సమస్యలు చెప్పండి...పరిష్కరిస్తాం
ABN , Publish Date - Jul 16 , 2026 | 12:29 AM
గోదావరిఖని ఆర్‌ఆర్‌ఎఫ్‌సీఎల్ రోడ్‌లోని శాంతినగర్ తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (రామగుండం బాయ్స్-1)ను రామగుండం ఎమ్మెల్యే మక్కానసింగ్ రాజ్‌ఠాకూర్ బుధవారం సందర్శించారు.
ఎమ్మెల్యే మక్కానసింగ్ రాజ్‌ఠాకూర్
కోల్‌సిటీ టౌన, జూలై 15 (ఆంధ్రజ్యోతి): గోదావరిఖని ఆర్‌ఆర్‌ఎఫ్‌సీఎల్ రోడ్‌లోని శాంతినగర్ తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (రామగుండం బాయ్స్-1)ను రామగుండం ఎమ్మెల్యే మక్కానసింగ్ రాజ్‌ఠాకూర్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేసి, అనంతరం వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం అనంతరం విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడిన ఆయన, భోజనం నాణ్యత, వసతి, విద్యా సౌకర్యాలపై ఆరా తీశారు. ’మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్భయంగా తెలియజేయండి. వాటి పరిష్కారానికి కృషి చేస్తాం’ అని విద్యార్థులకు హామీ ఇచ్చారు. అనంతరం కళాశాలలోని తరగతి గదులు, వసతి గృహాలు, భోజనశాల, ఇతర మౌలిక వసతులను ఎమ్మెల్యే పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి, నాణ్యమైన విద్య అందించేందుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.
కార్పొరేషనలో అభివృద్ధి పనులను వేగవంతం చేయండి
- కలెక్టర్‌ను కోరిన ఎమ్మెల్యే
కోల్‌సిటీ: రామగుండం కార్పొరేషన పరిధిలో పెండింగ్‌లో ఉన్న రహదారులు, ఇతర పనులను వేగవంతం చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కానసింగ్ రాజ్‌ఠాకూర్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను కోరారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ రోడ్లు, కార్పొరేషనలో అభివృద్ధి పనులను, మౌలిక వసతుల కల్పనపై ఇరువురు చర్చించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మక్కానసింగ్ కలెక్టర్‌ను కోరారు.
రామగుండంలో బీఆర్‌ఎస్‌కు షాక్
- ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ఇద్దరు కార్పొరేటర్లు
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో బీఆర్‌ఎస్‌కు షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు బుధవారం రాజీనామా చేశారు. రామగుండం పట్టణానికి చెందిన 26వ డివిజన కార్పొరేటర్ బదావత నర్సమ్మసారయ్యనాయక్, 28వ డివిజన కార్పొరేటర్ దారంగుల కుమార్ గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారితో పాటు మరికొందరు నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. రామగుండం నగరపాలక సంస్థలో 13మంది కార్పొరేటర్లు బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. వారిలో అడ్డాల గట్టయ్య, కంజంపురం జయప్రద మేయర్ ఎన్నిక సమయంలోనే కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు మరో ఇద్ద రు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు బీఆర్‌ఎస్ బలం తొమ్మిదికి చేరింది. మరో ఐదుగురు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌లో మూడు గ్రూపులు ఉండడం, కార్పొరేట ర్లను సమన్వయపరిచే వ్యవస్థ లేకపోవడంతో వారు కాంగ్రెస్‌లో చేరేం దుకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తున్నది. రామగుండం నగరపాలక సంస్థలో 60మంది కార్పొరేటర్లకు గాను ఒకరు సీపీఐ, ఒకరు బీజేపీ నుంచి గెలుపొందారు. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలుపొందిన కార్పొరేటర్లు ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు బీఆర్‌ఎస్ నుంచి మరో ఇద్దరు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరడంతో కౌన్సిల్ లో కాంగ్రెస్ బలం 49కి చేరుకుంది. రామగుండం పట్టణానికి చెందిన కార్పొరేటర్లు దారంగుల కుమార్, నర్సమ్మసారయ్య నాయక్‌లు బీఆర్ ఎస్‌ను వీడడంతో పాటు వారితో పాటు మరికొందరు సీనియర్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. శివరాత్రి గంగాధర్‌తో పాటు మరికొందరు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యే రాజ్‌ఠా కూర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్, సీనియర్ నాయకులు దీటి బాలరాజు, మహ్మద్, కుందనపల్లి సర్పంచ అర్కుటి కొమురయ్య ఉన్నారు.