వీబీజీ రామ్‌జీ అమలుపై ఉత్కంఠ..
ABN , Publish Date - Jul 01 , 2026 | 12:54 AM
రెండు దశాబ్దాలుగా అమలవుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం (ఎంఎన్‌ఆర్ ఈజీఎస్) స్థానంలో ‘వీబీజీ రామ్ జీ’ (వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్‌గార్ అజివిక మిషన్ గ్రామీణ్) అమలుకు కేంద్ర ప్రభుత్వం జూలై ఒకటవ తేదీ నుంచి శ్రీకారం చుట్టనున్నది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
రెండు దశాబ్దాలుగా అమలవుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం (ఎంఎన్‌ఆర్ ఈజీఎస్) స్థానంలో ‘వీబీజీ రామ్ జీ’ (వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్‌గార్ అజివిక మిషన్ గ్రామీణ్) అమలుకు కేంద్ర ప్రభుత్వం జూలై ఒకటవ తేదీ నుంచి శ్రీకారం చుట్టనున్నది. పని దినాల పెంపు, మెటీరియల్ కాంపో నెంట్‌కు పెద్దపీట, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం వంటి కీలక మార్పులతో కొత్త చట్టం అమ ల్లోకి వస్తుండగా రాష్ట్రాలపై 40 శాతం ఆర్థిక భారం మోపడం వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో రాష్ట్రంలో అమలుపై ఉత్కంఠ నెలకొన్నది. కొత్త చట్టం ప్రకారం పథకం వ్యయంలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం నిధులు భరిం చాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమలవుతున్న విధానంతో పోలిస్తే రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం పడనున్నది. ఇదే అంశంపై తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నది. నిబంధనలను సవరించాలని, రాష్ట్రాలపై ఆర్థిక భారాన్ని తగ్గించాలని కోరుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకో లేదు. తాజాగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సోమవారం ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు వినతిపత్రం అంద జేశారు. దీనిపై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించగా, జూలై 2న నిర్వహించనున్న రాష్ట్ర మంత్రివర్గ భేటీలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొననున్నది.
ఫ వంద నుంచి 125 రోజులకు పని దినాల పెంపు..
గ్రామీణ కుటుంబాలకు ఏడాదికి కల్పించే ఉపాధిని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచారు. ఉపాధి హామీతోపాటు గ్రామాల్లో శాశ్వత ఆస్తుల సృష్టికి ప్రాధా న్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. కొత్త చట్టంలో మెటీరియల్ కాంపోనెంట్‌కు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిం చారు. మొత్తం వ్యయంలో 40 శాతం వరకు మెటీరి యల్ పనులకు వెచ్చించనున్నారు. ఈ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, చెక్‌డ్యామ్‌లు, కల్వర్టులు, చెరువుల అభివృద్ధి, పంట కాలువలు, వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు, ఇతర గ్రామీణ మౌలిక సదుపాయాల పనులు చేపట్టనున్నారు. దీంతో గ్రామాల్లో శాశ్వత అభివృద్ధి పనులు మరింత వేగవంతం కానున్నాయి. మెటీరియల్ కాంపోనెంట్ నిధులను నాలుగు ప్రధాన విభాగాలకే వినియోగించనున్నారు. నీటి సంరక్షణ, జల భద్రత, గ్రామీణ మౌలిక సదుపాయాలు, జీవనోపాధి వసతులు, వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆస్తుల నిర్మాణం వంటి పనులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రతి గ్రామ పంచాయతీ తప్పనిసరిగా ‘వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్’ రూపొందించి, అదే ప్రణాళిక ప్రకారం పనులు చేపట్టాలి. చేపట్టిన ప్రతీ పనికి జియో ట్యాగింగ్, డిజిటల్ మ్యాపింగ్ తప్పనిసరి చేశారు. దీంతో పారదర్శకత పెరగడంతో పాటు పనుల పర్యవేక్షణ సులభం కానున్నది. పని కోరిన వారికి నిర్ణీత గడువులోపు ఉపాధి కల్పించకపోతే నిరుద్యోగ భృతి చెల్లించే నిబంధన కొనసాగుతుంది. అలాగే కాంట్రాక్టర్ల వ్యవస్థకు అవకాశం లేకుండా, శ్రమను భర్తీ చేసే యంత్రాల వినియోగంపై ఆంక్షలు కొనసాగించను న్నారు. జిల్లాలో 1.18 లక్షల కుటుంబాలకు జాబ్ కార్డులు జారీ చేయగా, వీటిపై 2.37 లక్షల మంది ఉపాధి కూలీలు నమోదై ఉన్నారు.
ఫ ఉపాధి చట్టంలో మార్పులతో రాష్ట్రాలపై భారం..
ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన గ్రామీణ ఉపాధిహామీ పథకం రాష్ట్రాలకు వరంగా ఉండేది. గ్రామాల్లో కూలీలకు ఉపాధి కలగడంతో పాటు వాళ్లు చేసే పనులపై జనరేట్ అయ్యే 40 శాతం మెటీరియల్ కంపోనెంట్ నిధులతో గ్రామాల్లో శాశ్వత నిర్మాణ పనులు జరిగాయి. యేటా జిల్లాలో మెటీరియల్ కంపోనెంట్ కింద 20 నుంచి 30 కోట్ల రూపాయలకు పైగా విలువైన పనులు జరిగేవి. ఈ నిధులను కూడా కేంద్ర ప్రభుత్వమే విడుదల చేసేది. రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి భారం ఉండకపోయేది. నూతన చట్టంలో తీసుకవచ్చిన మార్పు వల్ల వీబీజీ రామ్‌జీ పథకం ద్వారా ఎన్ని నిధులు ఖర్చు చేస్తారో, వాటిలో రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. ఇది రాష్ట్రాలకు శరాఘాతంగా మారనుండడంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది.
ఫ 2న తేలనున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం..
కొత్త చట్టాన్ని అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మంత్రుల సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. జూలై 2న జరిగే మంత్రివర్గ సమావేశంలో వీబీజీ రామ్ జీ అమలుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మార్పు లకు కేంద్రం అంగీకరిస్తుందా? యథావిధిగా అమలు చేస్తుందా? ఒకవేళ రాష్ట్రం అమలుకు ముందుకు రాకపోతే గ్రామీణ ఉపాధి కూలీలకు ప్రత్యామ్నాయంగా ఉపాధి ఎలా కల్పిస్తారనే అంశం చర్చనీయాంశంగా మారింది. దీంతో జిల్లాలో గల వేలాది మంది ఉపాధి కూలీలు ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.