బీసీ కులాలదే మెజారిటీ..
ABN , Publish Date - Apr 17 , 2026 | 03:17 AM
తెలంగాణలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల సర్వే-2024 గణన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల్లో ఆసక్తి రేపింది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
తెలంగాణలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల సర్వే-2024 గణన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల్లో ఆసక్తి రేపింది. బుధవారం రాత్రి నాలుగు విభాగాలుగా కుటుంబ సర్వే వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కులాల వారీగా జనాభా, చదువులు, భూములు, ఇండ్లు, చివరకు పెళ్లికాని వారి సంఖ్యలు, కులాంతర వివాహాలు, ఆర్థిక అసమానతలు వంటి వివరాలతో నివేదికలను సమగ్రంగా ప్రజల ముందుకు వచ్చాయి. ప్రధానంగా ఒక కులాల వారీగా వెల్లడించిన లెక్కలు జిల్లాలోని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 192405 కుటుంబాలు, 568925 జనాభాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల కుటుంబాలు, జనాభా లెక్కలను వెల్లడించారు. జిల్లాలో 5.68లక్షల జనాభాలో బీసీలు (ముస్లింలు మినహాయించి) 61.39 శాతం, ఎస్సీలు 20.10 శాతం, ఎస్టీలు 4.89 శాతం ఉన్నారు. జనాభాలో అత్యధికంగా బీసీలు ఉండగా, అందులో పద్మశాలి సామాజిక వర్గం వారు అధికంగా 70468 మంది ఉన్నారు. తర్వాత ఎస్సీలో మాదిగ సామాజికవర్గం వారు అధికంగా 67166 మంది ఉన్నారు. ఓసీల్లో రెడ్డిలు 35477 మంది ఎక్కువగా ఉన్నారు.
బీసీల్లో పద్మశాలిలే ముందువరస..
జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల్లో 134 ఉపకులాలు ఉన్నాయి. ముస్లింలను మినహాయించి బీసీ కుటుంబాలు 117914 కుటుంబాలు ఉండగా జనాభా 346866 మంది ఉన్నారు. జనాభాలో కుటుంబాలు 61.39 శాతం, జనాభా 61.39 శాతం ఉంది. బీసీల్లో ముస్లిం కుటుంబాలు 6648 కుటుంబాలు ఉండగా, జనాభా 21997 మంది ఉన్నారు. కుటుంబాలు 3.46 శాతం, జనాభా 3.87 శాతం ఉంది. బీసీల్లో పద్మశాలి కుటుంబాలు 19.34 శాతంతో 24091 ఉండగా, 19.10 శాతంతో జనాభా 70468 మంది ఉన్నారు. బీసీ-ఏ లో అధికంగా రజక 5.85 శాతంతో 7282 కుటుంబాలు, 5.83 శాతంతో 21510 జనాభా ఉంది. నాయీబ్రాహ్మణ కులాలకు సంబంధించి 1.79 శాతంతో 2234 కుటుంబాలు, 10.54 శాతంతో 38871 జనాభా ఉంది. బీసీ-బీలో గౌడ కులస్తులు 10.69 శాతంతో 13313 కుటుంబాలు, 10.54శాతంతో 38871జనాభా, కుమ్మర 2.49 శాతంతో 3097 కుటుంబాలు, 2.45 శాతంతో 9046 జనాభా, కురుమ 3.31 శాతంతో 4122 కుటుంబాలు, 3.31 శాతంతో 12216 జనాభా, వడ్రంగి 2.22 శాతంతో 2760 కుటుంబాలు, 2.21శాతంతో 8137 జనాభా ఉంది. బీసీ-సీలో 132 కుటుంబాలు ఇతర కులాల్లోకి మారిన వారు ఉన్నారు. బీసీ-డీలో ముదిరాజ్ కులస్తులు ఎక్కువగా ఉన్నారు. ముదిరాజ్ 13.69 శాతంతో 17050 కుటుంబాలు, 13.55 శాతంతో 49964 జనాభా ఉంది. తర్వాత వరుసలో మున్నూరుకాపు 9.23 శాతంతో 11503 కుటుంబాలు, 8.95 శాతంతో 33 వేల జనాభా ఉంది. యాదవ, గొల్ల 10.39 శాతంతో 12944 కుటుంబాలు, 10.41శాతంతో 38386 జనాభా మిగతా ఉపకులాల్లో, బీసీ-ఈలో షేక్‌లు 1.94 శాతంతో 2416 కుటుంబాలు, 2.20 శాతంతో 8114 జనాభా ప్రధానంగా ఉంది.
