Share News

ఉపాధిహామీ పనులపై ఉత్కంఠ

ABN , Publish Date - Jun 10 , 2026 | 12:53 AM

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా మెటీరియల్‌ కంపోనెంట్‌ కింద జనరేట్‌ అయిన నిధులకు సంబంధించి ప్రతిపాదనలు ఇవ్వక పోవడం తో ఉత్కంఠ నెలకొన్నది.

 ఉపాధిహామీ పనులపై ఉత్కంఠ

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా మెటీరియల్‌ కంపోనెంట్‌ కింద జనరేట్‌ అయిన నిధులకు సంబంధించి ప్రతిపాదనలు ఇవ్వక పోవడం తో ఉత్కంఠ నెలకొన్నది. ఈ నెలాఖరుతో ఎంజీఎన్‌ఆర్‌ ఈజీఎస్‌ ముగియనున్నది. వచ్చే నెల నుంచి వికసిత భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అజివిక మిషన్‌ (వీబీజీ- రామ్‌) పథకం ఆరంభం కానున్నది. ఈ నిధులను నెలా ఖరులోపే వాడుకోకుంటే ల్యాప్స్‌ కానున్నాయి. మెటీరి యల్‌ కంపోనెంట్‌ నిధులను వాడుకునే విషయమై పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ రెండు, మూడు రోజులకోసారి సంబంధిత జిల్లా అధికారులతో వీడియో, టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహిస్తూ ఒత్తిడి పెంచుతున్నప్పటికీ కదలిక లేదు. ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు జనరేట్‌ అయిన మెటీరియల్‌ కంపోనెంట్‌ నిధులతో జిల్లాలో అసంపూర్తిగా మిగిలిన అంగన్‌వాడీ కేంద్రాల భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు, గ్రామైక్య సంఘాల భవ నాల పనులు చేపట్టాలని ఉన్నతాధికారులు, జిల్లా అధికారులకు సూచిస్తున్నారు. ఆ పనులను చేపడితే నెలాఖరులోగా పూర్తి కావని, కొత్త పథకం ఆరంభమైతే బిల్లులు రావని క్షేత్రస్థాయిలో పనులను చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ పనులకు మంథ నికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్‌ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ ప్రతిపాధనలు ఇవ్వాల్సి ఉంది. కానీ ఉన్న ఫళంగా మెటీరియల్‌ కంపో నెంట్‌ ఫండ్‌ను ఖర్చు చేయాలంటే సిమెంట్‌ రోడ్ల నిర్మా ణాలు చేపడితేనే నెలాఖరులోపు పూర్తి కానున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఫ రెండున్న నెలల్లో రూ. 15.50 కోట్ల నిధులు..

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథ కంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసి వీబీజీ-రామ్‌ పథకంగా పేరు మార్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఎంజీఎన్‌ఆర్‌జీఎస్‌ పథకం కింద వందకు వంద శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే భరించేది. పథకం లో మార్పులు చేసిన ప్రకారం కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను భరించాల్సి ఉంటుంది. గతంలో ఒక కుటుంబానికి వంద రోజులు ఉన్న పని దినాలను 125 రోజులకు పెంచారు. దీనిని తెలంగాణ సహ ఆయా రాష్ట్రాలు వ్యతిరేకించినప్పటికీ, కేంద్రం బిల్లును ఆమోదించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచే వీబీజీ-రామ్‌ అమలు చేయాల్సి ఉన్నప్పటికీ పశ్చిమ బెంగాల్‌, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వాయిదా వేసింది. వచ్చే నెల నుంచి కొత్త పథకాన్ని అమల్లోకి తీసుక రానున్నారు. ఏప్రిల్‌ నుంచి ఈ నెలాఖరు వరకు పాత పథకమే అమలు కానున్నది. మూడు నెలలకు గాను ప్రభుత్వం జిల్లాకు 17 లక్షల పని దినాలను కేటాయించినప్పటికీ, ఇప్పటి వరకు 8.87 లక్షల పని దినాలను కూలీలు సద్వినియోగం చేసుకున్నారు. తద్వారా కూలీలకు 28 కోట్ల 20 లక్షల రూపాయలు వేతనాలు రానున్నాయి. కూలీలు చేసిన పనుల విలువపై 40 శాతం మెటీరియల్‌ కంపోనెంట్‌ కింద 15 కోట్ల 50 లక్షల రూపాయలు జనరేట్‌ అయ్యాయి. ఇందులో 2 కోట్ల రూపాయల వరకు ఆయా పనులకు ఖర్చు కాగా, మిగతా నిధులను ఈ నెలాఖరులోగా వెచ్చించాల్సి ఉంటుంది. అధికారులు అసంపూర్తిగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు, గ్రామైక్య సంఘాల భవనాలకు సద్విని యోగం చేయాలని సూచిస్తున్నప్పటికీ, ఆ పనులు చేపట్టేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. ఉపాధి నిధులు సద్వినియోగం కావాలంటే సిమెంట్‌ రోడ్లు, మురికి కాలువల పనులు చేపట్టాలనే అభిప్రాయాన్ని ప్రజాప్రతినిఽధులు వెలిబుచ్చుతున్నారు. ఈ నిధుల ఖర్చుకు ఇంకా ఇరవై రోజులు మాత్రమే మిగలి ఉండడంతో ప్రభుత్వం స్పందించి వెంటనే సిమెంట్‌ రోడ్లు చేపట్టేందుకు అనుమతించాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.

Updated Date - Jun 10 , 2026 | 12:53 AM