‘భువన్’ సర్వేను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Nov 10 , 2026 | 12:25 AM
నగరపాలక సంస్థ పరిధిలో ఆదాయ మార్గాలను మెరుగుపరచడంలో భాగంగా చేపట్టిన భువన్ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ ప్రపుల్‌దేశాయ్ అధికారులను ఆదేశించారు.
కరీంనగర్ టౌన్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) నగరపాలక సంస్థ పరిధిలో ఆదాయ మార్గాలను మెరుగుపరచడంలో భాగంగా చేపట్టిన భువన్ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ ప్రపుల్‌దేశాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని 12వ డివిజన్‌లో ప్రారంభమైన భువన్ సర్వేను కమిషనర్ తనిఖీ చేశారు. యాప్ పనితీరును, సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ గతంలో జియో ట్యాగింగ్ కాకుండా పెండింగ్‌లో ఉన్న కొత్త, పాత భవనాల సర్వే తిరిగి ప్రారంభించామన్నారు. సర్వే మొబైల్ యాప్‌లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పక్కగా వివరాలను నమోదు చేయాలని రెవెన్యూ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. నగర పాలక సంస్థ పరిధిలో పెండింగ్‌లో ఉన్న ప్రతి అసెస్మెంట్‌కు సంబంధించిన సరైన సమాచారాన్ని డిజిటలైజ్ చేయాలన్నారు. భువన్ సర్వే ప్రక్రియను వేగవంతంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఖాధర్ మొహియుద్దీన్, ఆర్వో నియాజ్, ఆర్‌ఐ శ్యామ్, వార్డు ఆఫీసర్ పూర్ణచందర్ పాల్గొన్నారు.