Share News

నామినేటెడ్‌ పదవులపై ఉత్కంఠ

ABN , Publish Date - Aug 19 , 2026 | 01:32 AM

కొత్తగా నామినేట్‌ అయిన ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లకు గుబులు పట్టుకున్నది. నామినేటెడ్‌ ప్రక్రియను సవాల్‌ చేస్తూ కొందరు కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో తీర్పు ఏ రకంగా వస్తుందో.... ఇటీవలే దక్కిన పదవి ఉంటుందో... పోతుందో అంటూ వారు దిగులు పడుతున్నారు.

నామినేటెడ్‌ పదవులపై ఉత్కంఠ

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కొత్తగా నామినేట్‌ అయిన ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లకు గుబులు పట్టుకున్నది. నామినేటెడ్‌ ప్రక్రియను సవాల్‌ చేస్తూ కొందరు కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో తీర్పు ఏ రకంగా వస్తుందో.... ఇటీవలే దక్కిన పదవి ఉంటుందో... పోతుందో అంటూ వారు దిగులు పడుతున్నారు. ఈనెల 17న ఈ విషయంలో హైకోర్టు తీర్పు వస్తుందని అందరూ ఎదురుచూసినా కోర్టు 18కి, ఆ తర్వాత 19కి కేసును వాయిదా వేసింది. బుధవారం తీర్పు వెలువడుతుందని అందరూ భావిస్తున్నారు. ప్రాథమిక సహకార సంఘాలకు కమిటీలను నామినేట్‌ చేయడాన్ని కోర్టు తప్పు పట్టకపోతేనే పదవులు భద్రంగా ఉంటాయి.

ఫ 11 సంఘాలకు నామినేటెడ్‌ చైర్మన్లు, సభ్యులు

జిల్లాలో 30 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా మానకొండూరు, చొప్పదండి నియోజకవర్గాల్లోని 11 సంఘాలకు చైర్మన్లను, కమిటీ సభ్యులను కూడా ప్రభుత్వం నామినేట్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మానకొండూరు నియోజకవర్గంలోని గట్టుదుద్దనపల్లి సొసైటీకి గంగుల రాంరెడ్డి, మానకొండూరు సొసైటీకి నాగిశెట్టి రాజయ్య, దేవంపల్లి సొసైటీకి రొంటాల లక్ష్మారెడ్డి, ఊటూరు సొసైటీకి ముద్దసాని శ్రీనివాస్‌రెడ్డి, పోరండ్ల సొసైటీకి గోపు మల్లారెడ్డి, నుస్తులాపూర్‌ సొసైటీకి మోరపల్లి రమణారెడ్డి, చొప్పదండి నియోజకవర్గంలోని చొప్పదండి సొసైటీకి ఇప్ప శ్రీనివాస్‌రెడ్డి, రామడుగు సొసైటీకి కోల రమేశ్‌ చైర్మన్‌గా కమిటీలు వేశారు. తాడికల్‌ సొసైటీకి కీసర సంపత్‌, గద్దపాక సొసైటీకి బసవయ్య, మెట్‌పల్లి సొసైటీకి గాజుల మహేశ్‌ను చైర్మన్‌గా నామినేట్‌ చేశారు. వీరంతా ఆయా పదవులను స్వీకరించి విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాగే పలు సొసైటీలకు ఎమ్మెల్యేల ప్రతిపాదనల మేరకు చైర్మన్లను, కమిటీ సభ్యులను నామినేట్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో మరో 12 సొసైటీలకు పూర్తిస్థాయిలో ప్రతిపాదనలను సిద్ధం చేసి కోర్టు తీర్పు నేపథ్యంలో పెండింగ్‌లో ఉంచారు. ఇప్పటికే తాడికల్‌, గద్దపాక, మెట్‌పల్లి, పోరండ్ల, నుస్తులాపూర్‌ సొసైటీ కమిటీల నియామకంపై కోర్టులో పిటీషన్లు వేశారు. కోర్టు తీర్పు వెలువడేంత వరకు కొత్తగా నామినేటెడ్‌ కమిటీలు వేయవద్దని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తీర్పు ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా వస్తే వెంటనే మిగతా సొసైటీలకు పాలకవర్గాలను నియమించే అవకాశముంది. రానిపక్షంలో నామినేటెడ్‌ చైర్మన్లు, కమిటీ సభ్యులు పదవుల నుంచి వైదొలగాల్సి వస్తుంది. దీంతో నామినేటెడ్‌ పదవులు పొందిన వారు వాటి కోసం క్యూలో ఉన్నవారు, ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్న వారు కోర్టు తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఫ మిగిలిన కమిటీల కోసం ఆశావహుల యత్నాలు

