నిఘా పక్కా..
ABN , Publish Date - Jun 27 , 2026 | 12:50 AM
ఖరీఫ్ సాగు ప్రారంభమైంది. ఎల్‌నినో ప్రభావంతో రైతులు సాగుపై ఆందోళనగా ఉన్నప్పటికీ వర్షాలు పడతాయనే ఆశతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో విత్తనాలు, ఎరువులు సమకూర్చుకుంటున్నారు. ఇప్పటికే రైతులు జిల్లాలో పంటలు వేసేందుకు దుక్కులు సిద్ధం చేసుకున్నారు. బోరు బావుల వద్ద నీటి వసతిని దృష్టిలో పెట్టుకొని నారుమడి సిద్ధం చేసుకుంటున్నారు.
- ఎరువుల విక్రయాలపై ‘నిగ్రానీ‘ పర్యవేక్షణ
- జిల్లాలో మూడంచెల కమిటీల ఏర్పాటు
- 260 గ్రామాల్లో సర్పంచ్ చైర్మన్‌గా కమిటీలు
- వానాకాలం సాగు అంచనా 2.48 లక్షల ఎకరాలు
- 57,399 మెట్రిక్‌టన్నుల ఎరువుల వినియోగం
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ఖరీఫ్ సాగు ప్రారంభమైంది. ఎల్‌నినో ప్రభావంతో రైతులు సాగుపై ఆందోళనగా ఉన్నప్పటికీ వర్షాలు పడతాయనే ఆశతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో విత్తనాలు, ఎరువులు సమకూర్చుకుంటున్నారు. ఇప్పటికే రైతులు జిల్లాలో పంటలు వేసేందుకు దుక్కులు సిద్ధం చేసుకున్నారు. బోరు బావుల వద్ద నీటి వసతిని దృష్టిలో పెట్టుకొని నారుమడి సిద్ధం చేసుకుంటున్నారు. రైతులకు అవసరమయ్యే ఎరువులను అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం యాప్ ద్వారా ఎరువులను బుక్ చేసుకునే దిశగా ఏర్పాటు చేసింది. విత్తనాలు, ఎరువులు పక్కదారి పట్టకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఎరువుల విక్రయాలు, వినియోగంపై పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసింది.
జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు ‘నిగ్రానీ’ నిఘా
వానకాలం పంటల సాగు ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు అవసరమైన ఎరువుల పంపిణీ పర్యవేక్షించే విధంగా కేంద్ర ప్రభుత్వం ధరిత్రి మాతా బచావో అభియాన్(నిగ్రానీ) పేరుతో మూడంచెల కమిటీలను ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు కమిటీలు ఎరువుల దుర్వినియోగాన్ని అరికట్టడం, బ్లాక్ మార్కెట్‌కు ఎరువులు వెళ్లకుండా నియంత్రించడం, భూసారాన్ని రక్షించడం వంటి చర్యలు చేపడుతాయి. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన కమిటీ పని చేస్తుంది. ఇందులో జిల్లా ఎస్పీ, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, సహకార శాఖ అధికారులు ఉంటారు. డివిజన్ స్థాయి కమిటీలో ఆర్డీవో, డివిజనల్ వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. కీలకంగా గ్రామస్థాయిలోనే కమిటీ పర్యవేక్షణ ఎక్కువగా ఉంటుంది. జిల్లాలోని 260 గ్రామపంచాయతీల పరిధిలో ప్రతి గ్రామంలో సర్పంచ్ చైర్మన్‌గా ఏడు మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో పంచాయతీ కార్యదర్శి, సభ్యులు, డ్రోన్ దీదీలు, ప్రగతిశీల రైతు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, లేదా రైతు ఉత్పత్తిదారుల సంఘం డైరెక్టర్‌ల నుంచి ఒకరు, గ్రామస్థాయి వ్యవసాయ శాఖ అధికారి ఉంటారు. ప్రతి వ్యవసాయ సీజన్ ఖరీఫ్, రబీలో రెండుసార్లు గ్రామపంచాయతీ స్థాయిలో గ్రామసభలు నిర్వహిస్తారు. ఎరువుల కొరత, బ్లాక్ మార్కెట్‌కు తరలించే వాటిపై సమీక్షిస్తారు. రైతులు ఫిర్యాదులు కూడా చేయవచ్చు. గ్రామంలో 7 మంది నిగ్రానీ కమిటీ సభ్యులు క్రమం తప్పకుండా రైతులతో అవగాహన సదస్సులు నిర్వహించాల్సి ఉంటుంది. గ్రామస్థాయి కమిటీలు ఎరువులను కొనుగోలు, బ్లాక్ మార్కెట్ కాకుండా పర్యవేక్షించడం, సబ్సిడీ యూరియా నాన్ అగ్రికల్చరల్ అవసరాలకు తరలి వెళ్లకుండా నిఘా పెట్టడం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా శాస్త్రవేత్తల సహాయంతో భూసార పరీక్ష కార్డులను పంపిణీ చేసి ఎరువుల వాడకంలో రైతులకు అవగాహన కల్పిస్తారు. కమిటీల పర్యవేక్షణలో రైతులకు ఎరువుల సరఫరాలో ఇబ్బందులు లేకుండా ఉంటుందని భావిస్తున్నారు.
