Share News

‘యోగా’నందం..

ABN , Publish Date - Jun 21 , 2026 | 01:08 AM

మనిషి జీవితంలో మానసిక ప్రశాంతత శారీరక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత ఉంటే రోజంతా హాయిగా గడిచిపోతుంది.

‘యోగా’నందం..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల్ల)

మనిషి జీవితంలో మానసిక ప్రశాంతత శారీరక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత ఉంటే రోజంతా హాయిగా గడిచిపోతుంది. ప్రస్తుత పరుగుల జీవితంలో హాయి అనే మాట వినిపించడం లేదు. పెరుగుతున్న మానసిక ఒత్తిడి మనిషిని అనేక అనర్థాలకు, సమస్యల్లోకి నెట్టివేస్తోంది. మన జీవన విధానంలో చివరకు ఇబ్బందిపడేది అనారోగ్య సమస్యలతోనే.. అందుకు ఏకైక మార్గం యోగా అని చెప్పవచ్చు. ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడమే కాకుండా ఏకాగ్రతను పెంపొందించే మన ప్రాచీన భారతీయ యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్రాచీన వారసత్వానికి వారధిగా నిలిచిన యోగాసనాలే. వేల సంవత్సరాల క్రితం పతంజలి మహర్షి మానవ శరీర నిర్మాణం రహస్యాలను ఆవిష్కరించారు. శరీర ధర్మాలను అధ్యాయనం చేసి ఆరోగ్యం కోసం యోగాసనాలను అందించారు. ప్రాణాయామం, సూర్యనమస్కారాలు, యోగాసనాలు, యోగ విద్యలో కీలకం. పతంజలి తరువాత ఎందరో మహర్షులు దీనిని శాస్త్రీయతను కల్పించారు. ఈ ప్రాచీన విద్యకు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండగా, ఐక్యరాజ్యసమితి జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఇందిరా పార్కులో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అయుష్‌, యోగా సాధన సమితి ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. యోగా అభిమానులు, సాధకులు హాజరుకావాలని కోరారు. దీంతో ప్రాచీన విజ్ఞానానికి అరుదైన గుర్తింపుగా భావిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి గుర్తింపుతో జిల్లాలో యోగాపై ఆసక్తి కూడా పెరిగింది. మనిషి ఆరోగ్యాన్ని, అశాంతిని దూరం చేసే యోగా విద్య ఉపయోగాల్లోకి వెళితే ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవచ్చు.

యోగా దినోత్సవ నేపథ్యం..

ఐక్యరాజ్యసమితి 2015 సర్వసభ్య సమావేశంలో ప్రధాని మోదీ యోగాకు అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వాలని తీర్మానం చేశారు. 170 దేశాలు మద్దతునిచ్చాయి. ప్రపంచ ఆరోగ్య విదేశీ విధానం కింద ఐక్యరాజ్యసమితి జూన్‌ 21న యోగా దినంగా ప్రకటించింది. జూన్‌ 21కి ఉన్న నేపథ్యం ఏమిటని చర్చనీయాంశంగా మారింది. దక్షిణాదివారి లెక్క ప్రకారం దక్షిణాయనం జూలైలో మొదలవుతుంది. కానీ ఉత్తరాదివారి సాయాన పద్ధతిలో దక్షిణాయనం కర్కట సంక్రాంతి జూన్‌ 21నే మొదలవుతుంది. సాయాన పద్ధతి ప్రకారం సూర్యుడు ఉత్తరాయణంలో ఉచ్ఛదశకు చేరుకునే రోజు. సంవత్సరం మొత్తం మీద పగలు ఎక్కువగా ఉండే రోజు కూడా ఇది. అందుకే ఈ రోజుకు ఈ ప్రత్యేకత. దక్షిణాయనంలో పండుగలు, వ్రతాలు ఆచరించడం ఎక్కువగా కనపడుతుంది. చతుర్మాస్య వ్రతం, వినాయక చవితి, మంగళగౌరి వ్రతాలు, దసరా, దీపావళి వంటి పండుగలు దక్షిణాయనంలో వస్తాయి. అందుకే ఆధ్యాత్మికంగా ఉత్తమమైనదిగా అర్థం చేసుకోవచ్చు. దీంతోపాటు జూన్‌ 21న లాత్వియన్లు ఈ రోజును జానీగా పేర్కొంటూ పండుగలు జరుపుకుంటే, ఎస్తోనియన్లు జానీపేవ్‌గా జరుపుకుంటారు. యురోపియన్లు మిడ్‌సమ్మర్‌గా వ్యవహరిస్తారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా జూన్‌ 21కి ప్రాధాన్యం ఉండడంతోనే యోగా దినంగా నిర్ణయించారని భావిస్తున్నారు.

యోగా వల్ల ప్రయోజనాలివి..

మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యానికి యోగా దివ్య ఔషధంగా చెప్పుకోవచ్చు. వయస్సుతో సంబంధం లేకుండా యోగాను అభ్యసించవచ్చు. యోగాలో ఎనిమిది రకాలు చెప్పుకోవచ్చు. యమము, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణం, ధ్యానం, సమాధి. యోగ సాధనంలో ప్రధానంగా పాటించాల్సిన అంశాల్లో యమనియమాలు, ఆసన ప్రాణాయామాలు ముఖ్యమైనవి. దాదాపు మన రుషులు అందించిన 84 లక్షల ఆసనాలు ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నా 84 మాత్రమే ఆచరణలో ఉన్నాయి. ఇందులో అతి ముఖ్యమైనవి వజ్రాసనం, సిద్ధాసనం, పద్మాసనం, సర్వంగాసనం, శిర్షాసనం, అర్థమయూరాసనం, ఉప విష్టకోనాసనం, గరుడాసనం, చక్రాసనం, కటిచక్రాసనం, వ్యాగ్రాసనం, ప్రాణాయామం, వృక్షాసనంలతో పాటు సూర్య నమస్కారాలు, తడాసనం, పాదహస్తాసనం, ఏకపాద కుంచిత సరళ భుజంగాసనం, ఊర్య్థ చక్రాసనం, సాష్టాంగ నమస్కారాసనం, భుజంగానసనం, ఊర్థ్య చక్రాసనం.

ఆసనాల వల్ల ఉపయోగాలు..

వజ్రాసనం : ఎలాంటి ఆహారం తీసుకున్నా జీర్ణశక్తి పెరుగుతుంది. వెన్నముక నిటారుగా ఉండి శ్వాసక్రియలు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మోకాళ్ల నొప్పులను నియంత్రిస్తుంది. మోకాళ్ల నొప్పులు వచ్చిన తరువాత ఆసనం చేయవద్దు.

సిద్ధాసనం : మనస్సును ప్రశాంతపరుస్తుంది. ఎక్కువ సమయం కూర్చోవడానికి వీలు కల్పిస్తుంది. అనవసరమైన ఆలోచనలు రాకుండా నియంత్రిస్తుంది. స్థిర నిర్ణయాలు తీసుకునే శక్తినిస్తుంది.

పద్మాసనం : వెన్నముక, కడుపునకు సంబంధించిన వ్యాధుల నుంచి ఉపశమనం, ఒళ్లు నొప్పులను నియంత్రిస్తుంది.

సర్వంగాసనం : తలకు సంబంధించిన రుగ్మతలను తొలగిస్తుంది. థైరాయిడ్‌ సమస్యను నియంత్రిస్తుంది. రక్తప్రసరణ సక్రమంగా జరగడానికి ఉపకరిస్తుంది.

శిర్షాసనం : బ్రెయిన్‌ ట్యూమర్‌ వ్యాధులను నియంత్రిస్తుంది. నరాలు బాగా పనిచేసే విధంగా చేస్తుంది. జ్ఞాపకశక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది.

అర్థమయూరాసనం : షుగర్‌ వ్యాధిని నియంత్రిస్తుంది. ఛాతి, కడుపునకు సంబంధించిన సమస్యలను నియంత్రించి జీర్ణశక్తిని పెంచుతుంది.

ఉపవిష్టకోనాసనం : మహిళలకు సంబంధించి ఈ ఆసనం ఎంతో ఉపయోగం. గర్భసంచి సమస్యలు రాకుండా నియంత్రిస్తుంది. సంతాన లేమిని తొలగిస్తుంది. స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. పొట్ట దగ్గర ఉండే కొవ్వును కరిగిస్తుంది.

గరుడాసనం : మహిళలు ఈ ఆసనం చేయడం వల్ల ఏకాగ్రతను పెంచుతుంది. శరీర బరువును అదుపులో ఉంచి గర్భసంచి సమస్యలు రాకుండా నియంత్రిస్తుంది.

చక్రాసనం : పక్షవాత రోగాలను నియంత్రిస్తుంది. ప్రతి రోజు ఈ ఆసనం చేయడం ద్వారా పక్షవాతం రాకుండా ఉంటుంది.

కటి చక్రాసనం : మహిళలకు ఈ ఆసనం ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. షుగర్‌ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. నడుము కొలతలను తగ్గిస్తుంది. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది. అధిక బరువును తగ్గిస్తుంది.

బ్యాగ్రాసనం : కిడ్నీ సమస్యలను నియంత్రిస్తుంది. మగవారిలో సంతానలేమిని తొలగిస్తుంది.

ప్రాణాయామం : ప్రాణాయామంలో సూర్యభేద, ఉజ్జయి, భస్త్రిక, శీతలి, సీత్కారి, భ్రమరి, ప్లావిని, మూర్ఛ, అనులోమ, విలోమ, ప్రాణాయామ రకాలు ఉంటాయి. వీటి వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శ్వాస సంబంధమైన వ్యాధులను దూరం చేస్తుంది. చర్మవ్యాధులను, బీపీని నియంత్రిస్తుంది. ముఖ సౌందర్యం పెంచుతుంది. రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. వేడి తగ్గిస్తుంది. మనశ్శాంతి, సంతోషాన్ని కలిగిస్తుంది.

సూర్యనమస్కారాలు..

సూర్యనమస్కారాలు అంటే సూర్యునికి నమస్కరించడం అని అర్థం. సూర్యనమస్కారాలు సంప్రదాయ విలువలు, శాస్త్రీయత కలిగి ఉన్నాయి. ప్రతిరోజు 20 సూర్యనసమస్కారాలు చేస్తే బరువును తగ్గించుకోవచ్చు. కాళ్లు, చేతులు, పొట్ట, శరీరానికి వ్యాయామం జరుగుతుంది. తలకిందికి వంచడం వల్ల తలభాగానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. రక్త ప్రసరణ వల్ల కణాలు, నరాలు బలంగా తయారవుతాయి. నడుము పైభాగమంతా చురుకుగా తయారవుతుంది. పొట్ట, ఛాతీ అవయవాలు ధృడత్వంగా మారుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది.

Updated Date - Jun 21 , 2026 | 01:08 AM