మిగతా సొసైటీల్లో పదవులు దక్కించుకోవాలని చూస్తున్నవారు తమతమ నియోజకవర్గాల శాసనసభ్యులు, అధికారపార్టీ ఎమ్మెల్యే లేనిచోట పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిల చుట్టూ తిరుగుతూ తమ పేరును ప్రతిపాదించాలని పైరవీలు చేస్తున్నారు. కరీంనగర్‌ సొసైటీ పదవికి మూల వెంకటరవీందర్‌రెడ్డి, బండ గోపాల్‌రెడ్డి, కాంరెడ్డి రాంరెడ్డి, కాశెట్టి శ్రీనివాస్‌, బొమ్మ ఈశ్వర్‌గౌడ్‌ పోటీపడుతున్నారు. దుర్శేడ్‌ సొసైటీ చైర్మన్‌ పదవికి కోరుకంటి వేణుమాధవరావు, సాయిని తిరుపతి, మాజీ ఎంపీటీసీ శేఖర్‌ ప్రయత్నాల్లో ఉన్నారు. గంగాధర సొసైటీ చైర్మన్‌ పదవికి కర్ర విద్యాసాగర్‌రెడ్డి, బైరి సంపత్‌, రాచమల్ల భాస్కర్‌, కురిక్యాల సొసైటీ చైర్మన్‌ పదవికి పెంచాల తిరుమల్‌రావు, కర్ర బాపురెడ్డి, కొక్కరకుంట చైర్మన్‌ పదవికి ఒంటెల కృష్ణారెడ్డి, జువ్వాజి హరీష్‌ పోటీపడుతున్నారు. చిగురుమామిడి సొసైటీ చైర్మన్‌ పదవికి చిట్టుమల్ల రవి, సైదాపూర్‌ సొసైటీకి గుండారపు శ్రీనివాస్‌ పేర్లను పేరును మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారని సమాచారం. వెన్నంపల్లి సొసైటీకి సారాబుడ్ల రాజిరెడ్డి, అబ్బిడి కొండాల్‌రెడ్డి, పంతంగి రవి చైర్మన్‌ పదవి కోసం పోటీపడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆశిస్సులకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఆర్నకొండ సొసైటీకి ఎన్నం మనోహర్‌ పేరును చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్ల సత్యం ఖరారు చేశారని, చొప్పదండి సొసైటీకి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అవకాశం కల్పించడంతో ఆర్నకొండ సొసైటీ చైర్మన్‌ పదవిని బీసీకి ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. హుజురాబాద్‌ నియోజకవర్గంలోని హుజూరాబాద్‌, తుమ్మనపల్లి, జూపాక, ఇల్లందకుంట, మల్యాల, బోగంపాడ్‌, జమ్మికుంట, తనుగుల, ధర్మారం, వీణవంక సొసైటీలకు చైర్మన్లను, కమిటీ సభ్యుల పేర్లను ఖరారు చేసి ప్రభుత్వానికి నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్‌బాబు ప్రతిపాదనలు సమర్పించారని, కోర్టు తీర్పు తర్వాత, తీర్పుననుసరించి నిర్ణయం వెలువడుతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Updated Date - Aug 19 , 2026 | 01:32 AM