Share News

విజయోస్తు

ABN , Publish Date - Mar 14 , 2026 | 01:24 AM

పదో తరగతి పరీక్షలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. శనివారం నుంచి ఏప్రిల్‌ 14వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలోని 224 ప్రభుత్వ, 104 ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల నుంచి 12,693 మంది విద్యార్థులు రెగ్యులర్‌గా, మరో 59 మంది ప్రైవేటు పరీక్షలకు హాజరు కానున్నారు.

విజయోస్తు

- నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

- ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు

- జిల్లాలో హాజరుకానున్న 12,693 మంది విద్యార్థులు

- 68 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు

జగిత్యాల, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. శనివారం నుంచి ఏప్రిల్‌ 14వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలోని 224 ప్రభుత్వ, 104 ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల నుంచి 12,693 మంది విద్యార్థులు రెగ్యులర్‌గా, మరో 59 మంది ప్రైవేటు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందుకోసం జిల్లాలో 68 కేంద్రాలను ఏర్పాటు చేశారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లు, అసిస్టెంట్‌ రూట్‌ ఆఫీసర్లను పరీక్షల పర్యవేక్షణ నిమిత్తం కేటాయిం చారు. ప్రతీ కేంద్రంలో సరిపడా ఇన్విజిలేషన్‌ సిబ్బందిని నియమించారు. పరీక్షలో ఎటువంటి మాస్‌ కాపీయింగ్‌కు తావు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కేంద్రాలను తనిఖీ చేసేలా ప్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను నియమించారు. పలు ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను డీఈవో రాము పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి సందేహాలున్నా 9494780085 టోల్‌ఫ్రీ నంబరులో సంప్రదించే విధంగా ఏర్పాట్లు చేశారు.

ఫకేంద్రాల వద్ద పటిష్ట భద్రత

జిల్లాలోని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. పరీక్ష కేంద్రానికి వంద మీటర్లు పరిధిలో ఉన్న జిరాక్స్‌ కేంద్రాలను మూసివేసేలా కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఆదేశాలు ఇచ్చారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, ఇతర ఎలకా్ట్రనిక్‌ పరికరాలను అనుమతించరు. ఇన్విజిలేషన్‌ సిబ్బంది, చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లు కూడా కేంద్రాల్లోకి సెల్‌పోన్లు తీసుకురావడానికి వీల్లేదు.

పరీక్ష కేంద్రాల్లో నిబంధనలు..

ఫ విద్యార్థులు ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.

ఫపరీక్ష ప్రారంభం అయిన తర్వాత 5 నిమిషాల వరకు అనుమతి ఇస్తారు.

ఫ పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్షా కేంద్రం నుంచి బయటికి వెళ్లడానికి అనుమతి లేదు.

ఫ కేంద్రంలోకి చీఫ్‌ సూపరింటెండెంట్‌ తప్ప ఎవరూ మొబైల్‌ ఫోన్‌ తీసుకురావద్దు.

విద్యార్థులకు సూచనలు....

ఫ హాల్‌టికెట్‌ తప్పనిసరిగా తీసుకురావాలి.

ఫ సెల్‌ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, బ్లూటూత్‌ డివైజులు, స్మార్ట్‌ వాచ్‌లు తదితర ఎలకా్ట్రనిక్‌ గాడ్జెట్‌లు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు.

ఫ ఎండలు తీవ్రత దృష్ట్యా ప్రతి కేంద్రంలో తాగునీరు, నిరంతర విద్యుత్‌ ఉండేలా చర్యలు చేపట్టారు.

ఫ ప్రతి కేంద్రంలో ఆశా కార్యకర్త, ఏఎన్‌ఎం అందుబాటులో ఉంటారు.

పదో తరగతి పరీక్ష ఏర్పాట్ల వివరాలు..

జిల్లాలో పరీక్ష కేంద్రాలు..68

రెగ్యులర్‌ విద్యార్థులు..12,693 మంది

చీఫ్‌ సూపరింటెండెంట్లు...68 మంది

డిపార్ట్‌మెంటల్‌ అధికారులు...68 మంది

ఇన్విజిలేటర్లు...725 మంది

పరీక్ష పత్రాలను భద్రపరిచే పాయింట్లు...15

ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు...4

జిల్లా హెల్ప్‌లైన్‌ నంబర్‌...9494780085

పకడ్బందీ ఏర్పాట్లు చేశాం

- రాము, జిల్లా విద్యాశాఖ అధికారి

జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. ఇన్విజిలేటర్లకు, సీఎస్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చాము. ఉద్యోగులు, సిబ్బందికి ఎప్పటికప్పుడు తగిన సూచనలు ఇస్తున్నాము. విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలి.

Updated Date - Mar 14 , 2026 | 01:24 AM