వానాకాలం సాగు 2.48 లక్షల ఎకరాలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలంలో 2 లక్షల 48 వేల 507 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. ఇందులో వరి లక్షా 91 వేల366 ఎకరాలు, పత్తి 47120ఎకరాలు, పెసర 65 ఎకరాలు, కందులు 853 ఎకరాలు, జొన్నలు 14, మొక్కజొన్న 3430 ఎకరాలు, ఇతర పంటలు 5593 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనాలు వేశారు. గంభీరావుపేట మండలంలో 19871 ఎకరాలు, ఇల్లంతకుంటలో 38238ఎకరాలు, ముస్తాబాద్‌లో 26879ఎకరాలు, సిరిసిల్లలో 5447ఎకరాలు, తంగళ్లపల్లిలో 24052ఎకరాలు, వీర్నపల్లిలో 8296ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 21914ఎకరాలు, బోయినపల్లిలో 21260ఎకరాలు, చందుర్తిలో 21512 ఎకరాలు, కోనరావుపేటలో 24187ఎకరాలు, రుద్రంగిలో 10287 ఎకరాలు, వేములవాడలో 10942 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 15622 ఎకరాలు అంచనాలు వేశారు. ఇందుకోసం వరి 56789 క్వింటాళ్ల విత్తనాలు, అవసరం అవుతాయని అంచనాలు వేయగా కందులు 120.6 క్వింటాళ్లు, మొక్కజొన్న 59.84 క్వింటాళ్లు, పత్తి 123790 ప్యాకెట్లు, పెసర్లు 4.18 క్వింటాళ్లు అవసరం అవుతాయని అంచనాలు వేశారు. వానాకాలం సాగుకు సంబంధించి 2.48 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తుండగా ఎరువులు 57399 మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయని అంచనాలు వేశారు. యూరియా 25944 మెట్రిక్ టన్నులు, డీఏపీ 3760 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 22710మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 4225 మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌పీ760 మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయని అంచనాలు వేశారు.
జిల్లాలో ఖరీఫ్ సాగుకు కావాల్సిన ఎరువులు(మెట్రిక్‌టన్నులు)
మండలం యూరియా డీఎపీ ఎన్‌పీకేఎస్ ఎంవోపీ ఎస్‌ఎస్‌పీ
గంభీరావుపేట 2200 200 1700 450 80
ఇల్లంతకుంట 3950 400 3600 600 120
ముస్తాబాద్ 2900 400 2600 250 50
సిరిసిల్ల 650 60 550 100 20
తంగళ్లపల్లి 2100 280 2100 460 80
వీర్నపల్లి 1024 90 860 150 25
ఎల్లారెడ్డిపేట 2200 700 1800 550 100
బోయినపల్లి 2500 750 2200 400 50
చందుర్తి 2200 210 2100 330 70
కోనరావుపేట 2500 310 1700 400 70
రుద్రంగి 1120 110 1080 155 30
వేములవాడ 1040 110 1020 140 25
వేములవాడ రూరల్ 1560 140 1400 240 40
--------------------------------------------------------------------------------------------------------------------------------------------
మొత్తం 25944 3760 22710 4225 760
--------------------------------------------------------------------------------------------------------------------------------------------