నారాయణపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు
ABN , Publish Date - Jul 26 , 2026 | 12:19 AM
మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్ ప్రాంతంలో శనివారం ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రామంలో చెరువు కట్టను ఆనుకుని ముంపుకు గురవుతున్న 30 ఇళ్ల కొలతలు తీసుకోవాలని జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు.
గంగాధర, జూలై 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్ ప్రాంతంలో శనివారం ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రామంలో చెరువు కట్టను ఆనుకుని ముంపుకు గురవుతున్న 30 ఇళ్ల కొలతలు తీసుకోవాలని జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఊరు మొత్తం ముంపుకింద పడుతుంటే కొన్ని ఇళ్లకు మాత్రమే కొలతలు తీసుకోవడంలో ఆంతర్యమేంటని అధికారులను ప్రశ్నించారు. కట్టను ఆనుకుని ఉన్న గృహాలవారు మిగతా గ్రామస్తులు అధికారులను కొలతలు తీయకుండా, తమకు పరిహారం రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కొలతలు చేస్తున్న కుటుంబాలకు, సర్వే చేయని కుటుంబాల మద్ద వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య మాటామాట పెరిగి దాడులు చేసుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఎస్సై వంశీకృష్ణ జోక్యం చేసుకుని గ్రామస్తులందరిని శాంతింపజేశారు. దీంతో సర్వేకు వచ్చిన అధికారులు గ్రామస్తుల గొడవను చూసి వెనుదిరిగారు.
ఫ వేర్వేరుగా వినతిపత్రాలు
గ్రామస్తులు రెండుగా విడిపోయి తమకు న్యాయం చేయాలని పోలీసులకు, తహసీల్దార్ అంబటి రజితకు వేర్వేరుగా వినతి పత్రాలు అందించారు. గ్రామస్తులందరూ శాంతంగా ఉండాలని, ఇరువర్గాల సమస్యలను నీటిపారుదల శాఖ అధికారులకు వివరిస్తానని, అప్పటి వరకు గ్రామస్తుందరు ఓపికతో ఉండాలని తెలిపారు. అనంతరం గ్రామస్తులందరూ గంగాధర ప్రధాన రహదారిపై ధర్నా చేయడానికి వెళ్లారు. విషయాన్ని తెలుసుకున్న ఎస్సై వంశీకృష్ణ రఽగామస్తులతో మాట్లాడి ధర్నాను ఉపసంహరింపజేశారు.