Share News

కల్లాల్లో కన్నీళ్లు..

ABN , Publish Date - May 28 , 2026 | 01:09 AM

భగభగమండిన ఎండలు ఒక్కసారిగా తగ్గుముఖం పడుతూ వర్షాకాలం సమీపిస్తున్న సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో ధాన్యాన్ని చూస్తూ రైతులు ఆందోళన చెందుతున్నారు.

కల్లాల్లో కన్నీళ్లు..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

భగభగమండిన ఎండలు ఒక్కసారిగా తగ్గుముఖం పడుతూ వర్షాకాలం సమీపిస్తున్న సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో ధాన్యాన్ని చూస్తూ రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా ముందుకు సాగకపోవడంతో రైతులు కొనుగోళ్లు తొందరగా చేపట్టాలంటూ నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు వర్షాకాలం ముంచుకొస్తున్న భయానికి తోడు అకాల వర్షాలు నష్టాన్ని చూపుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసిపోయింది. సిరిసిల్ల, వేములవాడ, వేములవాడ రూరల్‌, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్‌, తంగళ్లపల్లి, వీర్నపల్లి, బోయిన్‌పల్లి, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండలాల్లోని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ధాన్యం ఎప్పుడు తూకం వేస్తారా అని ఎదురుచూస్తుండగా గాలి బీభత్సం, అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయింది, ఆరబోసుకున్న ధాన్యం తూకానికి రెడీగా ఉన్నా రవాణా వేగవంతంగా లేకపోవడంతో తుకం వేయడం లేదు. దీంతో అకాల వర్షానికి ధాన్యం తడిసి మళ్లీ ఆరబోసుకునే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కల్లాల వద్ద పేరుకుపోయిన ధాన్యం కాపాడుకోవడానికి వారం నుంచి నెల రోజులుగా రైతులకు కల్లాలే ఇల్లుగా మారింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు అండమాన్‌ దీవులకు చేరి మరో మూడు నాలుగు రోజుల్లో కేరళ తీరాన్ని దాటనున్నాయని వాతావరణ శాఖ ప్రకటిస్తోంది. దీంతో జిల్లాలో నైరుతి ఆగమనంతో వర్షాలు కురిసే పరిస్థితులు ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీల కొరత రవాణా సమస్య ప్రధానంగా నెలకొంది. ధాన్యం సేకరణ వేగవంతానికి అధికార యంత్రాంగం ధాన్యం నిలవలకు ఇంటర్మీడియట్‌ గోదాముల సమీకరణ, మిల్లుల వద్ద వేగంగా ధాన్యం దించుకునే దిశగా ప్రత్యేక అధికారులను కూడా నియమించారు. ఈసారి అనుకున్నంత మేరకు దాన్యం కొనుగోలు వేగవంతం కావడం లేదని రైతుల ఆరోపిస్తున్నారు. కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ప్రతిరోజు టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తున్న రైతుల్లో భరోసా కలగడం లేదు.

కేంద్రాల్లో ‘లక్ష’ మెట్రిక్‌ టన్నుల ధాన్యం

జిల్లా ధాన్యం కొనుగోలు లారీల కొరత, హమాలీల కొరత ఎదురవుతుండడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని రైతులు మండిపడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పౌరసరఫరాల లక్ష్యం ప్రకారం 3 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించాల్సి ఉంది. ఇప్పటివరకు 2.13 లక్షల మెట్రిక్‌లో ధాన్యం సేకరించారు. కొనుగోలు కేంద్రాల వద్ద పౌరసరఫరాల శాఖ లక్ష్యంకంటే మించి ధాన్యం రాశులు కనిపిస్తున్నాయి. దాదాపు లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యం కేంద్రాల వద్ద ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం 236 కేంద్రాలు ప్రారంభించారు. ఇందులో ఐకేపీ ద్వారా 132 కేంద్రాలు, వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా 96 కేంద్రాలు, మెప్మా ద్వారా 7 కేంద్రాలు, డీసీఎంఎస్‌ ద్వారా ఒక కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులో తొమ్మిది కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి చేశారు. జిల్లాలో యాసంగిలో 1.83 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో 1,79,650 దొడ్డు రకం, 7,539 ఎకరాల్లో సన్న రకం వరి సాగు చేశారు. దీని ద్వారా 4 లక్షల 56 వేల 664 మెట్రిక్‌లో ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో దొడ్డు రకం 4 లక్షల 49 వేల 125 మెట్రిక్‌ టన్నులు, సన్న రకం 7,539 మెట్రిక్‌ టన్నులు వస్తుందని. ఇందులో పౌరసరఫరాల శాఖ 3 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసే విధంగా లక్ష్యంగా పెట్టుకొంది. ఇందులో 2.97 లక్షల మెట్రిక్‌ టన్నుల దొడ్డు రకం ధాన్యం, 7,539 మెట్రిక్‌ టన్నులు సన్న రకం ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ఉంది. పౌరసరఫరాల శాఖ ఇప్పటివరకు 2,23,709 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసింది. ఇందులో ఐకేపీ ద్వారా 1,20,361 మెట్రిక్‌ టన్నులు, వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా 94,744 మెట్రిక్‌ టన్నులు, మెప్మా ద్వారా 6,511 మెట్రిక్‌ టన్నులు, డీసీఎంఎస్‌ ద్వారా 2,092 మెట్రిక్‌ టన్నులు కొనుగొలు చేశారు. అందులో మిల్లులకు 2,13,160 మెట్రిక్‌ టన్నులు పంపించింది.

రైతుల ఖాతాల్లో రూ.383.31 కోట్లు జమ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగిలో ఇప్పటివరకు రూ 534కోట్ల విలువైన 2,23,709 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 27,887 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఇందులో ఇప్పటివరకు 23,011 మంది రైతులకు రూ 383.31 కోట్లు చెల్లించారు. ఐకేపీ ద్వారా కొనుగోలు చేసిన 12,845 మంది రైతులకు రూ 202.73 కోట్లు చెల్లించగా, సింగిల్‌ విండోల ద్వారా 9,399 మంది రైతులకు రూ 167.01 కోట్లు, డీసీఎంఎస్‌ ద్వారా 138 మంది రైతులకు రూ.2.97 కోట్లు, మెప్మా ద్వారా ధాన్యం కొనుగోలు చేసిన 629 మంది రైతులకు రూ.10.61 కోట్లు ధాన్యం డబ్బులను చెల్లించారు.

Updated Date - May 28 , 2026 | 01:09 AM