బీసీ కులస్తులే అత్యధికం
ABN , Publish Date - Apr 17 , 2026 | 03:16 AM
తెలంగాణలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల సర్వే -2024 గణన చేపట్టింది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
తెలంగాణలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల సర్వే -2024 గణన చేపట్టింది. ఈ గణనపై పెద్దపల్లి జిల్లా ప్రజల్లో ఆసక్తి రేపింది. బుధవారం రాత్రి నాలుగు విభాగాలుగా కుటుంబ సర్వే వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. పెద్దపల్లి జిల్లాలో కులాల వారిగా జనాభా, చదువులు, భూములు, ఇండ్లు, పెండ్లి కాని వారి సంఖ్యలు, కులాంతర వివాహాలు, ఆర్థిక అసమానతలు వంటి వివరాలతో నివేదికలను సమగ్రంగా ప్రజల ముందుకు వచ్చాయి. ప్రధానంగా ఒక కులాల వారిగా వెల్లడించిన లెక్కలు జిల్లాలోని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో 7,28,802 జనాభాలోని ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఓసీల కుటుంబాలు, జనాభా లెక్కలను వెల్లడించారు. జిల్లాలో బీసీలు 4,97,186 మంది అత్యధికంగా ఉన్నారు. ఓసీలు 58,712 మంది, ఎస్‌సీలు 1,56,020 మంది, ఎస్టీలు 16,884 మంది ఉన్నారు.
2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉపాధి అవకాశాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆ మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పది మాసాల తర్వాత రాష్ట్రంలో సమగ్ర ఆర్థిక, విద్య, ఉపాధి, కుల గణన సర్వే చేపట్టింది. ఈ సర్వే ఫలితాలను ప్రభుత్వం గత ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించింది. అంతేకాకుండా స్థానిక సంస్థల్లో, విద్య, ఉపాధి అవకాశాలు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్ర గవర్నర్‌కు పంపించారు. గవర్నర్ దానిని రాష్ట్రపతికి పంపించారు. కానీ బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆమోదం లభించక పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్‌లో గ్రామపంచాయతీ ఎన్నికలను, ఫిబ్రవరి నెలలో మున్సిపాలిటీ ఎన్నికలను నిర్వహించింది. పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో 42శాతానికి పైగా బీసీలకు టికెట్లు ఇచ్చారు. అయితే అసెంబ్లీలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి కులాల సంఖ్యను ప్రకటించినప్పటికీ జిల్లాల వారీగా కులాల వారీగా లెక్కలను బయట పెట్టలేదు.
ఈనెల 15వ తేదీన ప్రభుత్వం ఆ లెక్కలను ప్రకటించింది. జిల్లాలో చేపట్టిన సమగ్ర ఆర్థిక, విద్య, ఉపాధి, కుల గణన సర్వే ప్రకారం
ఓసీలు జిల్లాలో 58,712 మంది ఉన్నారు. ఇందులో రెడ్డి సామాజిక వర్గీయులు 26,650 మంది, వెలమలు 7676 మంది, వైశ్యులు 9548 మంది, బ్రాహ్మణులు 3093 మంది, ముస్లింలు, ఇతరులు ఉన్నారు.
బీసీలు 4,97,186 మంది ఉండగా, ఇందులో అత్యధికంగా ముదిరాజ్ కులస్తులు 70,094 మంది, ఆ తర్వాత యాదవులు 68,271 మంది, మున్నూరు కాపులు 63,924మంది, పద్మ శాలి కులస్తులు 49,901, గౌడ కులస్తులు 49,718 మంది, రజకులు 26,010 మంది, గంగ పుత్రులు 12,624 మంది, నాయి బ్రాహ్మణ కులస్తులు 7963 మంది ఉన్నారు. విశ్వ బ్రాహ్మణుల్లో గోల్డ్ స్మిత్ 8226 మంది, కమ్మర 3955 మంది, కంసాలి 132 మంది, వడ్రంగులు 9233 మంది, శిల్పులు 93 మంది ఉన్నారు. కుమ్మర కులస్తులు 10,512 మంది, పెరిక కులస్తులు 14512మంది ఉన్నారు. మేర కులస్తులు 3857మంది, కుర్మ 19364 మంది, దూదేకుల 8754 మంది ఉన్నారు. బీసీల్లో షేక్‌లు 26291 మంది, దోభీ ముస్లిము లు 869 మంది ఉన్నారు.
ఎస్‌సీ కేటగిరీలో మొత్తం మంది 1,56,20 మంది ఉండగా, మాదిగలు 95,220 మంది, మాలలు 38,814 మంది, నేతకాని కులస్తులు 8336 మంది ఉన్నారు. ఎస్‌టీల్లో మొత్తం 16,884 మంది ఉండగా, లంబాడాలు 8173 మంది, ఎరుకలు 3632మంది, చెంచులు 465 మంది, కోయ కులస్థులు 455మంది, ఇతరులు ఉన్నారు.