Share News

పారదర్శకంగా జనగణన నిర్వహించాలి

ABN , Publish Date - Apr 07 , 2026 | 11:47 PM

నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టనున్న జనగణన ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రపుల్‌దేశాయ్‌ అధికారులను ఆదేశించారు.

పారదర్శకంగా జనగణన నిర్వహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌

కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టనున్న జనగణన ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రపుల్‌దేశాయ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ సమావేశమందిరంలో కార్పొరేషన్‌లోని వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కళాభారతి ఆడిటోరియంలో బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ నగరంలో పారదర్శకంగా జనగణన పూర్తిచేయాలన్నారు. ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్ల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని చెప్పారు. డివిజన్ల వారీగా బ్లాకులను ఏర్పాటు చేయాలని, హౌస్‌ లిస్టింగ్‌ బ్లాక్‌ ఒకే డివిజన్‌లో వచ్చే విధంగా చూడాలని అన్నారు. ఒక్కో బ్లాక్‌లో 120 నుంచి 150 నివాస గృహాలు, 700 నుంచి 750 మంది జనాభా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జనాభా వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కువగా సాంకేతికతను వినియోగించుకోవాలని చెప్పారు. ఎన్యూమరేటర్లు మొబైల్‌ యాప్‌లు, డిజిటల్‌ ఫారాల వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నాు. నిర్దేశించిన గడువులోగా క్షేత్రస్థాయిలో డేటా సేకరణ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదికలు అందించేలా చూడాలని ఆదేశించారు. జనగణన ప్రాధాన్యాన్ని వివరిస్తూ నగర ప్రజల్లో అవగాహన కల్పించాలని, ప్రజలు ఎన్యూమరేటర్లకు సహకరించాలని కోరారు. ఏప్రిల్‌ 15లోగా ప్రత్యేక సమగ్ర సవరణను పూర్తి చేయాలని బీఎల్‌వో, సూపర్‌వైజర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు. మ్యాపింగ్‌ సమయంలో ఇంటింటికి వెళ్లి ఓటరు వివరాలు, ప్రస్తుతం ఉన్న ఫొటోలను అప్‌డేట్‌ చేయాలన్నారు. ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్‌ జాబితాలో తప్పులు లేకుండా కచ్చితమైన సమాచారం పొందుపరుస్తూ ఓటరు జాబితాను రూపొందించాలని సూచించారు. నిర్లక్ష్యంగా, అలసత్వంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్‌ ఖాదర్‌ మొహియుద్దీన్‌, టౌన్‌ప్లానింగ్‌ డీసీసీ బషీరొద్దీన్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2026 | 11:47 PM