అభివృద్ధి పథంలో తెలంగాణ ముందంజ
ABN , Publish Date - Sep 18 , 2026 | 01:21 AM
అభివృద్ధి పథంలో తెలంగాణ ముందంజలో ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
అభివృద్ధి పథంలో తెలంగాణ ముందంజలో ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ప్రజా పాలన వేడుకల్లో కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ చేపట్టి ప్రజలను భాగస్వామ్యులను చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై క్షేత్ర స్థాయిలో విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా జిల్లాలో మార్చి 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతంగా అమలు చేసిందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ ఏడాది ఇప్పటివరకు 1948 ప్రసవాలు జరిగాయని, ఆరోగ్యశ్రీ కింద 4692 మందికి రూ 14 కోట్ల విలువైన ఆపరేషన్లు, ఇతర వైద్య సేవలు అందించామన్నారు. జిల్లాలో 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు రూ 113.85 కోట్ల విలువైన4.57 కోట్ల జీరో టికెట్లపై మహిళలు ప్రయాణం చేశారని తెలిపారు. గృహజ్యోతి పథకం ద్వారా మార్చి 2024 నుంచి 28 లక్షల 79 వేల జీరో కరెంట్ బిల్లులు జారీ చేసి, రూ.113 కోట్ల లబ్ది చేకూర్చామని తెలిపారు. ఈ ఏడాది 1838 కొత్త వ్యవసాయ విద్యుత్ సర్వీసులు అందించామని, 4448 పవర్ లూమ్ లబ్దిదారులు సబ్సిడీ ప్రయోజనం పొందుతున్నట్లు తెలిపారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని శ్రీనివాస్ అన్నారు. వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీకి ఇప్పటిదాకా రూ 390 కోట్ల మంజూరయ్యాయని, మూలవాగుపై ఉన్న బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వరకు రూ 47.86 కోట్లతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు తుది దశకు చేరుకున్నట్లు తెలిపారు. నాంపెల్లి గుట్టపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సహకారంతో ఎయిర్‌క్రాఫ్ట్ ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయని, రాజన్న ఆలయ గోశాల నిర్మాణానికి వేములవాడ రూరల్ మండలం మర్రిపెల్లిలో 40 ఎకరాల భూమి కేటాయించామన్నారు. భీమేశ్వర స్వామి ఆలయం రూ 6 కోట్లతో భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి పనులు చేసినట్టు తెలిపారు. మహిళల అభ్యున్నతే ధ్యేయంగా ఇందిరా మహిళా శక్తిలో భాగంగా జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 1563 సంఘాలకు రూ 187 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని వస్త్ర పరిశ్రమ కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులకు ప్రజా ప్రభుత్వం చేతి నిండా పని కల్పించడంతో పాటు భరోసా కల్పించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని మహిళలకు కానుకగా పంపిణీ చేసేందుకు 2025 సంవత్సరంలో సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు రూ 6.86 కోట్ల మీటర్ల ఇందిరా మహిళా శక్తి చీరల వస్త్రోత్పత్తి ఆర్డర్లు కేటాయించడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం ఇందిరా మహిళా శక్తి చీరల వస్త్రోత్పత్తి ఆర్డర్ మొదటి విడతగా 4.70 కోట్ల మీటర్ల ఆర్డర్ సిరిసిల్లలోని 133 మ్యాక్స్ సంఘాలకు కేటాయించడం జరిగిందని, దీని ద్వారా 6 వేల మంది కార్మికులకు ఉపాధి కలుగుతుందన్నారు. స్కూల్ యూనిఫాం కోసం 30.31 లక్షల మీటర్ల వస్త్రాన్ని మ్యాక్స్ సంఘాల ద్వారా కొనుగోలు చేశామన్నారు. నేతన్నకు పొదుపు పథకం కింద జిల్లాలోని 4963 మంది మరమగ్గాల కార్మికులకు రూ 12.40 కోట్లను ప్రభుత్వ వాటా కింద విడుదల చేశామని, జిల్లాలోని 5534 మరమగ్గాల, అనుబంధ రంగాల కార్మికులకు ప్రతి నెలా వాటా జమచేయడం జరుగుతుందన్నారు. అకాల మరణం చెందిన మరమగ్గాల, చేనేత రంగాలకు సంబంధించిన 132 మంది కార్మిక కుటుంబాలకు రూ 5 లక్షల చొప్పున రూ 6.60 కోట్లు అందించామని తెలిపారు. జిల్లాలో కొత్తగా 24 వేల 643 రేషన్ కార్డులు పంపిణీ చేయడంతోపాటు, లక్ష 95 వేల 915 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశామన్నారు. రైతు భరోసా కింద ఈ వానాకాలం సీజన్‌లో 1.27 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.149.32 కోట్లు జమ చేశామని, 46 వేల 492 మంది రైతులకు రూ 2 లక్షల చొప్పున రూ 370.75 కోట్ల రుణ మాఫీ చేశామన్నారు. జిల్లాలో 7088 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 3797 ఇళ్లల పూర్తయినట్లు తెలిపారు. వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండలం మూడపల్లిలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి భూమిపూజ చేశామని, పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.