సన్న వరి సాగుకు సై
ABN , Publish Date - Jun 27 , 2026 | 01:10 AM
కేంద్ర ప్రభుత్వం సన్న వరి రకాలనే సేకరించాలని నిర్ణయించడం, రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో సన్నబియ్యం భోజనం వడ్డించడం, కేంద్రం కొనుగోలు చేసిన మేరకే ధాన్యం సేకరిస్తామనడంతో రైతులు అనివార్యంగా సన్నవరి రకాల సాగుకు సన్నద్ధమవుతున్నారు
- విత్తనాలకు డిమాండ్
- ధరలు పెంచిన వ్యాపారులు
- వర్షంపైనే ఆధారం... ప్రాజెక్టులు నిండితేనే పంట
- విత్తనాలకు, క్రిమిసంహారక మందులకు పెరుగనున్న పెట్టుబడి
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
కేంద్ర ప్రభుత్వం సన్న వరి రకాలనే సేకరించాలని నిర్ణయించడం, రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో సన్నబియ్యం భోజనం వడ్డించడం, కేంద్రం కొనుగోలు చేసిన మేరకే ధాన్యం సేకరిస్తామనడంతో రైతులు అనివార్యంగా సన్నవరి రకాల సాగుకు సన్నద్ధమవుతున్నారు. పంటకాలం పెరగడంతో పాటు చీడపీడలు ఎక్కువగా ఆశించే అవకాశాలుండడంతో పెట్టుబడి ఎక్కువ అవుతుందనే భయం ఉన్నా రైతులు సన్న వరి రకాల సాగుచేయడం తప్పడం లేదు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సేకరించే ధాన్యంతో సరిపెట్టకుండా పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడంతో స్వల్పకాలిక దొడ్డు రకం వరిని ఎక్కువగా పండించే వారు. దొడ్డు రకం పారాబాయిల్డ్ రైస్‌కు అనువుగా ఉండడంతో మిల్లర్లు కూడా కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చేవారు. ఇప్పుడు ప్రభుత్వం సన్నవరి రకాలనే అది కూడా రాష్ట్రంలో, బయటా డిమాండ్ ఉన్న ఏడు రకాల వరిని మాత్రమే సాగు చేయాలని వ్యవసాయ శాఖ ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నది. తెలంగాణ సోన, కూనారం వరి-2, జై శ్రీరాం, కేఎనఎం-7715, బీపీటీ (సాంబమసూరి), హెచఎంటీ సోనా, వరంగల్-44, (సిద్ది) రకాలను సాగు చేయమని ప్రభుత్వం సూచిస్తున్నది.
ఫ వర్షాభావ పరిస్థితులపై ఆందోళన
రెండు కాలాలకు అనుకూలమైన తెలంగాణ సోనా, కూనారం వరి-2 రకాలపై రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. మిగతా ఐదు రకాలు కూడా వానాకాలం సాగుకు అనుకూలమైనవి అయినా సాంబమసూరి 145-150 రోజులు, హెచఎంటి సోనా 135 రోజులు, డబ్ల్యూజిఎల్ -44 145 నుంచి 150 రోజులు పంటకాలం కావడంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ ఇంకా నార్లు కూడా పోయలేని పరిస్థితిలో ఉన్నారు. మరో వైపు దీర్ఘకాలిక పంటలకు నీరు అందదేమోనని రైతులు ఆందోళన పడుతున్నారు. తెలంగాణ సోనా 125 రోజులు, కూనారం వరి-2 120 నుంచి 125 రోజులు పంటకాలం కావడంతోపాటు అతి సన్నరకం గింజ ఉండడం, దిగుబడి ఎకరాకు 26 నుంచి 30 క్వింటాళ్ల చొప్పున రావడం, అగ్గి తెగులు, పొట్టకుల్లు తెగులు, కుల్లికోడు తెగుళ్లను ఈ రకాలు తట్టుకునే పరిస్థితి ఉండడంతో రైతులు వాటి సాగు పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. జైశ్రీరాం, కేఎనఎం-7715, హెచఎంటీ సోనా రకాలకు 135 రోజుల పంట కాలం ఉంటుంది. దిగుబడి 25 నుంచి 28 క్వింటాళ్లు ఎకరాకు వచ్చే అవకాశ మున్నది. వీటికి కూడా రెండవ ప్రాధాన్యత క్రమంలో సాగు చేయవచ్చని ఆలోచిస్తున్నారు. జిల్లాలో ఈ సీజనలో 2,79,000 ఎకరాల్లో వరి సాగు జరుగుతుందని, దీనికి 83,700 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఏడు సన్న రకాలలో కూనారం-2, తెలంగాణ సోనాకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో వ్యాపారస్తులు అన్ని విత్తనాలను అందుబాటులో ఉంచినా ఈ రకం విత్తనాలను ఎక్కువగా స్టాక్ పెట్టారని సమా చారం. ప్రభుత్వం సన్నరకాలనే సాగు చేయాలనడంతో వ్యాపారులు సన్నరకాల విత్తనాల ధరలు పెంచారు. ఇటీవలి వరకు 25 కిలోల సన్నరకాల విత్తనం బ్యాగ్‌కు 900 రూపాయలకు విక్రయించేవారు. ప్రస్తుతం దీని ధరను 1200 రూపాయలకు పెంచారు. అన్ని రకాల సన్న విత్తనాల ధరలు కూడా బ్యాగ్‌కు డిమాండ్‌ను బట్టి 200 నుంచి 300 రూపాయలు పెంచి అమ్ముతున్నారు.
ఫ విత్తనాలు ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు
- జిల్లా వ్యవసాయశాఖ అధికారి భాగ్యలక్ష్మి
ప్రభుత్వం సన్న వరి రకాల సాగును ప్రోత్సహిస్తుండడంతో విత్తన వ్యాపారులు ధర పెంచారని మా దృష్టికి వచ్చింది. ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు అమ్మితే ఆ వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం. జిల్లాలో వానాకాలం సాగుకు అవసరమైన మేరకు విత్తనాల స్టాక్ అందుబాటులో ఉన్నది. ప్రభుత్వ సూచించిన ఏడు సన్నరకాల విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడింటిలో కూనారం వరి-2 (కెఎనఎం-1638) రకాన్ని సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. పంటకాలం ఎక్కువ తక్కువ కాకుండా మధ్యస్థంగా ఉండడం, అధిక దిగుబడి వచ్చే అవకా శముండడంతో రైతులు దీని సాగుపట్ల ఆసక్తి చూపిస్తున్నారు.