చదువుకు టాటా..
ABN , Publish Date - Apr 24 , 2026 | 01:10 AM
రాష్ట్ర ప్రభుత్వం 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించింది.
కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 23: రాష్ట్ర ప్రభుత్వం 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించింది. గురువారం 2022-23 విద్యాసంవత్సరం చివరి రోజున ఒకటి నుంచి తొమ్మిదో తరగతిలోపు విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు, మెరిట్ విద్యార్థులకు తల్లిదండ్రులు సమావేశంలో బహుమతులను అందజేస్తారు. దీంతో శుక్రవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మూతపడనున్నాయి. క్లాసులు, ట్యూషన్లు, ఇతర పరీక్షలతో ఏడాది నుంచి కుస్తీ పట్టిన విద్యార్థులు 48 రోజులపాటు వేసవి సెలవులతో హాయిగా ఊపిరిపీల్చుకోవచ్చు. వేసవి సెలవుల్లో పుస్తకాలను పక్కనపడేసి తోటి బాలబాలురతో కలిసి ఎంచక్కా ఆడుకోవచ్చు. ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలు వేసవి సెలవుల్లో ఇంట్లోనే ఉంటూ ఆటపాటలతో కాలక్షేపం చేయాలని, స్విమ్మింగ్ కోసం బావులు, చెరువుల్లోకి వెళ్ళి ప్రమాదాలు తెచ్చుకోవద్దని పలువురు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా గమనిస్తూ వడదెబ్బబారిన పడకుండా, ప్రమాదాలకు గురికాకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
ఫ జూన్ 2న యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు చేరేనా...
జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అదే రోజు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలను అందజేయడం ఆనవాయితీ. బడిబాట, బడీడు పిల్లలను బడిలో చేర్పించే కార్యక్రమాలను చేపడుతున్నప్పటికీ విద్యార్థులకు అవసరమయ్యే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందక పోవడం, టీచర్ల కొరత కారణంగా ఆశించిన మేరకు విద్యార్థుల సంఖ్య పెరుగడం లేదు. ఈసారైనా సమయానికి యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు అందేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఫ ఇప్పటికే అనధికారికంగా బడిబాట
పరీక్షలు ఈనెల 18 వరకు పూర్తికావడంతో 20, 21, 22 తేదీల్లో కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు అర్హులైన కొత్త పిల్లలను బడిలో చేర్పించడం, వారికి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించడంతో అనధికారికంగా బడిబాట కార్యక్రమాన్ని చేపట్టారు. అధికారికంగా మే, జూన్‌లో బడిబాటను నిర్వహించి బడీడు, బడిమానేసిన పిల్లలను చేర్పించే కార్యక్రమాలను చేపట్టనున్నారు.