Share News

ఇన్‌సర్వీస్‌ టీచర్లకు టెట్‌ టెన్షన్‌

ABN , Publish Date - Nov 05 , 2026 | 01:43 AM

ఏళ్లుగా పాఠాలు బోధిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్‌ (టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) టెన్షన్‌ పట్టుకుంది.

 ఇన్‌సర్వీస్‌ టీచర్లకు టెట్‌ టెన్షన్‌

జగిత్యాల, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఏళ్లుగా పాఠాలు బోధిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్‌ (టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) టెన్షన్‌ పట్టుకుంది. ఇన్‌ సర్వీస్‌ టీచర్లు టెట్‌ రాయడంలో పడుతున్న ఇబ్బందులు గుర్తించిన పాఠశాల విద్యాశాఖ అధికారులు కంప్యూటర్‌బెస్ట్‌ టెస్ట్‌ (సీబీటీ ) విధానంపై అవగాహన కల్పించేందుకు జిల్లాలో మాక్‌ టెస్ట్‌లు నిర్వహించాలని నిర్ణయించారు. ఈమేరకు పరీక్ష కేంద్రాలు కేటాయించారు. గత నెల 8వ, 9వ తేదీల్లో నిర్వహించిన ఇన్‌ సర్వీస్‌ టెట్‌కు 52a2 మంది టీచర్లు హాజరయ్యారు.

ఫహాజరుకానున్న 231 మంది

ఈనెల 16నుంచి 21వ తేదీ వరకు స్పెషల్‌ టీజీ టెట్‌ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. టెట్‌కు పేపర్‌-1, పేపర్‌-2కు 231 దరఖాస్తులు రాగా వారంతా మాక్‌ టెస్ట్‌ రాసేందుకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. సర్వీసులో ఉన్న టీచర్లలో చాలా మందికి ఆన్‌లైన్‌లో పరీక్షలు కొత్త కావడంతో మౌస్‌ ఆపరేషన్‌, టైమర్‌ను గమనించడం, స్ర్కీన్‌పై ప్రశ్నలను మార్చడం వంటి అంశాల్లో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో టెట్‌ను గతంలో మాదిరిగా ఆఫ్‌లైన్‌ లేదా ఓఎంఆర్‌ విధానంలో నిర్వహించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు విన్నవించాయి. టెట్‌ను సీబీటీ విధానంలోనే నిర్వహిస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది. దీంతో మాక్‌ టెస్ట్‌ల ద్వారా టీచర్లను పరీక్షకు సన్నద్ధం చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది.

ఫ10వ తేదీ వరకు మాక్‌ టెస్టులు..

మాక్‌ టెస్టులను ఈనెల 5నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అధికారిక నిర్ణీత వెబ్‌సైట్‌లో లింక్‌ ఉంచనున్నారు స్పెషల్‌ టెట్‌కు దరఖాస్తు చేసుకున్న టీచర్లు వెబ్‌సైట్‌ ద్వారా లేదా జిల్లాలో ఏర్పాటు చేసే ప్రత్యేక కేంద్రాల్లో మాక్‌ టెస్టులు రాసే అవకాశం ఉంటుంది. మాక్‌ టెస్ట్‌ల కోసం జిల్లాలోని నాలుగు స్కూళ్లను ఎంపిక చేసి ఒక్కో కేంద్రంలో కనీసం 20 కంప్యూటర్లతో ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని కోరుట్ల గౌతమ్‌ మోడల్‌ స్కూల్‌, జగిత్యాలలోని మానస హైస్కూల్‌, ఈశా హైస్కూల్‌, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మాక్‌టెస్టు కేంద్రాలను ఏర్పరిచారు.

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

-రాము, జిల్లా విద్యాశాఖ అధికారి

జిల్లాలోని ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులందరూ మాక్‌ టెస్ట్‌ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పరీక్షకు సమర్థవంతంగా సిద్ధం కావాలి. ఉపాధ్యాయులకు ఇబ్బందులు లేకుండా జిల్లాలోని ఎంపిక చేసిన పరీక్ష ఆ కేంద్రాల్లో సరిపడా కంప్యూటర్లను అందుబాటులో ఉంచాం.

జిల్లాలో ఉపాధ్యాయుల వివరాలు..

--------------------------------------------------

పీజీహెచ్‌ఎం (గ్రేడ్‌-2) - 165

స్కూల్‌ అసిస్టెంట్లు - 1,794

లాంగ్వేజి పండిత్‌లు - 30

ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలు - 156

ఎస్‌జీటీలు - 1,171

ఎస్‌జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) - 8

--------------------------------------------------

మొత్తం - 3,324

--------------------------------------------------

Updated Date - Nov 05 , 2026 | 01:43 AM