ఆసుపత్రిలో అధ్వానంగా భోజనం..
ABN , Publish Date - Aug 01 , 2026 | 12:26 AM
నిరుపేదలు, అల్పాదాయ వర్గాలకు మెరుగైన వైద్య సేవలతో పాటు వారు త్వరగా కోలుకునేందుకు ఉచితంగా నాణ్యమైన పోషక విలువలతో కూడిన అల్పాహారం ఆహారం అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నది. మెరుగైన వైద్య సేవలు అటుంచి మేలు కలిగించే సరైన ఆహారం కూడా అందడం లేదని రోగులు వారి బంధువులు వాపోతున్నారు.
- ఇడ్లీ లేదు.. పొంగల్ లేదు..
- గుడ్డు ఇచ్చేదే లేదు
- అమలుకాని మెనూ
- పట్టించుకోని అధికారులు
(ఆంఽధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
నిరుపేదలు, అల్పాదాయ వర్గాలకు మెరుగైన వైద్య సేవలతో పాటు వారు త్వరగా కోలుకునేందుకు ఉచితంగా నాణ్యమైన పోషక విలువలతో కూడిన అల్పాహారం ఆహారం అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నది. మెరుగైన వైద్య సేవలు అటుంచి మేలు కలిగించే సరైన ఆహారం కూడా అందడం లేదని రోగులు వారి బంధువులు వాపోతున్నారు. ఇన్‌పేషంట్లకు ఆహారం అందించే బాధ్యతను కాంట్రాక్ట్ ఏజెన్సీలకు అప్పగించారు. వాటి పనితీరును పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో ఆసుపత్రిలో భోజనం అధ్వానంగా మారాయనే విమర్శలు వస్తున్నాయి.
ఫ 500 పడకలు
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు అందించే ఆహారంపై పలు ఫిర్యాదులు వస్తున్నాయి. ఆహార పదార్థాల్లో నాణ్యత లోపించడంతో పాటు నిర్ణీత మెనూను పాటించడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 350 పడకలతోపాటు మాతా శిశు సంరక్షణ సెంటర్‌లో 150 పడకలు ఉంటాయి. ఐదు వందల మంది ఈ ఆసుపత్రిలో ఇన్ పేషంట్లుగా ఉంటారు. ఒక్కోసారి ఇన్‌పేషంట్ల సంఖ్య 750 నుంచి 800కు పెరుగుతూ ఉంటుంది. ఇన్ పేషంట్లకు ప్రభుత్వం ఉదయం పూట అల్పాహారం టీ పాలు, మద్యాహ్నం, రాత్రి భోజనాన్ని ఉచితంగా సమకూరుస్తుంది. మెనూ ప్రకారం అల్పాహారంగా ఒక రోజు ఇడ్లీ, ఒక రోజు ఉప్మా, పొంగల్, కిచిడి, బ్రెడ్డు అందించాల్సి ఉంటుంది. టిఫిన్‌తోపాటు పాలు, టీ కూడా ఇస్తారు. మధ్యాహ్న భోజనంలో అన్నంతోపాటు ఒక కూర, పాలకూర పప్పు, సాంబారు, అరటి పండు ఇవ్వాల్సి ఉంటుంది. రాత్రి పూట అన్నం లేదా డాక్టర్ల సూచన మేరకు కొందరికి చపాతి ఇవ్వాలి. వీటితో పాటు కూర పాలకూర పప్పు, సాంబారు మెనుగా ఉంటుంది. మూడు పూటలా బాయిల్డ్ ఎగ్ ఇవ్వాలి. ఆస్పత్రిలో మాత శిశు సంరక్షణ కేంద్రంలో ఇదే మెనూను పాటించాలి. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో అదనంగా తల్లులకు పల్లిపట్టీ ఇవ్వాలి. ఈ మెనూను రోగులకు అందించడానికి ఒక్కో పేషంట్‌కు రోజుకు 72 రూపాయల చొప్పున కాంట్రాక్ట్ ఏజెన్సీకి చెల్లిస్తారు. గర్భిణులకు, టీబీ పేషంట్లకు, రక్తం తక్కువగా ఉన్న వారికి హై ప్రోటీన్ డైట్ అందించాల్సి ఉంటుంది. ఇందుకు భోజన ఛార్జీలుగా 112 రూపాయలు కాంట్రాక్టర్‌కు చెల్లిస్తారు. జిల్లాకేంద్ర ఆసుపత్రికి ఆహారం సరాఫరా చేసి కాంట్రాక్ట్ ఏజెన్సీ నాణ్యత విషయంలో, మెనూ పాటించే విషయంలో నిబంధనలు పాటించడం లేదని రోగులు వారి బంధువులు ఆరోపిస్తున్నారు.
ఫ అల్పాహారంగా ప్రతీ రోజు దొడ్డు రవ్వ ఉప్మానే..
అల్పాహారంగా రోజుకు ఒకటి చొప్పున ఐదు రకాల టిఫిన్లను అందించాల్సి ఉండగా, ప్రతీరోజు దొడ్డు రవ్వ ఉప్మానే రోగులకు ఇస్తున్నారు. మూడు పూటలా బాయిల్డ్ ఎగ్ ఇవ్వాల్సి ఉండగా వాటిని ఇవ్వడం లేదు. అల్పాహారంతో ఇచ్చే పాలు పలుచగా, తక్కువగా ఇస్తున్నారని రోగులు విమర్శిస్తున్నారు. భోజనంతోపాటు ఇవ్వాల్సిన అరిటి పండును గర్భిణులకు మాత్రమే ఇస్తున్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో తల్లులకు, గర్భిణులకు పల్లీ పట్టిని కూడా ఇవ్వడం లేదు.
అల్పాహారం, భోజనం అందించే విషయంలో సమయ పాలన కూడా పాటించడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లేని ఆహారం, సరైన సమయంలో ఇవ్వకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. వారి వెంట ఉన్న బంధువులు లయన్స్ క్లబ్ వారు ప్రభుత్వ ఆ సుపత్రి వద్ద ప్రతి రోజు ఉచితంగా అందించే అల్పాహారాన్ని తెచ్చుకుంటు న్నారు. మధ్యాహ్నం, రాత్రి స్వచ్ఛంద సంస్థలు సమకూర్చే భోజనం తెచ్చుకుంటున్నారు. ఆసుపత్రిలో జరుగుతున్న ఈ అవకతవకలను ఆసుపత్రి సూపరిండెంట్ గాని, రెసిడెంట్ మెడికల్ ఆపీసర్ గాని పట్టించుకోక పోవడం వల్లనే ఈ విధంగా రోగులు ఇబ్బంది పడాల్సి వస్తున్నదని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ ఆసుపత్రిలో జరగుతున్న వ్యవహారాలపై దృష్టి సారించాలని రోగులు కోరుతున్నారు.
ఫ భోజనం సరిగా లేకపోతే ఫిర్యాదు చేయాలి..
- డాక్టర్ వీరారెడ్డి, ఆసుపత్రి సూపరిండెంట్
మెనూ ప్రకారం అల్పాహారం, భోజనం అందించకపోతే ఫిర్యాదు చేయాలి. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. రోగుల వెంట ఉండే అటెండెంట్‌తో క్యాంటిన్ సిబ్బంది దురుసుగా వ్యవహరించినట్లు గతంలో నా దృష్టికి వస్తే హెచ్చరించాను. రోగుల భోజనం నాణ్యత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటాం.