కార్మిక శక్తిపై సర్వే..
ABN , Publish Date - Sep 05 , 2026 | 01:16 AM
ఉపాధి, నిరుద్యోగాన్ని అంచనా వేయడానికి జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలోని వార్డులు, తొమ్మిది మండలాల్లో పలు గ్రామాలను పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేకు సన్నద్ధమయ్యారు. గతంలో ఐదు ఏళ్లకు ఒకసారి ఎంప్లాయిమెంట్, అన్‌ఎంప్లాయిమెంట్ సర్వే(ఈయూఎస్) జరిపేవారు. ఆస్థానంలో మరింత తరచుగా కార్మిక శక్తి గణాంకాలను అందుబాటులోకి తేవడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్(ఎన్‌ఎస్‌ఓ) ద్వారా 2017 సంవత్సరం నుంచి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేను నిర్వహిస్తున్నారు.
- జిల్లాలో మూడు నెలల పాటు పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే
- సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో 12 బ్లాక్‌లు, 12 గ్రామాల గుర్తింపు
- నిరుద్యోగం, ఉపాధి అవకాశాలపై గణాంకాల లెక్క
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ఉపాధి, నిరుద్యోగాన్ని అంచనా వేయడానికి జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలోని వార్డులు, తొమ్మిది మండలాల్లో పలు గ్రామాలను పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేకు సన్నద్ధమయ్యారు. గతంలో ఐదు ఏళ్లకు ఒకసారి ఎంప్లాయిమెంట్, అన్‌ఎంప్లాయిమెంట్ సర్వే(ఈయూఎస్) జరిపేవారు. ఆస్థానంలో మరింత తరచుగా కార్మిక శక్తి గణాంకాలను అందుబాటులోకి తేవడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్(ఎన్‌ఎస్‌ఓ) ద్వారా 2017 సంవత్సరం నుంచి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేను నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం జిల్లాల్లో పట్టణాలు, మండలాల్లో గ్రామాలను బ్లాకులుగా ఎంపిక చేసి సర్వే నిర్వహిస్తారు. 2026 సంవత్సరానికి సంబంధించి నవంబర్ వరకు సర్వే నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో సర్వేకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ సంవత్సరం 24 బ్లాకులుగా సర్వేకు పలు ప్రాంతాలు ఎంపిక చేశారు. మున్సిపాలిటీలో 8 వార్డులు, వేములవాడ మున్సిపాలిటీలో 4 వార్డులు, 9 మండలాల్లో 12గ్రామాలను బ్లాకులుగా ఎంపిక చేశారు. బోయినపల్లి మండలంలో వరదవెల్లి, ఇల్లంతకుంట మండలంలో అనంతగిరి, వంతడుపుల, ముస్తాబాద్ మండలంలో ఆవునూర్, తెర్లుమద్ది, గూడెం, రుద్రంగి మండలంలో మానాల, గంభీరావుపేట మండలంలో సముద్ర లింగాపూర్, కోనరావుపేట మండలంలో కోనరావుపేట, తంగళ్ళపల్లి మండలంలో నేరెళ్ల, వీర్నపల్లి మండలంలో వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలంలో ఎల్లారెడ్డిపేటలను ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా ఒకేసారి జరిగే ఉపాధి, నిరుద్యోగిత సర్వే ద్వారా ఆ సామాజిక, ఆర్థిక గణాంకాలను తయారుచేసిన దాని అధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి ప్రణాళికలను రూపకల్పన చేస్తారు. ఆర్థిక వ్యవస్థ, సాంకేతిక పరిణామాల వల్ల తక్కువ వ్యవధిలో కార్మికుల గణాంకాల్లో వచ్చే మార్పులు లెక్కిస్తారు. జనాభాలో ఉద్యోగుల నిష్పత్తి, నిరుద్యోగ రేటు అంచనా వేస్తారు. సర్వే కోసం అధికారులు ఈ-సిగ్మా సాఫ్ట్‌వేర్‌తో కూడిన ట్యాబ్‌లను ఉపయోగించి సమాచారాన్ని పొందుపరుస్తారు. కేంద్ర ప్రభుత్వం శాస్త్రీయంగా రూపొందించిన నమూనా పద్ధతి ఆధారంగా ఎంపికైన గ్రామాలు, పట్టణ బ్లాకుల్లో ఇళ్ల జాబితాలను, ఇంటిలోని సభ్యుల పూర్తి సమాచారాన్ని సేకరిస్తారు. ఇంటి పెద్ద వ్యక్తితో సంభాషించి విషయాలను తెలుసుకుంటారు. సర్వేలో ప్రతి ఇంటి నుంచి సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు.
