కాంగ్రెస్ హయాంలో ఆలయాలకు పూర్వ వైభవం
ABN , Publish Date - May 10 , 2026 | 12:07 AM
కాంగ్రెస్ ప్రభుత్వం పురాతన ఆలయాలకు అధిక నిధులు కేటాయించి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి, మే 9 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం పురాతన ఆలయాలకు అధిక నిధులు కేటాయించి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. విద్య, ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని దుమాల, బావుసింగ్‌నాయక్ తండా, భూక్యతండా గ్రామాల్లో శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వరస్వామి, శ్రీ జగదాంబమాతా, సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ ఆలయ, విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. దుమాలలో శ్రీ క్షేత్రం పీఠాధీశులు మధుసూదన సరస్వతినంద స్వాముల ఆధ్వర్యంలోని వేద పండితులు శనివారం ఉదయం యంత్ర, మూర్తి, ప్రాణ ప్రతిష్ట, పూర్ణాహుతి, 108 కలశములతో కుంభాభిషేకం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. వేద మంత్రోచ్ఛరణల నడుమ స్వామి వారి కల్యాణాన్ని జరిపించారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజక వర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ హిందూ సంప్రదాయాలను కాపాడుకోవాలని అన్నారు. గ్రామస్థులంతా ఐక్యతతో ముందుకు సాగి రూ.50 లక్షల రాష్ట్ర దేవాదాయ శాఖ నిధులు, మరో రూ.50 లక్షలు పోగు చేసి ఆలయాన్ని నిర్మించడం అభినందనీయమని అన్నారు. గతంలో అనేక ఆలయాల్లో దీపం వెలిగించకుండా ఉండేవని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ధూపదీప నైవేద్యం కింద నిధులు మంజూరు చేసి దేవాలయాలకు మహర్ధశ కల్పించారని గుర్తుచేశారు. బావుసింగ్‌నాయక్‌తండా, భూక్య తండాలో పౌరదేవీ పీఠాధిపతి బాబుసింగ్‌మహరాజ్ ఆధ్వర్యంలో ఉదయం ద్వారాతోరణారాధన, అగ్ని ప్రతిష్ట, హోమం, నిత్య పూర్ణాహుతి, తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. సాయంత్రం బంజార సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్‌రెడ్డి, స్థానిక నాయకులు ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు.