జనగణన బాధ్యతాయుతంగా నిర్వహించాలి
ABN , Publish Date - Apr 21 , 2026 | 11:49 PM
జనగణనను బాధ్యతాయుతంగా నిర్వహించాలని, అన్ని వివరాలను తప్పులు లేకుండా పారదర్శకంగా నమోదు చేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా అన్నారు.
చొప్పదండి, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): జనగణనను బాధ్యతాయుతంగా నిర్వహించాలని, అన్ని వివరాలను తప్పులు లేకుండా పారదర్శకంగా నమోదు చేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా అన్నారు. మంగళవారం చొప్పదండి బాలుర ఉన్నత పాఠశాలలో ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు ఏర్పాటు చేసిన మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ తప్పులు లేకుండా కుటుంబ సభ్యుల వివరాలను కచ్చితత్వంతో నమోదు చేయాలన్నారు. డిజిటల్ సర్వేపై అనుమానాలు నివృత్తి చేయాలని, గత సర్వేల్లో పాల్గొన్న సిబ్బంది అనుభవాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. మొదటి దశలో మే11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల గణన నిర్వహిస్తారని, రెండవ దశలో ఫిబ్రవరి 2027లో వ్యక్తులవారీగా సమాచారం సేకరిస్తారని ఆమె తెలిపారు. అధికారులు ప్రతి కుటుంబం వివరాలు పక్కాగా నమోదు చేయాలన్నారు.
ఫ వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచాలి
విద్యార్థుల భద్రతకు, ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ వసతిగృహాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ చిత్రామిశ్రా సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం చొప్పదండిలోని ఎస్సీ సంక్షేమ శాఖ వసతి గృహాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది, మరుగుదొడ్లు, డార్మెటరీ హాల్, భోజనశాలను పరిశీలించారు. మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ,సిబ్బంది హాస్టల్లోనే ఉండాలని, నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే, డీపీవో జగదీశ్వర్, తహసీల్దార్ నవీన్‌కుమార్, వార్డెన్ కుమారస్వామి పాల్గొన్నారు.
ఫగ్రామాల్లో తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి..
గ్రామాల్లో ప్రజలకు మంచి నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చిత్రామిశ్రా అధికారులను ఆదేశించారు. గుమ్లాపూర్, కాట్నపల్లి పంచాయితీ పరిధిలోని మల్లన్నపల్లిలో మంచినీటి బావులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో జనాభా అవసరాలకు అనుగుణంగా నీటిని అందించాలన్నారు.