ఆనలైనకు తాత్కాలిక బ్రేక్
ABN , Publish Date - May 01 , 2026 | 12:56 AM
ధాన్యం కొనుగోళ్లలో ఎదురవుతున్న అవస్థలకు చెక్ పెట్టడానికి తాజాగా పౌరసరఫరా శాఖ చర్యలు తీసుకుంది.
జగిత్యాల, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లలో ఎదురవుతున్న అవస్థలకు చెక్ పెట్టడానికి తాజాగా పౌరసరఫరా శాఖ చర్యలు తీసుకుంది. యాసంగి 2025-26 సీజనకు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ఓపీఎంఎస్ (ఆనలైన ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) సాఫ్ట్‌వేర్‌లో ప్రభుత్వం పలు కీలక మార్పులు చేసింది. కొనుగోలు కేంద్రాలకు సమీపంలో ఉన్న రైస్‌మిల్లులకు ధాన్యం తరలించేలా చర్యలు చేపట్టడానికి యోచించింది. ప్రతి రైస్‌మిల్లు సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకొని, వాటి సామర్థ్యానికి అనుగుణంగా ధాన్యం కేటాయించేలా సాఫ్ట్‌వేర్‌ను ఆధునికీకరించారు. దీంతో రవాణా సమయం, నిల్వ సమస్యలు, కొనుగోలు ప్రక్రియ వేగవంతం అవుతుందని భావించారు. ఎప్పటికప్పుడు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి మిల్ అలాట్‌మెంట్, మిల్ అక్‌నాలెడ్జ్‌మెంట్‌లో మార్పులు చేసేందుకు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారికి (డీఎస్‌ఎస్‌వో) ప్రత్యేక లాగిన ఆప్షన ఇచ్చారు. అయితే ఓపీఎంఎస్ సాప్ట్‌వేర్ అమలు ద్వారా పలు ఇబ్బందులు ఎదురుకావడంతో పౌరసరఫరాల శాఖ ఆనలైన విధానానికి తాత్కాలికంగా స్వస్తి పలికింది. ఈ మేరకు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. దీంతో జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో ఆనలైన విధానాన్ని తాత్కాలికంగా ఎత్తివేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు.
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం..
జిల్లాలో ఆనలైన విధానంలో ధాన్యం కొనుగోలులో బాలారిష్టాలు ఎదురయ్యాయి. దీనివల్ల ధాన్యం కొనుగోళ్లలో జాప్యాం ఏర్పడింది. ఇబ్బందులను గుర్తించిన కేంద్రాల నిర్వాహకులు, రైస్ మిల్లర్లు అధికారులకు ఎప్పటికప్పుడు పరిస్థితిని వివరించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో ఆనలైన విధానం ద్వారా ఎదురవుతున్న ఇక్కట్లను రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెవెళ్లడంతో తాత్కాలికంగా ఆనలైన విధానం అమలును బ్రేక్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఓపీఎంఎస్ ధాన్యం కొనుగోలు విధానం వల్ల రైతు వివరాలను సిస్టమ్‌లో నమోదు చేసి ఆధార్ కార్డు ద్వారా వారి గుర్తింపును ధ్రువీకరించాల్సి ఉంటుంది. రైతు భూమి విస్తీర్ణం, పండించిన ధాన్యం వివరాలను ఓపీఎంఎస్‌లో సరిచూడాల్సి ఉంటుంది. ధాన్యం పొడిగా, శుభ్రంగా ఉండి ప్రభుత్వ ఎఫ్‌ఏక్యూ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉందో..లేదో పరిశీలించి, నాణ్యత ఉంటేనే రైతులకు గన్నీ సంచులు అందించాల్సి ఉంటుంది. సంచుల్లో ధాన్యం నింపి కేంద్రం వద్ద తప్పనిసరిగా తూకం వేయాల్సి ఉంటుంది. రైతు ఆధార్ అథెంటిఫికేషన (వేలిముద్ర లేదా ఓటీపీ) ద్వారా ధాన్యం విక్రయాన్ని ధ్రువీకరించాల్సి ఉంటుంది. తూకం వేసిన ధాన్యాన్ని జీపీఎస్ కలిగిన ట్రక్కులో లోడ్ చేసి, ఓపీఎంఎస్ ద్వారా ట్రక్ షీట్ జనరేట్ చేయాలి. మిల్లు కేటాయింపు పూర్తిగా ఆటోమెటిక్‌గా చేపడుతోంది. మిల్లర్ ధాన్యాన్ని స్వీకరించి ఓపీఎంఎస్‌లో అక్‌నాలెడ్జ్‌మెంట్ చేయాల్సి ఉంటుంది. మిల్లర్ నిర్ధారణ అనంతరం ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తోంది. అయితే అడుగడుగునా ఆనలైన విధానంలో పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. సర్వర్ స్లోగా ఉండడం, ఓపీఎంఎస్ సాఫ్ట్‌వేర్‌పై అవగాహన లేకపోవడం, ఆనలైనలో అప్‌లోడ్ చేయడానికి సమయం తీసుకుంటుండడం వల్ల ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చోటుచేసుకుంటోంది.
5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం...
ఈ సీజన్‌లో జిల్లాలో 435 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సుమారు ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాలని అధికారులు అంచనాలు తయారు చేశారు. ఇందులో ఇప్పటివరకు సుమారు 380 కొనుగోలు కేంద్రాలు తెరిచారు. సుమారు నాలుగువేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. ఆనలైన విధానం వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల వల్ల కొనుగోళ్ల ప్రక్రియ మందకొడిగా జరుగుతుందని గుర్తించారు.
పాత విధానంలోనే కొనుగోళ్లు...
జిల్లాలో పాత విధానంలోనే ధాన్యం కొనుగోళ్లు జరపడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను ఆప్ పద్ధతిలో జరుపుతున్నారు. ఆనలైన విధానానికి తాత్కాలికంగా బ్రేక్ వేశారు. ధాన్యం కొనుగోళ్లు త్వరగా జరపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి, సాధ్యమైనంత తొందరగా రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఆనలైన విధానానికి తాత్కాలికంగా స్వస్తి పలకడంతో కొత్తవిధానం వల్ల ఎదురైన ఇబ్బందులు తప్పినట్లయిందని కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు, రైతులు అంటున్నారు.