Share News

‘ఉపాధి’పై నిఘా

ABN , Publish Date - May 30 , 2026 | 01:09 AM

గ్రామీణ కూలీల వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పేరును మార్చడంతో పాటు పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. జూలై నుంచి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అజీవిక మిషన్‌ గ్రామీణ్‌ (జీరామ్‌జీ)గా మార్పునకు చర్యలు మొదలు పెట్ట్టింది.

‘ఉపాధి’పై నిఘా

- పనుల పర్యవేక్షణకు కమిటీలు

- గ్రామాల వారీగా ఏర్పాటు

- జిల్లాలో 97,880 జాబ్‌ కార్డులు

- ప్రస్తుతం పనులు చేస్తున్నవారు 83,390 మంది

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

గ్రామీణ కూలీల వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పేరును మార్చడంతో పాటు పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. జూలై నుంచి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అజీవిక మిషన్‌ గ్రామీణ్‌ (జీరామ్‌జీ)గా మార్పునకు చర్యలు మొదలు పెట్ట్టింది. రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేకుండా నేరుగా కూలీలకు డబ్బులు చెల్లింపు, పనుల గుర్తింపు ప్రత్యేక యాప్‌లను కూడా రూపొందించింది. ప్రతి సంవత్సరం రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేపట్టిన ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో పలు లోపాలు బయటపడుతున్నాయి. తనిఖీల్లో కొన్ని అక్రమా లు కూడా వెలుగు చూస్తున్న సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనుల్లో మార్గదర్శకాలు పాటించడం లేదంటూ పనిదినాలను తగ్గిస్తుంది. దీని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేసేందుకు అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా నిఘా వ్యవస్థ రూపకల్పనకు దృష్టి పెట్టింది. గ్రామ పంచాయతీల వారీగా పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయనుంది. పర్యవేక్షణ కమిటీ మార్గదర్శకాలు రానున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 260 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో ఆరుగురు సభ్యులతో ఉపాధి హామీ కమిటీ వేయనుండగా 260 కమిటీలల్లో 1560 మంది సభ్యులు ఉంటారు. ఆరుగురిలో ముగ్గురు మహిళలు ఉంటారు. ఒక ఉపాధ్యాయుడు, అంగన్వాడీ టీచర్‌, స్వశక్తి సంఘాల సభ్యులు, సోషల్‌ ఆడిట్‌ వనరుల వ్యక్తులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులను ఎంపిక చేస్తారు. గ్రామ సభల ద్వారా కనీసం ఆరు నెలల కాలానికి కమిటీ ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఉపాధి పనులను కూలీలు పూర్తి చేసిన తర్వాత వారం రోజులకు ఒకసారి పర్యవేక్షణ కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో వెళ్లి పనులను పరిశీలిస్తారు. మంజూరు. కూలీల హాజరు. వేతన చెల్లింపుల తీరు, పనుల్లో నాణ్యత అంశాలను పరిశీలిస్తారు. సామాజిక తనిఖీ సభలో పర్యవేక్షణ కమిటీలు తమ నివేదికను గ్రామ సభకు సమర్పించాల్సి ఉంటుంది. దీని ద్వారా గ్రామపంచాయతీ స్థాయిలో పర్యవేక్షణ కమిటీ వల్ల అక్రమాలు. అవకతవకలకు కట్టడి పడుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనుల్లో ఉదయం, మధ్యాహ్నం తర్వాత రెండు సార్లు ఫేస్‌ రికగ్నైజేషన్‌ సిస్టం యాప్‌లో కూలీల ఫోటోలు దిగే విధంగా చర్యలు తీసుకున్నారు. పర్యవేక్షణ కమిటీలతో మరింత పారదర్శకంగా ఉపాధి పనులు కొనసాగుతాయని భావిస్తున్నారు.

ఫ జిల్లాలో 1.97 లక్షల మంది కూలీలు

జిల్లాలో 97,880 జాబ్‌ కార్డులు ఉండగా 1,97,631 మంది కూలీలు ఉన్నారు. ఇందులో 1,01,259 మంది మహిళలు ఉన్నారు. పనులు చేస్తున్న కూలీలు 60,425 జాబ్‌ కార్డులో 83,390 మంది పనిచేస్తున్నారు. మహిళలు 51,949 మంది ఉన్నారు. కూలీలు ఎస్సీలు 51,943 మంది, ఎస్టీలు 15,164 మంది, ఇతరులు 1,30,524 మంది ఉన్నారు. ఉపాధి హామీ జాబ్‌ కార్డులో నమోదైన కూలీలకు బదులుగా మరొకరు హాజరవుతున్నారని ఆరోపణల నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు ఆధార్‌ అనుసంధానం వేగంగా జరుగుతున్నది.

ఉపాధి కూలీల వివరాలు

మండలం జాబ్‌ కార్డులు కూలీలు

బోయిన్‌పల్లి 7572 14465

చందుర్తి 8008 16991

ఇల్లంతకుంట 10611 20563

గంభీరావుపేట్‌ 97880 197631

కోనరావుపేట 11237 23328

ముస్తాబాద్‌ 10149 17363

రుద్రంగి 3073 6168 తంగళ్లపల్లి 8970 16774

వీర్నపల్లి 4290 9693

వేములవాడ 4010 7220

వేములవాడరూరల్‌ 5339 10362

ఎల్లారెడ్డిపేట 12305 27803

----------------------------------------------------------------------

మొత్తం 97,880 1,97,631

Updated Date - May 30 , 2026 | 01:09 AM