 వార్డులు, బీసీ జనరల్‌గా 8, 15, 16, 21, 24వార్డులు రిజర్వ్ అయ్యాయి. జనరల్ కోటాలో జనరల్ మహిళలలకు 2, 5, 9, 10, 19,22, 26, 28 వార్డులు, జనరల్ వార్డులుగా 4, 6, 7, 14, 18, 25 వార్డులు ఉన్నాయి. మునిసిపల్ ఎన్నికల నోటిపికేషన్ వెల్లడితో తమ ఆధిపత్యాన్ని చాటుకునే దిశగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీల్లో సందడి మొదలైంది. జిల్లాలోని సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులు, వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా, గడిచిన పాలకవర్గాల పగ్గాలు బీఆర్‌ఎస్ దక్కించుకుంది. ఈసారి సిరిసిల్ల వేములవాడ రెండు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పట్టు సాధించాలనే సంకల్పంతో ఉంది. బీఆర్‌ఎస్ తిరిగి గులాబీ జెండానే ఎగురవేయాలని వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ఇటీవల ముగిసిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తన ఆధిపత్యాన్ని పదిలపరుచుకొంది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే ఆనవాయితీని నిలపాలని భావిస్తోంది. కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా పాలక పగ్గాలు చేపట్టాలని అభ్యర్థుల ఎంపిక వైపు దృష్టి పెట్టింది. తనదైన శైలిలో సిరిసిల్ల, వేములవాడ పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి ఉన్న ఆదరణను ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని భావిస్తోంది. వామపక్ష పార్టీలు సీపీఎం, సీపీఐ కార్మిక వాడల్లో అభ్యర్థులను బరిలో నిలిపి విజయం సాధించాలనే తాపత్రయంతో ఉంది.
రెండు మున్సిపాలిటీల్లో 1.22 లక్షల మంది ఓటర్లు
జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీల్లో 1,22,836 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 59,522 మంది, మహిళలు 63,290 మంది, ఇతరులు 24 మంది ఉన్నారు. ఇందులో మహిళలు అధికంగా ఉన్నారు. పురుషుల కంటే 3,768 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులు ఉండగా, 81,959మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 39,942 మంది, మహిళలు 42,011 మంది, ఇతరులు ఆరుగురు ఉన్నారు. వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా, 40,877మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 19,580 మంది, మహిళలు 21,279 మంది, ఇతరులు 18మంది ఉన్నారు. ఇందులో మహిళలు 1,699 మంది ఎక్కువగా ఉన్నారు.