‘సహకార’ సందడి
ABN , Publish Date - May 22 , 2026 | 12:46 AM
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నామినేటెడ్ విధానంలో పాలక మండళ్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
జగిత్యాల, మే 21 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నామినేటెడ్ విధానంలో పాలక మండళ్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా అధికారులకు సమాచారం అందించారు. దీంతో జాబితాలను ఇవ్వాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, సెగ్మెంట్ బాధ్యులను అధికారులు కోరారు. నామినేటెడ్ విధానంలో పదవులు భర్తీ చేయనుండడంతో గ్రామాల్లో మళ్లీ సహకార సందడి నెలకొంది. పదవి ఆశిస్తున్న నాయకులు తమ వంతుగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లో 51 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. వీటిలో సుమారు 1.5 లక్షల మంది సభ్యులు ఉన్నారు.
ఫగడువు పొడిగింపుతో..
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక మండళ్లు, డీసీఎంఎస్‌లు, డీసీసీబీ పాలకవర్గం గడువు 14 ఫిబ్రవరి 2025న ముగిసింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం వాటి గడువును మరో ఆరు నెలలు పొడిగించింది. అనంతరం మరో ఆరు నెలల గడువును పొడిగిస్తూ 2025 ఆగస్టు 14వ తేదీన అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పొడిగింపు గడువు 2026 ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాలక వర్గాలను రద్దు చేసి పర్సన్ ఇన్‌చార్జీలను నియమిస్తూ 2025 డిసెంబరు 19వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది.
ఫఇటీవలే పాత పాలక మండళ్ల పునరుద్ధరణ..
గత నెలలో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సహకార సంఘాలకు ఎన్నికలకు బదులుగా నామినేటెడ్ విధానంతో పాలక మండళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించి 27వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గడువు ఉండగానే పాలక మండళ్లను రద్దు చేయడం, ఎన్నికల విధానానికి బదులుగా నియమిత విధానానికి వెళ్లడంపై పలువురు న్యాయపోరాటానికి దిగారు. ఈమేరకు విచారణ జరిపిన కోర్టు పాత పాలక మండళ్లనే కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చింది. కోర్టు సూచన మేరకు ఈనెల 5వ తేదీ నుంచి పాత పాలక మండళ్లను పునరుద్ధరించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని సహకార సంఘాల్లో పాత పాలక వర్గాలు కొలువదీరాయి. పర్సన్ ఇన్‌చార్జీల నుంచి పాత పాలకవర్గాల చైర్మన్లు బాధ్యతలను తిరిగి స్వీకరించారు.
ఫఒక్కో పీఏసీఎస్‌లో 11 నుంచి 13 మందితో...
జిల్లాలోని సహకార సంఘాల్లో ఇటీవల పాత పాలకమండళ్లు మళ్లీ కొలువు దీరిన నేపథ్యంలో నామినేటెడ్ విధానంలో ఒక్కో సహకార సంఘానికి 11 నుంచి 13 మందితో కూడిన జాబితాను పంపాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా జాబితాలను పంపడానికి ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకోవడానికి ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఫఅదృష్టం వరించేదెవరినో..
సహకార సంఘాల అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సభ్యులుగా నియమించే వారికి సంబంధించి 18 రకాల వివరాలను పంపాలని ప్రభుత్వం సూచించింది. మార్కెట్ కమిటీల మాదిరిగానే అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సభ్యులు, అధికారులు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉండనున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, సెగ్మెంట్ బాధ్యులు జిల్లా మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ద్వారా పాలక మండళ్ల ప్రతినిధులను ఎన్నిక చేసే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు అంటున్నాయి. ఎరువులు, విత్తనాల విక్రయం, ధాన్యం, మక్కల కొనుగోళ్లు, పెట్రోలు పంపుల నిర్వహణ, రుణాల పంపిణీ, బ్యాంకింగ్ కౌంటర్ల ద్వారా లావాదేవీల నిర్వహణ తదితర వాటితో సహకార సంఘాలకు అమితమైన ప్రాధాన్యత ఉంది. దీంతో పాలక మండలిలో పదవులు దక్కించుకోవడానికి పోటీ ఎక్కువగానే ఉంది. ఎవరిని పదవులు వరిస్తాయి..ఎవరికి ఏ పదవి దక్కుతుందన్న చర్చలు పల్లెల్లో చోటుచేసుకుంటున్నాయి.