జిల్లా జనాభాలో సగానికి పైగా కార్మికులే...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5,52,037 జనాభా ఉంటే 2,98,663 మంది వివిధ పనులు చేసుకునే కార్మికులు ఉన్నారు. ఇందులో 1.58 లక్షల మంది పురుషులు, 1.40 లక్షల మంది మహిళలు ఉన్నారు. సిరిసిల్ల కేంద్రంలో మరమగ్గాల పరిశ్రమలో ప్రత్యక్షంగా పరోక్షంగా 25వేల మంది కార్మికులు పనిచేస్తే బీడీ పరిశ్రమలో 35వేల మంది కార్మికులు ఉన్నారు. వ్యవసాయ రంగంలో కూలీలుగా లక్షా 17వేల 37 మంది ఉండగా, పురుషులు 48216 మంది, మహిళలు 53521 మంది ఉన్నారు. కుటీర పరిశ్రమల్లో 46647 మంది ఉండగా, 13647 మంది పురుషులు, 33000 మంది మహిళలు ఉన్నారు. రోజు వారిగా పని చేసే కూలీలతో పాటు ఇతర రంగాల్లో ఉన్న గుమస్తాలు లాంటి పనులు చేసే కార్మికులు 83వేల 528 మంది ఉండగా, పురుషులు 54533 మంది, మహిళలు 28995 మంది ఉన్నారు. వీరికి కనీసం కూలీ గిట్టుబాటు కాకపోగా కార్మిక చట్టాలు, సంక్షేమ పథకాలు అందకుండా కాలం వెల్లదీస్తున్నారు. జిల్లాలో కార్మికుల జీవితాలకు భద్రత లేకుండాపోయింది. లేబర్ అడ్డాలపై రోజు కూలీ దొరికితే కానీ కడుపు నింపుకోలేని కార్మికులు దర్శనమిస్తారు. బండెడు మోత మోసే హమాలీలకు భద్రత లేదు. ఏ ప్రమాదం జరిగినా వారిని పట్టించుకునే వారు ఉండరు. ముఖ్యంగా నేతన్నలు సిరిసిల్ల పవర్‌లూంలో నిత్యం కష్టపడితేనే గానీ కుటుంబం గడవని పరిస్థితి ఉంది. ఒరిస్సా లాంటి రాష్ట్రాల నుంచి పిల్లలతో తరలివచ్చి ఇటుక బట్టీల్లో, చాలీచాలని జీతాలతో కార్మికులు మగ్గిపోతున్నారు. బీడీ పరిశ్రమలో మహిళా కార్మికుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంటుంది. మహిళా కార్మికుల ఇండ్లన్నీ కార్ఖానాలుగా మార్చి పనిగంటలు లేకుండా పని చేయించుకుంటున్నారు. వారికి లభించే వేతనం కూడా తక్కువగా ఉండగా, ఆకు, తంబాకులో కూడా కోత విధించి నష్టానికి గురిచేస్తున్నారు. ఇలా ఏ రంగంలో చూసినా కార్మికులు కష్టాలనే అనుభవిస్తున్నారు.
జిల్లాలో వీబీ జీ రామ్‌జీలో 1.99 లక్షల మంది కూలీలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (వీబీజీ రామ్‌జీ) ద్వారా 98232 జాబ్ కార్డులు ఉండగా 199715 మంది కూలీలు ఉన్నారు. ఇందులో 102151 మంది మహిళలు ఉన్నారు. యాక్టివ్ కూలీల 57253 జాబ్ కార్డులో 86236 మంది పనిచేస్తున్నారు. మహిళలు 53410 మంది ఉన్నారు. కూలీల్లో ఎస్సీలు 52540మంది, ఎస్టీలు 15317 మంది, ఇతరులు 131858మంది ఉన్నారు. మండలాల్లో కూలీల్లో గంభీరావుపేటలో 27011, కోనరావుపేటలో 23436, బోయిన్‌పల్లిలో 14674, చందుర్తిలో 17094, ఇల్లంతకుంటలో 20990, ముస్తాబాద్‌లో 17715, వేములవాడలో 7332, ఎల్లారెడ్డిపేటలో 27938, రుద్రంగిలో 6308, తంగళ్ళపల్లిలో 16960, వీర్నపల్లిలో 9764, వేములవాడ రూరల్‌లో 10493 కూలీలు ఉన్నారు.
సిరిసిల్లలో వస్త్రోత్పత్తి రంగంలోనే కార్మికులకు ఉపాధి
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా 30352 వేల మరమగ్గాలు, డైయింగ్‌లు, సైజింగ్‌లు, వార్ఫిన్‌లపై 25 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. 12 గంటలకు పైగా పనిచేసిన నెలకు రూ.12 నుంచి 15వేల వరకు సంపాదించుకోగలుగుతున్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వ చేయూతతో నేత కుటుంబాలు పాత కష్టాలను అధిగమించి కొత్త అవకాశాలతో ముందుకు సాగుతున్నా పని గంటల పరిమితి లేకపోవడంతోనే మానసికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారు. కష్టాలు.. సుఖాలు.. విషాదాలు నిత్యం వెంటాడే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వస్త్ర పరిశ్రమలో సర్కార్ అందించే వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లు కార్మికులకు ఉపాధి ఇస్తున్నాయి. సిరిసిల్ల నేతన్నల చేతిలో మెరిసిన స్వశక్తి చీరలు ఆడపడుచుల చెంతకు చేరి మురిసిపోయాయి. ఇందిరా మహిళా శక్తి పథకంలో స్వశక్తి సంఘాల్లోని మహిళలకు చీరలను పంపిణీ చేశారు. పేద, ధనిక తేడా లేకుండా అందరికీ చీరలు ఇవ్వాలని భావించడం మహిళల్లో హర్షం వ్యక్తమైంది. ఇందిరా మహిళా శక్తి చీరలు ఎంతో అందంగా ఆకర్షణీయంగా సిరిసిల్ల మరమగ్గాల వస్త్ర పరిశ్రమలో ఉత్పత్తి అర్డర్లు పూర్తి చేశారు. తెలంగాణలోని వరంగల్, జగిత్యాల, నల్లగొండ, వికారాబాద్ లాంటి జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా నేత కార్మికులు సిరిసిల్లకు వచ్చి ఉపాధి పొందుతున్నారు.
సర్వేకు ప్రజలు సహకరించాలి
- శ్రీనివాసచారి, జిల్లా ప్రణాళిక శాఖ అధికారి
నిరుద్యోగిత, ఉపాధిపై పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేకు ప్రజలు సహకరించాలి. అధికారులకు అందించే సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాం. జిల్లాలో రెండు మున్సిపాలిటీల్లో ఎనిమిది బ్లాకులు, మండలాల్లో 12గ్రామాల్లో సర్వే జరుగుతుంది.