ఎస్సీల్లో మాదిగల శాతమే అధికం..
సమగ్ర సర్వేలో ఎస్సీ జిల్లాలో 20.09 శాతంతో 38589 కుటుంబాలు ఉండగా, 20.10 శాతంతో 114180 జనాభా ఉంది. ఇందులో అధిక కుటుంబాలు, జనాభా మాదిగ సామాజిక వర్గం ముందు వరుసలో ఉంది. మాదిగలు 58.81 శాతంతో 22694 కుటుంబాలు ఉండగా, 58.82 శాతం 67166 జనాభా ఉంది. తర్వాత మాల వర్గం 30.27శాతంతో 11679 కుటుంబాలు, 29.84శాతంతో 34071 జనాభా ఉంది. తర్వాత బేడ జంగం 4.75 శాతంతో 1832 కుటుంబాలు, 5.35 శాతంతో 6112 జనాభా ఉంది.
ఎస్టీల్లో లంబాడ, బంజారాలే ఎక్కువ..
జిల్లాలో 4.26 శాతంతో 8178 కుటుంబాలు ఉండగా, 4.89 శాతంతో 27780 జనాభా ఉంది. ఇందులో ప్రధానంగా లంబాడా, బంజారా, సుగాలి చెందిన 6457 కుటుంబాలు 78.96 శాతంగా ఉన్నాయి.81.20 శాతంతో 22558 జనాభా ఉంది. తర్వాత ఎరుకల ఇతర ఉప కులాలు15.22 శాతంతో1245 కుటుంబాలు, 13.56 శాతంతో 3767 జనాభా ఉంది.
ఓసీల్లో రెడ్డిలే మెజార్టీ..
ఓసీల్లో 20 కులాల వరకు ఉన్నాయి. ఇందులో జిల్లాలో 10.80శాతంతో 20,746 కుటుంబాలు ఉండగా, 10.07 శాతంతో 57170 జనాభా ఉంది. ఇందులో రెడ్డి కులస్తులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. 62.81 శాతంతో 13031 కుటుంబాలు ఉండగా, 62.06 శాతంతో 35477 జనాభా ఉంది. వైశ్య, కోమటి 11.99 శాతంతో 2488 కుటుంబాలు ఉండగా, 11.54 శాతంతో 6597జనాభా ఉంది. వెలమ 12.34శాతంతో 2560 కుటుంబాలు ఉండగా,11.54 శాతంతో 6597 జనాభా ఉండగా, బ్రాహ్మణులు 2.14శాతంతో 444 కుటుంబాలు, 2.34 శాతంతో 1338 జనాభా, కాపు1.37 శాతంతో 285 కుటుంబాలు, 12.83 శాతంతో 1425 జనాభా ఉంది. ముస్లిం 2.05శాతంతో 425 కుటుంబాలు,2.49 శాతంతో 1425 జనాభా ఉంది.
కులం తెలుపని 4.96 శాతం కుటుంబాలు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో ఓసీల్లో 4.96 శాతం కుటుంబాలు కులం వివరాలను వెల్లడించలేదు. జిల్లాలో 20746 కుటుంబాలు వివరాలు తెలుపగా, 4.96 శాతంతో 1030 కుటుంబాలు, 5.05 శాతం 2888 మంది వివరాలు వెల్లడించలేదు.